వైకాపా ప్రభుత్వాన్ని గద్దె దింపే వరకు పోరాటం ఆగదు: బుచ్చయ్య చౌదరి

అరాచక పాలన సాగిస్తున్న వైకాపా ప్రభుత్వాన్ని గద్దె దింపే వరకు పోరాటం ఆగదని తెదేపా ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి స్పష్టం చేశారు.

Published : 25 Mar 2023 05:06 IST

ఈనాడు డిజిటల్‌, అమరావతి: అరాచక పాలన సాగిస్తున్న వైకాపా ప్రభుత్వాన్ని గద్దె దింపే వరకు పోరాటం ఆగదని తెదేపా ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి స్పష్టం చేశారు. అసెంబ్లీ వెలుపల తెదేపా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘పట్టభద్రుల, ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు నియంత పాలనను పారద్రోలేందుకు నాంది పలికాయి. ఈ ఎన్నికల్లో తెదేపా విజయాన్ని ప్రజాస్వామ్యవాదులు హర్షిస్తున్నారు. చేతగాని ప్రభుత్వం వల్ల రాష్ట్రం సర్వనాశనమైపోతోంది. ఆర్థికంగా దివాలా తీస్తోంది. అనేక సమస్యలు పెండింగ్‌లో ఉన్నాయి. అభివృద్ధి అనేది ఎక్కడా కనిపించడం లేదు. ప్రభుత్వంపై ప్రజలే కాకుండా వైకాపా ఎమ్మెల్యేలు కూడా తిరుగుబాటు చేసే పరిస్థితి వచ్చింది. చట్టసభలో ప్రతిపక్ష సభ్యులకు మైక్‌ ఇచ్చి ప్రజా సమస్యలపై మాట్లాడే అవకాశం ఇవ్వాలి. నాలుగేళ్లలో ఒక్కరోజు కూడా సభ సజావుగా జరగలేదు. రోజూ తెదేపా సభ్యుల్ని బయటికి పంపి తప్పుడు ప్రచారం చేస్తున్నారు. వైకాపా ప్రభుత్వం రాజ్యాంగం కల్పించిన హక్కుల్ని కాలరాస్తోంది. జీవో నంబర్‌ 1ను ప్రజలపై రుద్దుతోంది. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం’ అని పేర్కొన్నారు. సరిపడా ఎమ్మెల్యే సీట్లుండీ ఆ కోటాలో ఎమ్మెల్సీ స్థానాలను గెలవలేకపోవడం జగన్‌ అసమర్థతకు నిదర్శనమని తెదేపా ఎమ్మెల్సీ బీటీ నాయుడు పేర్కొన్నారు. దీనికి నైతిక బాధ్యత వహించి ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని