తప్పు చేసినట్లు నిరూపిస్తే..రాజకీయాలకు గుడ్‌బై

కాంగ్రెస్‌ పార్టీపైన, పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిపైన పురపాలకశాఖ మంత్రి కేటీఆర్‌ శనివారం శాసనసభలో విరుచుకుపడ్డారు.

Updated : 06 Aug 2023 06:13 IST

ఓఆర్‌ఆర్‌పై ప్రతిపక్షాల ఆరోపణలకు మంత్రి కేటీఆర్‌ సవాల్‌
నిధుల సమీకరణకే లీజు అని స్పష్టీకరణ
సీఎం, అధికారులపై పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ వ్యాఖ్యలు అభ్యంతకరమని వ్యాఖ్య
ఆయన అంతు చూస్తామంటూ హెచ్చరిక


ఆయన ‘బండి’ షెడ్డుకు పోయింది..

రోడ్లు వెడల్పు చేస్తామని.. 96 ఎకరాల స్థలం కావాలని ఎన్నిసార్లు కేంద్రానికి మొరపెట్టుకున్నా మోకాలడ్డుతున్నారు. గతంలో వరదలొచ్చినప్పుడు.. బండిపోతే బండి ఇస్తా.. కారుపోతే కారు ఉచితంగా ఇస్తానని వినోదం పంచిన ఒకరు.. ఇప్పుడు కనిపించడం లేదు. ఆయన బండి షెడ్డుకు పోయింది. 

 కేటీఆర్‌


ఈనాడు, హైదరాబాద్‌: కాంగ్రెస్‌ పార్టీపైన, పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిపైన పురపాలకశాఖ మంత్రి కేటీఆర్‌ శనివారం శాసనసభలో విరుచుకుపడ్డారు. రేవంత్‌రెడ్డి ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని, ఓఆర్‌ఆర్‌ లీజు వ్యవహారంలో కుంభకోణం జరిగిందంటూ అసత్యాలు చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ టెండర్లలో తానుగానీ, ప్రభుత్వం గానీ తప్పు చేసినట్లు నిరూపిస్తే మంత్రి పదవికి రాజీనామా చేస్తానని, ఆ క్షణం నుంచే రాజకీయాల నుంచి శాశ్వతంగా వైదొలగుతానని ప్రకటించారు. రాష్ట్రంలో మౌలిక సదుపాయాల కల్పన, పల్లె ప్రగతి- పట్టణ ప్రగతి కోసం ప్రభుత్వం తీసుకున్న చర్యలు- సాధించిన ఫలితాలు అనే అంశంపై శాసనసభలో శనివారం స్వల్పకాలిక చర్చ జరిగింది. ఈ సందర్భంగా సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఇతర సభ్యులు మాట్లాడిన అనంతరం.. కేటీఆర్‌ రెండు గంటలపాటు సమాధానమిచ్చారు. ఆర్‌టీఐ అంటే కొందరికి ‘రూట్‌ టూ ఇన్‌కం’గా మారిందని పరోక్షంగా రేవంత్‌రెడ్డిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. అవుటర్‌ రింగ్‌ రోడ్డు టోల్‌ టాక్స్‌కు సంబంధించి 30 ఏళ్లపాటు ఐఆర్‌బీఐ డెవలపర్స్‌ అనే కంపెనీకి లీజుకిస్తే.. అసత్య ఆరోపణలు చేసిన పీసీసీ అధ్యక్షుడిపై ఆ కంపెనీ రూ.వెయ్యి కోట్లకు పరువు నష్టం దావా వేసిందన్నారు. ‘రాష్ట్రంలో బిహార్‌ ఐఏఎస్‌ల పెత్తనం నడుస్తోందంటారు. యూపీఎస్‌సీ పరీక్షలు రాసి ప్రభుత్వ నియామకాల మేరకు ఇక్కడ పనిచేస్తున్న ఆ అధికారులపై నోటికొచ్చినట్లు మాట్లాడతారు. సీఎం కేసీఆర్‌ను ఉరి తీయాలంటారు.. ఇదేం పద్ధతి? మీ పీసీసీ అధ్యక్షుడి అంతు చూస్తాం’ అని మంత్రి హెచ్చరించారు. ‘రేవంత్‌రెడ్డి 2014 జనవరిలో అసెంబ్లీలో మాట్లాడుతూ.. సోనియాగాంధీని బలిదేవత అని వర్ణించారు’ అంటూ ఆనాటి రేవంత్‌ ప్రసంగాన్ని కేటీఆర్‌ చదివి వినిపించారు.

మీ ప్రభుత్వాలున్న రాష్ట్రాల్లోనూ ఆ కంపెనీయే

‘టోల్‌ ఆపరేట్‌ ట్రాన్స్‌ఫర్‌(టీఓటీ) విధానం యూపీయే హయాంలోనే వచ్చింది. దీనికింద దేశవ్యాప్తంగా 9చోట్ల టోల్‌ లీజులిచ్చారు. కాంగ్రెస్‌ అధికారంలో ఉన్న రాజస్థాన్‌, భాజపా పాలిత రాష్ట్రాల్లోనూ ఆ కంపెనీకే ఇచ్చారు. అక్కడ కూడా కుంభకోణాలు జరిగినట్లేనా? రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాలకు నిధుల సమీకరణ చేయాలి కదా?.. అందులో భాగంగానే ఓఆర్‌ఆర్‌ లీజుకిచ్చాం. గ్లోబల్‌ టెండర్లు పిలిచాం.. జాతీయ రహదారుల సంస్థ నిబంధనలను పాటించాం’ అని కేటీఆర్‌ వివరించారు.

నేను చెప్పేది తప్పయితే మమ్మల్ని ఓడించండి..

‘మూలధన వ్యయం (క్యాపిటల్‌ ఎక్స్‌పెండిచర్‌) ఛత్తీస్‌గఢ్‌లో 15 శాతం, రాజస్థాన్‌లో 16 శాతమైతే.. తెలంగాణలో అది 26 శాతం. నేను చెప్పేది తప్పయితే మమ్మల్ని ఓడించండి. గ్రామాల్లో సంపద సృష్టించడం వల్లే భూమి బంగారమైంది. రాష్ట్రంలో ఎక్కడికివెళ్లినా ఎకరం రూ.25-30 లక్షలకు తక్కువ లేదు. రెండున్నర శాతం జనాభా ఉన్న రాష్ట్రం ఉత్తమ పంచాయతీ పురస్కారాల్లో 30 శాతం పొందిందని దిల్లీలో భాజపా అవార్డులిస్తుంటే.. గల్లీ భాజపా ఇక్కడ విమర్శలు చేస్తోంది’ అని మంత్రి అన్నారు. పలు పల్లెలు, పట్టణాల్లో చేసిన అభివృద్ధికి సంబంధించిన ఫొటోలను చూపుతూ మంత్రి ఒక్కో దాని గురించి వివరించారు.

ప్రజలకు నీళ్లు తాగించాం.. ప్రతిపక్షాలకు మూడు చెరువుల నీళ్లు తాగిస్తాం

‘మేం మోదీకే భయపడలేదు. కొన్ని విషపత్రికలు పిచ్చిరాతలు రాస్తే భయపడతామా? వాటిని చూసి మీరు సభలో మాట్లాడతారా? మేం ప్రజలకు నీళ్లు తాగించాం.. ఇక ప్రతిపక్షాలకు మూడు చెరువుల నీళ్లు తాగిస్తాం.. ఈ నెల 15వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా 2.28 లక్షల గృహాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభిస్తాం. ఒక్కో డబుల్‌ బెడ్‌ రూం ఇల్లు.. ఏడు ఇందిరమ్మ ఇళ్లతో సమానం. త్వరలోనే గృహలక్ష్మి పథకానికి శ్రీకారం చుడతాం.

హైదరాబాద్‌ ఛిద్రమైతే తెలంగాణ ఆగమవుతుంది

హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ సమస్య నివారణకు ప్రజారవాణాను పెంచుతున్నాం. వ్యూహాత్మక నాలా అభివృద్ధి ప్రాజెక్టు (ఎస్‌ఎన్‌డీపీ) రెండో దశను కూడా మేమే చేపడతాం. వచ్చే ఏడాదికి చెత్త నుంచి 101 మెగావాట్ల విద్యుదుత్పత్తి చేస్తాం. 400 కి.మీ. మెట్రో రైల్‌ను పూర్తి చేస్తాం. సుంకిశాల ప్రాజెక్టును వచ్చే వేసవికి పూర్తి చేస్తాం. దానివల్ల 60 టీఎంసీల తాగునీరు అందుబాటులోకి వస్తుంది. సెప్టెంబరుకల్లా మొత్తం 31 ఎస్‌టీపీలను పూర్తి చేస్తాం. అప్పుడు 100 శాతం మురుగునీటిని శుద్ధి చేసి బయటకు వదిలే తొలి నగరంగా హైదరాబాద్‌ మారనుంది’ అని కేటీఆర్‌ తెలిపారు.

భట్టి గారూ.. మీకూ ఉచితంగా తాగునీరు ఇస్తాం

తాగునీటి కొరత వల్ల ప్రతిరోజూ నీటి ట్యాంకర్ల నీటిని కొనుక్కొంటున్నామని కాంగ్రెస్‌ నేత భట్టి విక్రమార్క చెప్పిన నేపథ్యంలో అప్పటికప్పుడు ట్యాంకర్ల జాబితాను మంత్రి కేటీఆర్‌ సభకు తెప్పించారు. జలమండలి నుంచి రప్పించిన వివరాలు చూస్తే.. 2022 జనవరి నుంచి ఒక్క ట్యాంకర్‌ కూడా బుక్‌ చేయలేదన్నారు. భట్టి ఇంట్లో నీటి మీటరు చెడిపోవడం వల్ల అప్పటి నుంచి ఇప్పటివరకు రూ.2.90 లక్షల బిల్లు చెల్లించాల్సి వచ్చిందని చెప్పారు. మీటర్‌ పనిచేసి ఉంటే.. మీ ఇంటికి కూడా నెలకు 20 వేల లీటర్ల మంచినీరు ఉచితంగా ఇచ్చేవారమన్నారు.


కోనసీమలా తెలంగాణ పల్లెలు

సిరిసిల్ల జిల్లాకు చెందిన వేణు ఇటీవల తీసిన బలగం సినిమాలో పల్లెను చూసి మా కుటుంబసభ్యులు.. ఆ సినిమాను కోనరావుపేట (వేములవాడ నియోజకవర్గం)లో తీశారా? కోనసీమలో తీశారా? అని అడిగారు. పచ్చదనంతో మురిసిపోతున్న తెలంగాణలోని పల్లెలకు సినిమా వాళ్లు షూటింగ్‌లకు తరలివస్తున్నారు


కేసీఆర్‌ది మెరుపువేగం

కేసీఆర్‌ మెరుపువేగంతో నిర్ణయాలు తీసుకోవడం వల్లే ప్రజల జీవితాల్లో వెలుగులు పూస్తున్నాయి. కొందరు అనుమానపక్షులు ఏదో మాట్లాడుతున్నారు. వాళ్లు ఇకపై ఇంట్లో పడుకోవాల్సిందే. కేసీఆర్‌ అనుకుంటే సాధిస్తారు. కంటెంట్‌ లేని కాంగ్రెసోళ్లకు.. కమిట్‌మెంట్‌ ఉన్న కేసీఆర్‌కు పోలికా?

మంత్రి కేటీఆర్‌


చంద్రబాబుకు కృతజ్ఞతలు

ప్రతిపక్షాలకు అర్థం కావడం లేదు

ఈ చర్చ సందర్భంగా.. తెదేపా అధినేత చంద్రబాబుకు మంత్రి కేటీఆర్‌ కృతజ్ఞతలు తెలిపారు. ఒకప్పుడు ఏపీలో ఎకరం అమ్మితే తెలంగాణలో 100 ఎకరాలు కొనుక్కోవచ్చని, ఇప్పుడు తెలంగాణలో ఎకరం అమ్మితే ఏపీలో 50 ఎకరాలు కొనవచ్చని పక్క రాష్ట్రంలో ప్రతిపక్ష నేత చంద్రబాబు వ్యాఖ్యానించారని కేటీఆర్‌ గుర్తుచేశారు. అంతేకాకుండా.. తెలంగాణ ప్రభుత్వానికి రైతులపై ప్రేమ ఉందని, అందుకే కేంద్రం మెడపై కత్తి పెట్టినా వ్యవసాయ బోర్లకు మీటర్లు పెట్టడం లేదని చంద్రబాబు చెప్పారని, అందుకే ఆయనకు ధన్యవాదాలని అన్నారు. ఏపీ సీఎం జగన్‌ సైతం దిశ ఘటన జరిగిన తర్వాత రాష్ట్రంలో శాంతిభద్రతలపై తీసుకున్న చర్యలను ప్రశంసించారని, తమ ప్రభుత్వ ఘనత పక్క రాష్ట్రాలకు అర్థమవుతోంది తప్ప.. ఇక్కడి ప్రతిపక్షాలకు మాత్రం అర్థం కావడం లేదని కేటీఆర్‌ విమర్శించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని