Ganta Srinivasrao: ఆ విమానాశ్రయాల మధ్య తేడా జగన్‌కు తెలుసా?: గంటా

‘ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి కనీస అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు. డిఫెన్స్‌ ఎయిర్‌పోర్టు, సివిల్‌ ఎయిర్‌పోర్టుకు ఉన్న తేడా కూడా తెలియదా’ అని సీఎం జగన్‌ను మాజీమంత్రి, తెదేపా ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ప్రశ్నించారు.

Updated : 05 May 2023 08:31 IST

విశాఖపట్నం(వన్‌టౌన్‌), న్యూస్‌టుడే: ‘ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి కనీస అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు. డిఫెన్స్‌ ఎయిర్‌పోర్టు, సివిల్‌ ఎయిర్‌పోర్టుకు ఉన్న తేడా కూడా తెలియదా’ అని సీఎం జగన్‌ను మాజీమంత్రి, తెదేపా ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ప్రశ్నించారు. విశాఖలో గురువారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. ‘రక్షణశాఖ పరిధిలో ఉన్న విశాఖ విమానాశ్రయాన్నే అంతర్జాతీయ స్థాయికి అభివృద్ధి చేస్తామని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పారు. ఇప్పుడు భోగాపురంతో వైభోగమంటున్నారు. రక్షణశాఖ పరిధిలోని విశాఖ విమానాశ్రయంపై ఆంక్షల విషయంలో కనీస పరిజ్ఞానం లేకుండా సీఎం మాట్లాడారు’ అని గంటా విమర్శించారు. ఇన్నాళ్లూ ఉత్తరాంధ్రకు ఏమీ చేయకుండా.. ఎన్నికలు సమీపిస్తున్నాయని భోగాపురం విమానాశ్రయం, అదానీ డేటాసెంటర్‌కు మరోసారి శంకుస్థాపనలు చేయడం విడ్డూరమన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండగా ఈ రెండు ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారని గుర్తుచేశారు. దానికి సంబంధించిన ఫొటోను చూపించారు. ‘రాష్ట్రంలో ఎన్నో చిట్‌ఫండ్‌ సంస్థలుండగా వాటి జోలికి పోకుండా, మార్గదర్శి సంస్థలో సోదాలు చేస్తూ భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. సుప్రీంకోర్టు ఆదేశాలతో.. చంద్రబాబు అరెస్టు ఖాయమని ప్రభుత్వ పెద్దలు అంటున్నారు. అది మీవల్ల కాదనే విషయం అందరికీ తెలుసు’ అని గంటా పేర్కొన్నారు. రాష్ట్రంలో నిరుద్యోగుల సంఖ్య పెరిగిపోతోందని ఎమ్మెల్సీ చిరంజీవిరావు ఆవేదన వ్యక్తం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని