ముఖ్య పార్టీల ‘చలో కర్ణాటక’!

సరిహద్దులోని కన్నడనాట జరిగే శాసనసభ ఎన్నికల్లో ప్రచారానికి తెలంగాణ నేతలు సిద్ధమవుతున్నారు.

Published : 02 Apr 2023 04:09 IST

ఎన్నికల ప్రచారానికి తెలంగాణ నేతలు
సన్నద్ధమవుతున్న భారాస, భాజపా, కాంగ్రెస్‌

ఈనాడు, హైదరాబాద్‌: సరిహద్దులోని కన్నడనాట జరిగే శాసనసభ ఎన్నికల్లో ప్రచారానికి తెలంగాణ నేతలు సిద్ధమవుతున్నారు. అధికార భారాస, విపక్ష భాజపా, కాంగ్రెస్‌ల ముఖ్య నేతలు ప్రచారానికి వెళ్లే అవకాశం ఉంది. కర్ణాటకలో భాజపా, కాంగ్రెస్‌ల మధ్య హోరాహోరీ పోరు ఉండటం, రెండు పార్టీలకు ప్రస్తుతం దక్షిణాదిలో కీలకమైన రాష్ట్రం కావడంతో ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి గట్టి ప్రయత్నం చేస్తున్నాయి. కర్ణాటకలోని పలు జిల్లాల్లో, ముఖ్యంగా సరిహద్దుప్రాంతాల్లో తెలుగువారు అధికసంఖ్యలో ఉండడంతో ప్రధాన పార్టీలు తెలంగాణ నాయకులను ప్రచారానికి వినియోగించుకోనున్నాయి. తెరాస.. భారాసగా మారే క్రమంలో జరిగిన సమావేశాల్లో జనతాదళ్‌ (ఎస్‌) నేత, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి పాల్గొనడంతోపాటు ఈ రెండు పార్టీల మధ్య సత్సంబంధాలున్నాయి. ఈ నేపథ్యంలో జనతాదళ్‌ (ఎస్‌)తో కలిసి కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగవచ్చనే ప్రచారం జరిగినా, ప్రస్తుతం పోటీ చేయరాదని భారాస నిశ్చయించినట్లు ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. కుమారస్వామికి మద్దతుగా ప్రచారానికి వెళ్లాలని నిర్ణయం తీసుకొన్నట్లు సమాచారం.

శ్రీధర్‌బాబు పర్యవేక్షణలో..

తెలంగాణకు చెందిన మాజీ మంత్రి డి.శ్రీధర్‌బాబు కర్ణాటక కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌ఛార్జిగా ఉన్నారు. తెలంగాణ ముఖ్యనేతలతో కర్ణాటకలోని ఏయే ప్రాంతాల్లో ఎప్పుడు ప్రచారం చేయించాలనే ప్రణాళికపై ఆయన దృష్టి పెట్టారు. బెంగళూరు నగరంలోని తెలుగు ప్రజలున్న ప్రాంతాలకు వచ్చి ప్రచారం చేయాలని ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని కర్ణాటక కాంగ్రెస్‌ నేత డీకే శివకుమార్‌ ఇప్పటికే ఆహ్వానించారు. దిల్లీలో పార్లమెంటరీ కమిటీల సమావేశాలున్నాయని, అవి కాగానే బెంగళూరు వెళ్లి ప్రచారంలో పాల్గొంటానని ఉత్తమ్‌ తెలిపారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు సంపత్‌, గీతారెడ్డి తదితరులు సరిహద్దు జిల్లాల్లో ప్రచారానికి వెళ్లే అవకాశం ఉంది. నామినేషన్‌ ప్రక్రియ పూర్తయ్యాక ఎవరెవరు ఎక్కడ ప్రచారానికి వెళ్లాలన్నది ఏఐసీసీ నిర్ణయిస్తుందని కాంగ్రెస్‌ వర్గాలు తెలిపాయి.

భాజపా తరఫున..

జోగులాంబ గద్వాల జిల్లాకు ఆనుకుని ఉన్న కర్ణాటక ప్రాంతాలకు భాజపా నేతలు డీకే అరుణ, మహబూబ్‌నగర్‌ జిల్లాకు చెందిన వారు ప్రచారానికి వెళ్లనున్నారు. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, ఎంపీ లక్ష్మణ్‌, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ తదితరులు కూడా కర్ణాటకలో విస్తృతంగా ప్రచారం చేసే అవకాశం ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని