Nara Lokesh: చేనేతకు చేయూతనిస్తాం

జగన్‌ ప్రభుత్వం అనాలోచిత చర్యల కారణంగా చేనేత రంగం సంక్షోభంలో కూరుకుపోయిందని తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ విమర్శించారు.

Updated : 30 Mar 2023 06:54 IST

మరమగ్గాలకు 500 యూనిట్ల ఉచిత విద్యుత్తు
యువగళం పాదయాత్రలో నారా లోకేశ్‌ హామీ

ఈనాడు డిజిటల్‌, అనంతపురం: జగన్‌ ప్రభుత్వం అనాలోచిత చర్యల కారణంగా చేనేత రంగం సంక్షోభంలో కూరుకుపోయిందని తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ విమర్శించారు. నాలుగేళ్లలో ఆత్మహత్యలు చేసుకున్న చేనేత కార్మికుల కుటుంబాలకు వైకాపా ప్రభుత్వం రూపాయి పరిహారం అందించలేదన్నారు. వివిధ కారణాలు చూపుతూ రేషన్‌ కార్డులు, సంక్షేమ పథకాలనూ రద్దు చేసిందని ధ్వజమెత్తారు. యువగళం పాదయాత్ర బుధవారం శ్రీసత్యసాయి జిల్లా సోమందేపల్లి మండలం నల్లగొండ్రాయునిపల్లి నుంచి పెనుకొండ సర్కిల్‌ వరకు సాగింది. ఈ సందర్భంగా సోమందేపల్లి వద్ద చేనేతలు లోకేశ్‌ను కలిసి సమస్యలు వివరించారు. నేతన్న నేస్తం ఇస్తున్నామనే సాకుతో రాయితీలను వైకాపా ప్రభుత్వం ఎత్తేసిందని వాపోయారు. సంక్షోభంలో ఉన్న చేనేతలను ఆదుకునేందుకు తెదేపా హయాంలో ఎన్నో ప్రోత్సాహకాలిస్తే జగన్‌ ప్రభుత్వం వచ్చాక వాటన్నింటిని రద్దు చేసి పది శాతం మందికే నేతన్న నేస్తం అమలు చేస్తోందన్నారు. తెదేపా అధికారంలోకి రాగానే మరమగ్గాలకు 500 యూనిట్లు, చేనేతలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తునిస్తామని హామీనిచ్చారు. చేనేత వస్త్రాలపై జీఎస్టీ రద్దుకు కృషి చేస్తామని, కుదరనట్లయితే రాష్ట్ర ప్రభుత్వమే భరించేలా చర్యలు తీసుకుంటామని భరోసానిచ్చారు. పెనుకొండలో పలువురు వ్యాపారులు లోకేశ్‌ను కలిసి సమస్యలు వివరించారు. ఆస్తి పన్ను పెంచడంతో అద్దె పెరిగి నష్టపోతున్నామని తెలిపారు. తెదేపా అధికారంలోకి వస్తే పెట్రో పన్నుల భారం తగ్గిస్తామని లోకేశ్‌ హామీనిచ్చారు. నల్లగొండ్రాయునిపల్లి వద్ద బ్రాహ్మణ సంఘం ప్రతినిధులతో ఆయన భేటీ అయ్యారు. పాదయాత్రలో మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు, మాజీ ఎమ్మెల్యే బీకే పార్థసారథి, మాజీ ఎమ్మెల్సీ తిప్పేస్వామి, పార్టీ నేతలు జేసీ ప్రభాకర్‌రెడ్డి, కోడెల శివరాం తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు మాజీ మంత్రి జేసీ దివాకర్‌రెడ్డి.. లోకేశ్‌ను కలిశారు. తెదేపా ఆవిర్భవించి 41 ఏళ్లయిన సందర్భంగా సోమందేపల్లి మండలం నల్లగొండ్రాయునిపల్లి విడిదిలో నారా లోకేశ్‌ పార్టీ జెండాను ఆవిష్కరించి ఎన్టీఆర్‌ విగ్రహానికి నివాళులర్పించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని