Kakinada: ఏం చేశారని జగన్‌కు ఓటేయాలి..?

‘ముఖ్యమంత్రిగా జగన్‌మోహన్‌రెడ్డి ఏం చేశారని మేం ఓటేయాలి? మాకు ఏమీ వద్దు. మేమేమీ తీసుకోం.. వచ్చే ఎన్నికల్లో జగన్‌కు ఓటు వేసేది లేదు’ అని కాకినాడ నగర ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి ఎదుట ఓ మహిళ తీవ్ర ఆక్రోశం వ్యక్తంచేశారు.

Updated : 01 Jul 2023 13:46 IST

ఎమ్మెల్యే ద్వారంపూడి ఎదుట మహిళ ఆక్రోశం

కాకినాడ కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: ‘ముఖ్యమంత్రిగా జగన్‌మోహన్‌రెడ్డి ఏం చేశారని మేం ఓటేయాలి? మాకు ఏమీ వద్దు. మేమేమీ తీసుకోం.. వచ్చే ఎన్నికల్లో జగన్‌కు ఓటు వేసేది లేదు’ అని కాకినాడ నగర ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి ఎదుట ఓ మహిళ తీవ్ర ఆక్రోశం వ్యక్తంచేశారు. శుక్రవారం నగరంలోని ఆరో డివిజన్‌ రేచర్లపేట ఎస్సీకాలనీలో ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే ద్వారంపూడి ఇంటింటా పర్యటించారు. వాలంటీర్లు, సచివాలయ సిబ్బందితో కలిసి ఎమ్మెల్యే ఓ ఇంటికి వెళ్లగా ఆ గృహస్థురాలు ఒక్కసారిగా.. ‘తమకేమీ వద్దని, తామేమీ తీసుకోమని, ఓటు కూడా వేసేది లేద’ని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో అవాక్కయిన ఎమ్మెల్యే అక్కడి నుంచి ముందుకు వెళ్లిపోయారు. ఆయన వెంట వచ్చిన వైకాపా నాయకులు ఆమెను సముదాయించడానికి ప్రయత్నించారు. ‘సార్‌తో అలా మాట్లాడవచ్చా..’ అని ప్రశ్నించగా ఆమె బదులిస్తూ.. ‘ఇల్లు లేనివారిని పట్టించుకోరు. మీ సార్‌ ఎవరికి గొప్ప? మేం అడిగితే చెడ్డ.. అన్నింటి ధరలు పెరిగిపోయాయి. 20 ఏళ్లుగా అద్దె ఇంటిలో ఉంటున్నాం. పట్టించుకునే నాథుడే లేడు. గతంలో ఇచ్చిన పట్టానూ వెనక్కి తీసుకున్నారు. మళ్లీ 90 రోజుల తరువాత ఇస్తారట. ఈలోగా జగన్‌ పదవి అయిపోతుంది. చేతులు దులిపేసుకుంటారు’ ఆమె తీవ్రంగా స్పందించారు. ‘ఎవరికి ఇల్లు ఉందో.. ఎవరికి లేదో పట్టించుకోండి. కాలువల్లో చెత్త తీసి బయట వేస్తారు. వారం రోజుల వరకు తొలగించరు. దుర్వాసనతో ముక్కు మూసుకుంటున్నాం’ అని ఆగ్రహం వ్యక్తంచేశారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు