జైలుకు పంపినా... ప్రశ్నిస్తూనే ఉంటా

‘అదానీ షెల్‌ కంపెనీల్లోకి రూ.20వేల కోట్లు వచ్చాయి. ఆ డబ్బు ఆయనది కాదు. అది ఎవరి నుంచి వచ్చిందో చెప్పాలని మేం ప్రశ్నిస్తున్నాం. దానికి భయపడే ఇప్పుడు నాపై అనర్హత వేటు వేశారు.

Updated : 26 Mar 2023 06:43 IST

నేను క్షమాపణలు చెప్పను
సావర్కర్‌లా లొంగిపోయేవాడిని కాదు..
శాశ్వతంగా సభ్యత్వాన్ని రద్దు చేసినా వెనక్కి తగ్గను
ఆ రూ.20వేల కోట్లు ఎవరివి, అదానీ షెల్‌ కంపెనీల్లోకి ఎలా వచ్చాయో తెలియాల్సిందే
దీనికి సమాధానం చెప్పలేకే నాపై అనర్హత వేటు
అదానీ అంశంలో నిలదీస్తుంటే మోదీ కళ్లల్లో భయం చూశా
కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ వ్యాఖ్యలు

ఈనాడు, దిల్లీ: ‘అదానీ షెల్‌ కంపెనీల్లోకి రూ.20వేల కోట్లు వచ్చాయి. ఆ డబ్బు ఆయనది కాదు. అది ఎవరి నుంచి వచ్చిందో చెప్పాలని మేం ప్రశ్నిస్తున్నాం. దానికి భయపడే ఇప్పుడు నాపై అనర్హత వేటు వేశారు. శాశ్వతంగా సభ్యత్వం రద్దు చేసినా నేను భయపడను. రూ.20వేల కోట్లు ఎవరివి అన్న ప్రశ్నకు జవాబు వచ్చేంతవరకూ నిలదీస్తూనే ఉంటా’ అని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ పేర్కొన్నారు. తనపై అనర్హత వేటు వేస్తూ లోక్‌సభ సచివాలయం నోటిఫికేషన్‌ జారీ చేసిన నేపథ్యంలో ఆయన శనివారం దిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ‘అదానీ, నరేంద్ర మోదీ మధ్య ఉన్న సంబంధం గురించి పార్లమెంటులో పూర్తిగా వివరించా. మీడియాలో వచ్చిన సాక్ష్యాలు చూపా. వారి మధ్య బంధం కొత్తది కాదు... మోదీ గుజరాత్‌ ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ఆ బంధం కొనసాగుతోంది. తన స్నేహితులతో కలిసి మోదీ విలాసవంతమైన విమానంలో ప్రయాణిస్తున్న ఫొటోలు నేను ప్రజలకు చూపించా. అదానీ కంపెనీలలోకి వచ్చిన రూ.20వేల కోట్లు ఎవరివి? అని ప్రశ్నించా. దానికి సమాధానం చెప్పకుండా నా పార్లమెంటు ప్రసంగాన్ని రికార్డుల నుంచి తొలగించారు. దీనిపై స్పీకర్‌కు పూర్తి వివరాలతో లేఖ రాశా. నిబంధనలను మార్చి అదానీకి ఎయిర్‌పోర్టులు ఎలా ఇచ్చారో చెప్పా. కానీ ఫలితం లేకపోయింది. నేను విదేశీ శక్తుల మద్దతు కోరినట్లు మంత్రులే పార్లమెంటులో అబద్ధాలు చెప్పారు. సభలోని సభ్యుడిపై ఎవరైనా ఆరోపణలు చేస్తే దానికి జవాబిచ్చే హక్కు ఆయనకు ఉంటుంది కాబట్టి నాకు మాట్లాడే అవకాశం ఇవ్వాలని వరుసగా రెండు లేఖలు రాసినా స్పందన రాలేదు. దాంతో ఛాంబరుకు వెళ్లి స్పీకర్‌ను కలిసి నాకు మాట్లాడేందుకు అవకాశం ఎందుకు ఇవ్వడం లేదని అడిగితే ఆయన చిరునవ్వు నవ్వి నేను అది చేయలేను. కావాలంటే కలిసి టీ తాగుదాం రమ్మని చెప్పారు. దాని తర్వాత ఏం జరిగిందన్నది అందరికీ తెలుసు. నాపై అనర్హత వేటు వేసి, భయపెట్టి, జైల్లో వేసి నా నోరు మూయించాలనుకుంటే అది సాధ్యం కాదు. అలాంటి చరిత్ర నాకు లేదు. నేను భారత దేశ ప్రజాస్వామ్యం కోసం పోరాడుతున్నా. పోరాడుతూనే ఉంటా. రూ.20వేల కోట్లు ఎక్కడివన్న నా ప్రశ్న నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికే నాపై అనర్హత వేటు వేశారు. మొత్తం సమస్యకు రూ.20వేల కోట్లు ఎవరివన్న ప్రశ్నే మూలం’ అని రాహుల్‌ పేర్కొన్నారు. తర్వాత విలేకరులు అడిగిన ప్రశ్నలకు బదులిచ్చారు.

* నేను భారత్‌ జోడో యాత్ర ద్వారా ప్రజల మధ్య ఉన్నా. ఇక ముందూ ఉంటా. మీడియా, ఇతర వ్యవస్థల నుంచి రాజకీయ పార్టీలకు మద్దతు లభించే పరిస్థితి దేశంలో లేదు. అందువల్ల ప్రజల వద్దకు వెళ్లడం మినహా ప్రతిపక్షాలకు మరో దారిలేదు.

* నేను వేస్తున్న ప్రశ్నలను పక్కదారి పట్టించడానికే ఓబీసీలను అవమానించినట్లు భాజపా నేతలు ఆరోపణలు చేస్తున్నారు. దేశంలో అందరూ కలిసికట్టుగా ఉండాలన్న సదుద్దేశంతో నేను కన్యాకుమారి నుంచి కశ్మీర్‌ వరకు భారత్‌ జోడో యాత్ర చేశా. నా విధానం సుస్పష్టం. అదానీ-మోదీ బంధానికి సంబంధించిన అంశం. ప్రజల దృష్టిని మళ్లించడానికి భాజపా వాళ్లు ఒకసారి ఓబీసీ అని, ఇంకోసారి విదేశీ శక్తులని, ఇంకోసారి అనర్హత అని మాట్లాడుతున్నారు.

* ఎవరెంతభయపెట్టినా నేను సత్యాన్నే చూస్తుంటా. నాకు మిగతా విషయాలపై ఆసక్తిలేదు. సత్యం మాట్లాడటం నా రక్తంలో ఉంది. ఇదే నా జీవన విధానం. నాపై అనర్హత వేటు వేసినా, కొట్టినా, తిట్టినా, జైల్లో వేసినా భయం లేదు. ఈ దేశం నాకు ప్రేమ, గౌరవం అన్నీ ఇచ్చింది. అందుకే దేశం కోసం పని చేస్తా.

* అదానీపై నేను పార్లమెంటులో చేయబోయే తర్వాతి  ప్రసంగానికి భయపడే ప్రధాని మోదీ నాపై అనర్హత వేటు వేయించారు. ఆయన కళ్లను చూశాను. తీవ్ర భయాందోళనలకు లోనయ్యారు. పార్లమెంటులో ఆ ప్రసంగం రాకూడదని భావించారు. అందుకే అనర్హత వేటు వేశారు. అందుకే తొలుత ప్రజల దృష్టి మళ్లించారు. ఇప్పుడు అనర్హత వేటు వేశారు. ఇందులోని మర్మాలను గ్రహించండి.

* షెల్‌ కంపెనీల్లో కొన్ని రక్షణ కాంట్రాక్టులు చేస్తున్నాయి. మన దేశంలో డ్రోన్‌, మిసైళ్లను అభివృద్ధి చేస్తున్న కంపెనీలు ఎక్కడి నుంచి వచ్చాయని రక్షణశాఖ ఎందుకు ప్రశ్నించడం లేదు.

* నాకు మద్దతిచ్చిన ప్రతిపక్షాలన్నింటికీ ధన్యవాదాలు. మేం అందరం కలిసి పని చేస్తాం.

* భవిష్యత్తులో నాకు విధించిన శిక్షపై కోర్టు స్టే ఇచ్చినా నా సభ్యత్వాన్ని లోక్‌సభ పునరుద్ధరిస్తుందా? లేదా? అన్నదానిపై నాకు ఆసక్తి లేదు. నా సభ్యత్వం పునరద్ధరణ జరిగినా, లేకున్నా నా పని చేసుకుంటూ పోతా. వాళ్లు నన్ను శాశ్వతంగా అనర్హుడిగా ప్రకటించినా పోరాటం ఆపను. నేను పార్లమెంటు లోపల ఉన్నానా? బయట ఉన్నానా? అన్నదాంతో నాకు సంబంధం లేదు. పని చేసుకుపోవడం ఒక్కటే తెలుసు.

* వయనాడ్‌కు ఉప ఎన్నిక వస్తే ప్రియాంకా గాంధీ పోటీ చేస్తారా? ఇంకొకరా? అన్నది నా పరిధిలో లేదు. కాంగ్రెస్‌ అధ్యక్షుడు దానిపై నిర్ణయం తీసుకుంటారు.

* అదానీ షెల్‌ కంపెనీల్లోకి వచ్చిన డబ్బుపై విచారణ జరిపించండి. అందులో మా సీఎంల డబ్బుంటే వారినీ జైల్లో వేయండి. ఇతరులవైతే వారిని జైల్లో పెట్టండి.

* మోదీ తీవ్ర భయాందోళనలకు గురై నాపై అనర్హత వేటు వేశారు. ఇది విపక్షాలకు మేలు చేస్తుంది. మా చేతికి ఆయుధం దొరికింది. అదానీ అవినీతిపరుడని ప్రజలకు తెలుసు. అలాంటి వ్యక్తిని ప్రధాని ఎందుకు రక్షిస్తున్నారన్న ప్రశ్న ఇప్పుడు వారి మదిలో మెదలుతోంది.

* అదానీపై దాడి చేయడం అంటే దేశంపై దాడి చేయడమేనని భాజపా నాయకులు చెబుతున్నారు. వారి మనసులో దేశం అంటే అదానీ, అదానీ అంటే దేశం అన్న భావన పేరుకుపోయింది.

* ప్రజల దృష్టిని మళ్లించడానికే పరువు నష్టం కేసులో నాకు గరిష్ఠ శిక్ష వేశారు. ఆ సెక్షన్‌లో గరిష్ఠ శిక్ష 5, 10 ఏళ్లు ఉండి ఉంటే అదీ పడేది.

* ఈ దేశ ప్రజాస్వామ్య గుణాన్ని కాపాడటానికి నేను దేనికీ భయపడను. ప్రజాస్వామ్యాన్ని రక్షించడమంటే ఈ దేశ వ్యవస్థలు, ప్రజల గొంతును రక్షించడమే.

* అనర్హతకు నేను భయపడలేదు. వాళ్లు నాకు ఇవ్వగలిగినంత ఉత్తమ బహుమతి ఇచ్చారు.

* మనసులో తప్పుచేశామన్న భావన ఉన్నవారు పరిస్థితులను తప్పుదారి పట్టించాలని చూస్తారు. దొంగను పట్టుకుంటే అతడు మొదట చెప్పేమాట నేనేమీ చేయలేదనే. లేదంటే అదిగో... ఇదిగో అని కళ్లుగప్పే ప్రయత్నం చేస్తాడు. ఇప్పుడు భాజపా అదే చేస్తోంది.

* నా పేరు సావర్కర్‌ కాదు... అందువల్ల ఎవరికీ క్షమాపణలు చెప్పను.

* ఈ దేశంలో ప్రజాస్వామ్యం ఖతమైపోయింది. వ్యవస్థల దురాక్రమణ జరుగుతోంది. అందుకు మూలం మోదీ- అదానీ మధ్య బంధమే.

* నేను నిజాన్నే నమ్ముతా. దాన్నే మాట్లాడతా. ఈ అనర్హతలు నన్నేం చేయలేవు. నా పేరు గాంధీ. గాంధీలు ఎప్పుడూ క్షమాపణలు చెప్పరు.

మోదీ ఇంటి పేరుపై వ్యాఖ్యల కేసులో జైలు శిక్ష గురించి విలేకరులు రాహుల్‌ను ప్రశ్నించగా.. సమాధానం చెప్పేందుకు నిరాకరించారు. న్యాయపరమైన విషయాలు సున్నితమైనవని, వాటిపై తాను స్పందించాలనుకోవడం లేదని పేర్కొన్నారు. విలేకరుల సమావేశంలో రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌ సీఎంలు అశోక్‌ గహ్లోత్‌, భూపేశ్‌ బఘేల్‌, కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శులు జైరాం రమేశ్‌, కేసీ వేణుగోపాల్‌ పాల్గొన్నారు.


రాహుల్‌కు సంఘీభావంగా కాంగ్రెస్‌ ఆందోళనలు

గాంధీభవన్‌, గన్‌ఫౌండ్రి, న్యూస్‌టుడే: రాహుల్‌ గాంధీ లోక్‌సభ సభ్యత్వం రద్దుపై కాంగ్రెస్‌ శ్రేణులు భగ్గుమన్నాయి. శనివారం రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో భాజపాకు వ్యతిరేకంగా ఆందోళనలు చేపట్టాయి. సీఎల్పీ నేత భట్టివిక్రమార్క నేతృత్వంలో కుమురం భీం ఆసిఫాబాద్‌ జిల్లా కేంద్రంలో కాగడాల ప్రదర్శన నిర్వహించారు. మహిళా కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షురాలు సునీతారావు ఆధ్వర్యంలో నాంపల్లిలోని భాజపా రాష్ట్ర కార్యాలయాన్ని ముట్టడించారు. లోనికి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించగా పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మహబూబ్‌నగర్‌ జిల్లాలో ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్‌ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. ముషీరాబాద్‌ చౌరస్తాలో యువజన కాంగ్రెస్‌ నాయకుడు అనిల్‌కుమార్‌ యాదవ్‌ ఆధ్వర్యంలో ప్రధాని దిష్టిబొమ్మను దహనం చేశారు. ఓయూలో రీసెర్చ్‌ స్కాలర్‌ చనగాని దయాకర్‌ ఆధ్వర్యంలో విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని