ఒకే వేదికపైకి 21 ప్రతిపక్షాలు

వచ్చే సార్వత్రిక ఎన్నికలకు ముందు భాజపా వ్యతిరేక పార్టీలన్నీ ఒకే వేదిక మీదికి రావాలన్న భావన ప్రతిపక్షాల నుంచి వెలువడుతున్న నేపథ్యంలో డీఎంకే అధ్యక్షుడు, తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్‌ అందుకు రంగం సిద్ధం చేశారు.

Published : 02 Apr 2023 04:09 IST

సామాజిక న్యాయం పేరిట డీఎంకే సదస్సు
3న దిల్లీలో నిర్వహణ

ఈనాడు, దిల్లీ: వచ్చే సార్వత్రిక ఎన్నికలకు ముందు భాజపా వ్యతిరేక పార్టీలన్నీ ఒకే వేదిక మీదికి రావాలన్న భావన ప్రతిపక్షాల నుంచి వెలువడుతున్న నేపథ్యంలో డీఎంకే అధ్యక్షుడు, తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్‌ అందుకు రంగం సిద్ధం చేశారు. ‘ప్రతి ఒక్కరికీ ప్రతిదీ (ఎవ్రీథింగ్‌ ఫర్‌ ఎవ్రీవన్‌)’ నినాదంతో భావ సారూప్యం గల రాజకీయ పార్టీలు, సామాజిక కార్యకర్తలు, సంస్థలు, పౌరసంఘాలను ఇందుకు ఆహ్వానించారు. సామాజిక న్యాయం పేరిట ఈ నెల 3న దిల్లీలోని న్యూమహారాష్ట్ర సదన్‌లో నిర్వహించే కార్యక్రమానికి మొత్తం 21 రాజకీయ పార్టీలు హాజరుకానున్నాయి. ఈ సదస్సును ఉద్దేశించి ఎం.కె.స్టాలిన్‌ ముఖ్యఅతిథిగా ప్రసంగిస్తారు. రాజస్థాన్‌ సీఎం అశోక్‌ గహ్లోత్‌ (కాంగ్రెస్‌), ఝార్ఖండ్‌ సీఎం హేమంత్‌ సోరెన్‌ (జేఎంఎం), బిహార్‌ ఉపముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్‌ (ఆర్‌జేడీ), సీతారాం ఏచూరి (సీపీఎం), డి.రాజా(సీపీఐ), అఖిలేశ్‌ యాదవ్‌(సమాజ్‌వాదీ పార్టీ), ఫరూఖ్‌ అబ్దుల్లా(నేషనల్‌ కాన్ఫరెన్స్‌), డెరెక్‌ ఒబ్రియెన్‌ (టీఎంసీ), చగన్‌ భుజబల్‌ (ఎన్‌సీపీ), సంజయ్‌సింగ్‌ (ఆప్‌) గౌరవ అతిథులుగా పాల్గొని ప్రత్యేక ఉపన్యాసం చేయనున్నారు. మనోజ్‌ కుమార్‌ ఝా(ఆర్‌జేడీ), మహమ్మద్‌ బషీర్‌ (ఐయూఎంఎల్‌), కె.కేశవరావు(భారాస) పాల్గొని ప్రసంగిస్తారు. మహారాష్ట్ర ఎమ్మెల్సీ మహదేవ్‌ జాన్‌కర్‌ (రాష్ట్ర్రీయ సమాజ్‌పక్ష్), నబ కుమార్‌సరనియా(అస్సాం గణ సురక్ష పార్టీ), రాజ్‌కుమార్‌సైనీ(లోక్‌తంత్ర సురక్షపార్టీ-హరియాణా) సదస్సుకు హాజరవుతారు. తమిళనాడు నుంచి రాజ్యసభ సభ్యుడు పి.విల్సన్‌(డీఎంకే), ఎంపీ వైకో (ఎండీఎంకే), విడుదలై చిరుత్తైగల్‌ కచ్చి లోక్‌సభ సభ్యుడు తిరుమావలవన్‌, ఎంఎంకె ఎమ్మెల్యే జవహిరుల్లా, కొంగునాడు మక్కల్‌ దేశీయకచ్చి ఎమ్మెల్యే ఈశ్వరన్‌లు సదస్సులో పాలుపంచుకుంటారు. ఏపీ హైకోర్టు మాజీ న్యాయమూర్తి, జాతీయ బీసీ కమిషన్‌ మాజీ ఛైర్మన్‌ జస్టిస్‌ వి.ఈశ్వరయ్య ప్రారంభోపన్యాసం, అలహాబాద్‌ హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ వీరేంద్రసింగ్‌ యాదవ్‌ ముగింపు ఉపన్యాసం చేస్తారు. దిల్లీ వర్శిటీ ప్రొఫెసర్లు లక్ష్మణ్‌యాదవ్‌, సూరజ్‌ మండల్‌, రతన్‌లాల్‌లూ ఇందులో పాలుపంచుకుంటారు.


ఆహ్వానితుల జాబితాలో లేని పార్టీలు

ఇప్పటి వరకు జారీచేసిన అతిథుల జాబితాలో భాజపాయేతర పార్టీలైన బీఎస్పీ, జేడీయూ, వైకాపా, తెదేపా, బీజేడీ, శివసేన, జేడీఎస్‌, శిరోమణి అకాళీదళ్‌, ఆర్‌ఎల్‌డీ, ఎంఐఎం, అస్సాం గణపరిషత్‌, పీడీపీ పేర్లు లేవు. ఈ పార్టీలు ఈ సమావేశానికి దూరంగా ఉండే సూచనలు కనిపిస్తున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని