వైకాపా ప్రభుత్వంపై తిరుగుబాటు ప్రారంభం

వైకాపా ప్రభుత్వంపై అన్ని వర్గాల్లో తిరుగుబాటు మొదలైందని తెదేపా ఎమ్మెల్సీలు స్పష్టం చేశారు. తాజాగా ఎమ్మెల్సీ స్థానాల్లో తెదేపా అభ్యర్థుల విజయమే దీనికి నిదర్శనమన్నారు.

Published : 01 Apr 2023 04:28 IST

జగన్‌ను ఓడించి పులివెందులను చంద్రబాబు, లోకేశ్‌లకు బహుమతిగా ఇస్తాం
ప్రమాణస్వీకారం అనంతరం తెదేపా ఎమ్మెల్సీలు

ఈనాడు డిజిటల్‌, అమరావతి: వైకాపా ప్రభుత్వంపై అన్ని వర్గాల్లో తిరుగుబాటు మొదలైందని తెదేపా ఎమ్మెల్సీలు స్పష్టం చేశారు. తాజాగా ఎమ్మెల్సీ స్థానాల్లో తెదేపా అభ్యర్థుల విజయమే దీనికి నిదర్శనమన్నారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల ద్వారా వైకాపా ఎమ్మెల్యేలూ ప్రభుత్వానికి నిరసన తెలిపారని వివరించారు. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం జగన్‌ను ఓడించి పులివెందుల నియోజకవర్గాన్ని తెదేపా అధినేత చంద్రబాబు, ప్రధాన కార్యదర్శి లోకేశ్‌లకు బహుమతిగా ఇస్తామన్నారు. ఎమ్మెల్సీలుగా ఎన్నికయిన పంచుమర్తి అనురాధ, వేపాడ చిరంజీవిరావు, కంచర్ల శ్రీకాంత్‌, భూమిరెడ్డి రాంగోపాల్‌రెడ్డిలతో శాసనమండలి ఛైర్మన్‌ మోషేనురాజు శుక్రవారం తన కార్యాలయంలో ప్రమాణస్వీకారం చేయించారు. పులివెందుల సహా తూర్పు, పశ్చిమ రాయలసీమ, ఉత్తరాంధ్ర నుంచి పెద్దఎత్తున తెదేపా శ్రేణులు తరలివచ్చాయి. తెదేపా ఎమ్మెల్యేలు గంటా శ్రీనివాసరావు, వెలగపూడి రామకృష్ణబాబు హాజరయ్యారు. అనంతరం అసెంబ్లీ బయట ఎమ్మెల్సీలు విలేకరులతో మాట్లాడారు. ‘మా విజయం తెలుగు రాష్ట్రాల్లోని తెదేపా కుటుంబసభ్యులది. ఈ నాలుగేళ్లలో వైకాపా ప్రభుత్వం చేయని అరాచకం లేదు. ఎస్సీ, ఎస్టీ, బీసీలు, మహిళల ఘోష వైకాపా వాళ్లకు తగిలింది. 2024 ఎన్నికల్లో తెదేపా విజయఢంకా మోగిస్తుంది. దీనికి మా గెలుపే నాంది’ అని అనురాధ పేర్కొన్నారు.


పులివెందులలో గెలవకూడదని శతవిధాలా ప్రయత్నించారు..

‘పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం నుంచి, అందులోనూ సీఎం సొంత నియోజకవర్గం నుంచి తెదేపా అభ్యర్థిని శాసనమండలిలో అడుగుపెట్టనివ్వకూడదని వైకాపావారు చేయని ప్రయత్నం లేదు. దాదాపు రూ.వంద కోట్లు ఖర్చుపెట్టారు. ఎన్ని ప్రలోభాలు పెట్టినా వివేకవంతులైన రాయలసీమ ప్రజానీకం నన్ను గెలిపించింది. జగన్‌ కొంతకాలంగా ‘వై నాట్‌ 175.. కుప్పంలో ఎందుకు గెలవకూడదు?’ అంటున్నారు. ఆయన కుప్పంలో గెలుస్తారో లేదో తెలియదు కానీ పులివెందులనుంచి మాత్రం గెలిచాం. నాలుగేళ్లుగా వంచన, అవమానాలకు గురవుతున్న ఏపీ ప్రజానీకం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రజాస్వామ్యం, ధర్మం వైపు నిల్చున్నారు.’

పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ రామగోపాల్‌రెడ్డి


విశాఖ రాజధాని అన్నా ఉత్తరాంధ్ర తిరస్కరించింది..

‘ఉత్తరాంధ్ర ప్రజలు వైకాపాను తిరస్కరించారు. తెదేపా అభ్యర్థిని 30వేల పైచిలుకు ఓట్లతో గెలిపించారు. 2024లో తెదేపా గెలుపునకు మా విజయమే నాంది. తిరుపతిలో దొంగ ఓట్లు వేయించారు. ఎమ్మెల్సీ అభ్యర్థినైన నన్ను కూడా పోలింగ్‌ బూత్‌లోకి వెళ్లనివ్వకుండా అడ్డుకున్నారు. అధికార పార్టీ వాళ్లు ఎన్ని అక్రమాలకు పాల్పడ్డా.. తూర్పు, పశ్చిమ రాయలసీమల్లో తెదేపా జెండా ఎగురవేశాం.’

తూర్పు రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్‌


మెగా డీఎస్సీ నిర్వహించాలి..

‘పట్టభద్రులు, ఉద్యోగులు ఈ ప్రభుత్వంపై అసంతృప్తితో ఉన్నారు. వైకాపా అధికారంలోకి వచ్చి నాలుగేళ్లవుతున్నా నేటి వరకు ఒక్క డీఎస్సీ నిర్వహించలేదు. దీంతో నిరుద్యోగులు ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం స్పందించి మెగా డీఎస్సీ నిర్వహించాలి. గ్రూప్‌-1, 2 ఉద్యోగాల భర్తీకి నోటిపికేషన్‌ ఇవ్వాలి. దీనిపై ఓ విన్నపాన్ని రూపొందించాం. దీన్ని ఏపీపీఎస్సీ ఛైర్మన్‌తో పాటు ఇతర ఉన్నతాధికారులకు త్వరలో ఇస్తాం. ఒకటో తేదీకి జీతాలివ్వండి మహా ప్రభో అని ప్రభుత్వోద్యోగులు విన్నవించుకోవాల్సి వస్తోంది. ఉద్యోగుల పక్షాన పోరాడుతాం. తెదేపా అధికారంలోకి వస్తే జాబ్‌ క్యాలెండర్‌ ఇస్తాం. దీనిపై లోకేశ్‌ ఇప్పటికే ప్రకటన చేశారు.’

ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవిరావు


ప్రమాణ స్వీకార ఫొటోలు విడుదల చేయని పౌరసంబంధాలశాఖ

ఈనాడు డిజిటల్‌, అమరావతి: తెదేపా ఎమ్మెల్సీలుగా పంచుమర్తి అనురాధ, చిరంజీవిరావు, కంచర్ల శ్రీకాంత్‌, రామగోపాల్‌రెడ్డి శుక్రవారం శాసనమండలి ఛైర్మన్‌ ఛాంబర్‌లో ప్రమాణం స్వీకారం చేశారు. సాధారణంగా సమాచార పౌరసంబంధాలశాఖ ఈ ఫొటోలు, వీడియోలు మీడియాకు విడుదల చేస్తుంది. శుక్రవారం నాటి తెదేపా ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకార ఫొటోలు, వీడియోలు విడుదల చేయలేదు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని