క్షమాపణ చెప్పే ప్రసక్తే లేదు... న్యాయపరంగానే పోరాడతా

తనకు మంత్రి కేటీఆర్‌ ఇచ్చిన లీగల్‌ నోటీసులపై న్యాయపరంగానే పోరాడనున్నట్లు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ప్రకటించారు.

Updated : 30 Mar 2023 08:23 IST

కేటీఆర్‌ లీగల్‌ నోటీసుపై బండి సంజయ్‌

ఈనాడు, హైదరాబాద్‌: తనకు మంత్రి కేటీఆర్‌ ఇచ్చిన లీగల్‌ నోటీసులపై న్యాయపరంగానే పోరాడనున్నట్లు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ప్రకటించారు. బెదిరింపులకు భయపడేది లేదని, క్షమాపణ చెప్పే ప్రసక్తే లేదని ఆయన బుధవారం ఒక ప్రకటనలో స్పష్టంచేశారు. కేటీఆర్‌ ప్రతిష్ఠ విలువ రూ.100 కోట్లయితే.. ప్రశ్నపత్రాల లీకేజీతో భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిన 30 లక్షల మంది నిరుద్యోగులకు ఎంత మూల్యం చెల్లిస్తారో ఆయన చెప్పాలని డిమాండ్‌ చేశారు. బహిరంగ క్షమాపణ చెప్పకపోతే రూ.100 కోట్ల పరువు నష్టం దావా వేయనున్నట్లు తనకు కేటీఆర్‌ లీగల్‌ నోటీస్‌ ఇచ్చారని వచ్చిన వార్తలను పత్రికల్లో చూసినట్లు తెలిపారు. లీకేజీ వెనక తన కుట్ర ఉందని కేటీఆర్‌ ఆరోపించారని.. దీనికి తానెన్ని కోట్ల నష్టపరిహారానికి దావా వేయాలన్నారు. లీకేజీతో నష్టపోయిన నిరుద్యోగులకు రూ.లక్ష చొప్పున పరిహారం అందించేవరకు భాజపా పోరాడుతుందని చెప్పారు. సిట్‌ విచారణ అంశాలు కేటీఆర్‌కు ఎలా లీకవుతాయని ప్రశ్నించారు. ఈ వ్యవహారంలో ఇద్దరు నిందితులే ఉన్నారన్న మంత్రి.. పదుల సంఖ్యలో అరెస్టులు జరుగుతున్నా ఎందుకు మాట్లాడటం లేదన్నారు. ఆయనను మంత్రి పదవి నుంచి తొలగించేదాకా ఉద్యమం కొనసాగిస్తామని ప్రకటించారు. ప్రశ్నపత్రాల లీకేజీని సాధారణ అంశంగా చిత్రీకరించేందుకు ప్రయత్నిస్తున్న మంత్రులకు నోటీసులు ఎందుకు ఇవ్వడం లేదో సిట్‌ చెప్పాలన్నారు. జనన, మరణ ధ్రువీకరణ పత్రాల జారీ కుంభకోణం నుంచి ప్రశ్నపత్రాల లీకేజీ వరకు ఐటీ శాఖ మంత్రే బాధ్యత వహించాలన్నారు. నాలాలో పడి పిల్లలు చనిపోయిన దగ్గర నుంచి, కుక్కల దాడిలో పసిపిల్లల మరణాల వరకూ పురపాలక శాఖ మంత్రిగా బాధ్యత వహించి కేటీఆర్‌ రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు.

రేపు రాష్ట్రానికి నడ్డా రాక

భాజపా జాతీయ అధ్యక్షుడు జె.పి.నడ్డా శుక్రవారం మధ్యాహ్నం హైదరాబాద్‌కు రానున్నారు. శంషాబాద్‌ నుంచి నేరుగా సంగారెడ్డికి వెళ్లి భాజపా జిల్లా కార్యాలయ భవనాన్ని ప్రారంభిస్తారు. అక్కడి నుంచే వర్చువల్‌గా భూపాలపల్లి, వరంగల్‌, జనగామ, మహబూబాబాద్‌లతోపాటు ఏపీలోని అనంతపురం, చిత్తూరు భాజపా జిల్లాల కార్యాలయాలను ప్రారంభిస్తారు. సాయంత్రం శంషాబాద్‌లో భాజపా రాష్ట్ర పదాధికారులు, జిల్లా అధ్యక్షులు, జిల్లా ఇన్‌ఛార్జుల విస్తృత స్థాయి సమావేశానికి హాజరవుతారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు