Dharmana: మనకే ఓటేస్తారని దేవునిపై ఒట్టేయించండి!: మంత్రి ధర్మాన

‘రానున్న ఎన్నికల్లో వైకాపాకు ఓటేస్తారనే నమ్మకం ఉండి.. వారు వైకాపాకే ఓటేస్తామని చెబితే వెంటనే దేవుని చిత్రపటంపై వారితో ఒట్టు వేయించండి’ అని రాష్ట్ర రెవెన్యూశాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు వాలంటీర్లకు సూచించారు.

Updated : 18 Apr 2023 07:51 IST

అరసవల్లి, న్యూస్‌టుడే: ‘రానున్న ఎన్నికల్లో వైకాపాకు ఓటేస్తారనే నమ్మకం ఉండి.. వారు వైకాపాకే ఓటేస్తామని చెబితే వెంటనే దేవుని చిత్రపటంపై వారితో ఒట్టు వేయించండి’ అని రాష్ట్ర రెవెన్యూశాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు వాలంటీర్లకు సూచించారు. శ్రీకాకుళం టౌన్‌హాల్లో సోమవారం రాత్రి వాలంటీర్లతో జరిగిన సమావేశంలో మంత్రి మాట్లాడారు. ‘ప్రజలు ఎవరికి ఓటేస్తారనేది గుర్తించాలి. ఇందుకు మూడు పద్ధతులు అనుసరించాలి. ఏ, బీ, సీలుగా విభజించి.. ఏలో వైకాపాకు వేసేవారిని, బీలో వైకాపాకు ఓటు వేయనివారిని, సీలో గోడమీద పిల్లిలాంటి వారిని గుర్తించాలి. తెదేపాకు ఓటువేసే ఒక్క కుటుంబాన్ని వైకాపా వైపు వాలంటీర్లు తిప్పగలిగితే వేలల్లో ఓట్లు మనకు పడతాయి.

వచ్చే ఎన్నికల్లో జగన్‌ గెలవకపోతే సంక్షేమ పథకాలు ఆగిపోతాయని, చంద్రబాబు వస్తే పథకాలు ఇవ్వరనే బలహీనతపై కొట్టాలి. దూరప్రాంతాలకు వెళ్లిపోయిన వైకాపా ఓటర్లను గుర్తించి వారి చిరునామాలు సేకరించాలి. ఎవరైనా వినకపోతే కుటుంబపెద్దలను కలిసి మాట్లాడాలి. కొందరు కులపెద్దల మాట వింటారు. అలాంటివారిని గుర్తించి కులపెద్దలతో మాట్లాడాలి. ఓట్ల సేకరణకు తుపాకీ పట్టిన సైనికుడిలా యుద్ధానికి సిద్ధం కావాలి. మాకంటే వాలంటీర్లకే ఓటర్లలో మంచిపేరుంది. వైకాపా ఓడిపోతే వాలంటీర్‌ ఉద్యోగం పోతుంది’ అని మంత్రి ధర్మాన వ్యాఖ్యానించారు. యువజన నాయకుడు ధర్మాన రామ్‌మనోహర్‌నాయుడు మాట్లాడుతూ ‘ప్రజలు నాయకుల పేర్లు మరచిపోయారు. వాలంటీర్ల పేర్లే గుర్తుంచుకున్నారు. మనమంతా ఎన్నికలకు సిద్ధంగా ఉండాలి. వాలంటీర్లు వైకాపా కోసం కష్టపడి పనిచేయాలి. ఉద్యోగం ఇష్టం లేకపోతే మానేయాలి’ అని స్పష్టం చేశారు. ఈ సమావేశానికి 60 మంది వాలంటీర్లు గైర్హాజరయ్యారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని