అదానీ, అంబానీల కోసమే మోదీ

ప్రతిపక్షాలను బలహీనపరిచే కుట్రకు నరేంద్ర మోదీ ప్రభుత్వం తెరలేపిందనీ, అందులో భాగంగానే కాంగ్రెస్‌ నాయకుడు రాహుల్‌గాంధీ లోక్‌సభ సభ్యత్వంపై అనర్హత వేటు వేసిందని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు ప్రకాశ్‌ కారాట్‌ ధ్వజమెత్తారు.

Published : 30 Mar 2023 04:31 IST

తెలంగాణలో భాజపా కుట్రల్ని లౌకిక శక్తులు తిప్పికొట్టాలి
సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు ప్రకాశ్‌ కారాట్‌ పిలుపు

హిమాయత్‌నగర్‌ న్యూస్‌టుడే: ప్రతిపక్షాలను బలహీనపరిచే కుట్రకు నరేంద్ర మోదీ ప్రభుత్వం తెరలేపిందనీ, అందులో భాగంగానే కాంగ్రెస్‌ నాయకుడు రాహుల్‌గాంధీ లోక్‌సభ సభ్యత్వంపై అనర్హత వేటు వేసిందని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు ప్రకాశ్‌ కారాట్‌ ధ్వజమెత్తారు. సీపీఎం ఆధ్వర్యంలో ఈ నెల 17న వరంగల్‌లో ప్రారంభమైన జనచైతన్య యాత్ర బుధవారం హైదరాబాద్‌లో ముగిసింది. ఇందిరాపార్కు ధర్నాచౌక్‌లో నిర్వహించిన సభకు ముఖ్య అతిథిగా హాజరైన ప్రకాశ్‌కారాట్‌ మాట్లాడుతూ... ‘‘ఒకవైపు దేశ ప్రజల మధ్య మత చిచ్చురేపుతూ, మరోవైపు ప్రకృతి వనరులను అదానీ, అంబానీలకు దోచిపెడుతున్న కేంద్ర ప్రభుత్వాన్ని గద్దె దించాల్సిన అవసరముంది. తొమ్మిదేళ్లలో ప్రభుత్వరంగ సంస్థల్ని కార్పొరేట్‌ సంస్థలకు కట్టబెట్టి దేశాన్ని లూఠీ చేశారు. ధరల పెరుగుదలతో పేదల జీవన ప్రమాణాలు దిగజారుతున్నా పట్టించుకోవడంలేదు. ప్రతిపక్షాలులేని భారత్‌గా మార్చేందుకు మోదీ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. అందులో భాగంగానే కేంద్ర దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తూ... భారాస నేత కవితను, ఆర్జేడీ నేత లాలూప్రసాద్‌ యాదవ్‌ను విచారిస్తోంది. దిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీశ్‌ సిసోదియాను అరెస్టు చేసింది.

భాజపాని నిలువరించాల్సిందే

తెలంగాణపై భాజపా కన్నేసింది. డబ్బు, పదవుల ఆశచూపించి అధికారంలోకి రావాలని చూస్తోంది. అదే జరిగితే ఇక్కడి సంస్కృతి, సంప్రదాయాలు నాశనం అవుతాయి. వామపక్ష, ప్రజాతంత్ర లౌకికశక్తులు ఏకమై అధికారంలోకి రాకుండా భాజపాను నిలువరించాలి.

అదానీ ఆస్తులు అంతగా ఎలా పెరిగాయి?

మోదీ గుజరాత్‌ సీఎంగా ఉన్నప్పుడు అదానీ ఆస్తులు రూ.50వేల కోట్లు ఉండేవి. మోదీ ప్రధాని అయ్యాక రూ.10.3 లక్షల కోట్లకు పెరిగాయి. కేంద్రం మద్దతు ఉండటంతోనే ప్రపంచ కుభేరుల జాబితాలో 609స్థానం నుంచి అదానీ రెండో స్థానానికి ఎదిగారు’ అని ఆరోపించారు.

చావైనా, బతుకైనా సీపీఐతో కలిసే నడుస్తాం

‘రాష్ట్రంలో రానున్న కాలంలో చావైనా బతుకైనా కలిసే నడవాలని సీపీఐ, సీపీఎంలు నిర్ణయించాయి. ఈమేరకు రెండు పార్టీల సంయుక్త సమావేశాన్ని ఏప్రిల్‌ 9న నిర్వహిస్తాం’ అని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ప్రకటించారు. సభలో సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్‌రెడ్డి, సీపీఎం నాయకులు జూలకంటి రంగారెడ్డి, ఎస్‌.వీరయ్య, జాన్‌వెస్లీ, సుదర్శనరావు తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని