40 మంది వైకాపా ఎమ్మెల్యేలు వస్తామంటున్నారు

వైకాపా ఎమ్మెల్యేలు 40 మంది తెదేపాలోకి వస్తామంటున్నారని, వాళ్ల ఫోన్లతో చెవులు గుయ్‌.. గుయ్‌.. మంటున్నాయని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కె.అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.

Updated : 29 Mar 2023 08:14 IST

తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు

వైకాపా ఎమ్మెల్యేలు 40 మంది తెదేపాలోకి వస్తామంటున్నారని, వాళ్ల ఫోన్లతో చెవులు గుయ్‌.. గుయ్‌.. మంటున్నాయని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కె.అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. మంచీ చెడ్డా చూసి ఎవర్ని చేర్చుకోవాలో, ఎవర్ని చేర్చుకోకూడదో నిర్ణయిస్తామన్నారు. మంగళవారం హైదరాబాద్‌లోని ఎన్టీఆర్‌ ట్రస్ట్‌భవన్‌లో పార్టీ పొలిట్‌బ్యూరో సమావేశం అనంతరం విలేకరులు అడిగిన ప్రశ్నలకు బదులిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్‌ ఓటింగ్‌ చేసిన నలుగురు వైకాపా ఎమ్మెల్యేలు తెదేపాలో చేరుతున్నారా అని అడగడంతో... ‘‘వాళ్లతో మాకు సంప్రదింపుల్లేవు. వారు వస్తే అప్పుడు చూస్తాం. వాళ్లు నలుగురే కాదు... 40 మంది ఎమ్మెల్యేలు వస్తామంటున్నారు...’’ అని అచ్చెన్నాయుడు సమాధానమిచ్చారు. పొత్తులపై పొలిట్‌బ్యూరోలో ఎలాంటి చర్చా జరగలేదని స్పష్టం చేశారు. ‘‘ఏపీలో ప్రజాస్వామ్యం పూర్తిగా ఖూనీ అయింది. ప్రతిపక్ష పార్టీలకు, ప్రజా సంఘాలకు స్వేచ్ఛ లేదు. మొదట ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుంటేనే రాజకీయపార్టీలైనా, ఎన్నికలైనా ఉంటాయి. కలసి వచ్చే పార్టీలతో ముందుకు వెళ్లాలన్నదే ప్రస్తుతానికి మా నిర్ణయం. పొత్తులపై తెదేపా అధినేత చంద్రబాబు పార్టీలో చర్చించి తగిన సమయంలో తగిన నిర్ణయం తీసుకుంటారు...’’ అని పేర్కొన్నారు.

వారిపై ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలి

‘‘ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెదేపా అభ్యర్థికి ఓట్లు వేసిన వైకాపా ఎమ్మెల్యేలెవరో మీరు చూశారా? నేను చూశానా? జగనే ఆత్మప్రబోధానుసారం మా అభ్యర్థికి ఓటు వేశారేమో..! ఏ అభ్యర్థికి ఎవరు ఓటు వేశారో నాకు తెలుసని ఎవరైనా అంటే వారిని వెంటనే అరెస్ట్‌ చేయాలి. సజ్జలైనా, మరొకరైనా... ఎవరు ఎవరికి ఓటేశారో చెప్పడం అంటే, రహస్య బ్యాలెట్‌ స్ఫూర్తిని ఉల్లంఘించడమే. అలాంటి వారిపై ఎన్నికల సంఘం వెంటనే చర్యలు తీసుకోవాలి...’’ అని మరో ప్రశ్నకు సమాధానంగా అచ్చెన్నాయుడు చెప్పారు. ‘‘మేం ప్రత్యేక హోదా కోసమే అప్పట్లో కేంద్ర ప్రభుత్వం నుంచి బయటకు వచ్చాం. 25 మంది ఎంపీల్ని గెలిపిస్తే కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తానని జగన్‌రెడ్డి చెప్పారు. ప్రస్తుతం ఆ పార్టీకి లోక్‌సభ, రాజ్యసభల్లో 31 మంది ఎంపీలున్నారు. అంతమంది ఎంపీలున్నా ప్రత్యేక హోదా ఎందుకు సాధించలేదు? సీఎం వారం వారం దిల్లీ వెళుతున్నారు. ఆయన ఇస్తున్న శాలువాలు, ఫొటోలతో దిల్లీలో బీరువాలు నిండిపోతున్నాయే తప్ప ప్రయోజనం లేదు...’’ అని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.

రాహుల్‌పై నిర్ణయం తొందరపాటు చర్య

కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీని లోక్‌సభ సభ్యత్వానికి అనర్హుడిగా ప్రకటించడాన్ని తొందరపాటు చర్య అని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అభిప్రాయపడ్డారు. ఒక కోర్టు తీర్పు చెప్పాక... పై కోర్టుకి వెళ్లేందుకు అవకాశం ఉన్నప్పుడు... తొందరపడి నిర్ణయం తీసుకోవడం సరికాదని భావిస్తున్నామని చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని