మీ ఆరోపణలు అసత్యాల పుట్టలు

ప్రధాన మంత్రిగా నరేంద్ర మోదీ బాధ్యతలు చేపట్టి శుక్రవారానికి తొమ్మిదేళ్లు పూర్తయ్యింది. ఈ సందర్భంగా భాజపా పలు చోట్ల ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టింది.

Updated : 27 May 2023 06:42 IST

మోదీ హయాంలో దేశ సర్వతోముఖాభివృద్ధి
కాంగ్రెస్‌పై భాజపా ఎదురుదాడి

దిల్లీ: ప్రధాన మంత్రిగా నరేంద్ర మోదీ బాధ్యతలు చేపట్టి శుక్రవారానికి తొమ్మిదేళ్లు పూర్తయ్యింది. ఈ సందర్భంగా భాజపా పలు చోట్ల ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టింది. మోదీ ప్రభుత్వంపై కాంగ్రెస్‌ నేతలు చేసిన విమర్శలు, ఆరోపణలను తిప్పికొట్టింది. హస్తంపార్టీ సంధించిన ప్రశ్నలను నయ వంచనతో కూడిన అసత్యాల పుట్టగా అభివర్ణించింది. ప్రధాని మోదీపై ఉన్న విద్వేషం నుంచే అవి ఉద్భవించాయని పేర్కొంది. ఎన్డీయే సర్కారు అధికారంలోకి వచ్చే సమయానికి బలహీనంగా ఉన్న దేశ ఆర్థిక వ్యవస్థ ఈ తొమ్మిదేళ్లలో ప్రపంచంలోనే అయిదో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిందని భాజపా నేత, కేంద్ర మాజీ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ తెలిపారు. మోదీ నేతృత్వంలో దేశం సర్వతోముఖాభివృద్ధి సాధిస్తోందని భాజపా అధ్యక్షుడు జె.పి.నడ్డా పేర్కొన్నారు.

భాజపా స్పందన ఇదీ..

* 2014లో దేశ ఆర్థిక వ్యవస్థ పరిమాణం లక్ష కోట్ల అమెరికా డాలర్లు మాత్రమే. ఇప్పుడు 3.5 లక్షల కోట్ల డాలర్ల స్థాయికి చేరింది. విదేశీ కరెన్సీ నిల్వలు రూ.50లక్షల కోట్లకు పెరిగాయి. ఎగుమతులు రెండు రెట్లు అధికమై రూ.36లక్షల కోట్లకు చేరువయ్యాయి.

* మన దేశంలో రిటైల్‌ ద్రవ్యోల్బణం 4.7శాతంగా ఉంది. ఇదే సమయంలో అమెరికాలో ద్రవ్యోల్బణం 8.9శాతం, ఫ్రాన్స్‌లో 17.5శాతం, జర్మనీలో 23.5 శాతంగా ఉంది.

* మోదీ ప్రభుత్వం 312 పథకాల ద్వారా లబ్ధిదారులకు రూ.6.68లక్షల కోట్లను నేరుగా బదిలీ చేసింది. దీనివల్ల రూ.2.7లక్షల కోట్లు మధ్యవర్తుల చేతుల్లో పడకుండా ఆదా చేయగలిగింది.

* మోదీ ప్రభుత్వం వ్యవసాయ ఉత్పత్తులకు కనీస మద్దతు ధరలను గణనీయంగా పెంచింది. 11 కోట్ల మంది రైతులకు ఏడాదికి రూ.6వేలు చొప్పున వారి బ్యాంకు ఖాతాలకు నేరుగా బదిలీ చేస్తోంది.

* కాంగ్రెస్‌ అధికారంలో ఉన్న సమయంలోనే చైనా మన భూభాగాలను ఆక్రమించింది. ఇటీవల తూర్పు లద్దాఖ్‌లో చైనా దురాక్రమణ యత్నాలను మన సైన్యం ధైర్యంగా తిప్పికొట్టింది. కాంగ్రెస్‌ హయాంలో మన సరిహద్దుల వద్ద సరైన మౌలిక వసతులు లేవు. మోదీ ప్రభుత్వం సరిహద్దులను బలోపేతం చేస్తోంది.

* మోదీపై విద్వేషం వెదజల్లడాన్ని కాంగ్రెస్‌ మానుకోవాలి. ఇప్పటికే రెండు సార్లు లోక్‌సభ ఎన్నికల్లో దారుణంగా ఓడిపోయింది. 2024 ఎన్నికల్లోనూ ఆ పార్టీకి పరాజయం తప్పదు.

* కొవిడ్‌ సమయంలో మోదీ ప్రభుత్వం సరిగా స్పందించలేదనడం దారుణం. మన దేశం తీసుకున్న చర్యలను ప్రపంచం యావత్తు గుర్తించింది. ప్రశంసించింది.

* 2014లో మన దేశ అవసరాలు తీర్చుకోవడం కోసం 78 శాతం సెల్‌ఫోన్లు దిగుమతి చేసుకోవాల్సి వచ్చేది. ఇప్పుడు 99శాతం మొబైల్‌ ఫోన్లు దేశీయంగానే తయారవుతున్నాయి.

* కాంగ్రెస్‌ నేతృత్వంలోని యూపీఏ పాలన కొనసాగిన 2004-14లో ప్రతి రంగంలోనూ భారీ అవినీతి చోటుచేసుకుంది. అటువంటి పార్టీ మోదీ పాలనపై ఆరోపణలు చేయడం విడ్డూరంగా ఉందని రవి శంకర్‌ ప్రసాద్‌ దుయ్యబట్టారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు