Kalvakuntla Kavitha: కరెంటు తీగలు పట్టుకొని చూడండి.. విద్యుత్‌ వస్తుందో లేదో తెలుస్తుంది: కవిత

భాజపా ఎంపీలు బండి సంజయ్‌, ధర్మపురి అర్వింద్‌లు పచ్చి అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని భారాస ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ధ్వజమెత్తారు.

Updated : 11 Aug 2023 08:18 IST

సంజయ్‌పై ఎమ్మెల్సీ కవిత విసుర్లు

ఈనాడు, హైదరాబాద్‌: భాజపా ఎంపీలు బండి సంజయ్‌, ధర్మపురి అర్వింద్‌లు పచ్చి అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని భారాస ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ధ్వజమెత్తారు. ఉద్యోగాల కల్పనపై అర్వింద్‌ మాట్లాడినవన్నీ అబద్ధాలేనని, సీఎం కేసీఆర్‌కు సవాల్‌ విసిరే స్థాయి ఆయనది కాదని ఆమె విమర్శించారు. సంజయ్‌కు ఎక్కడ ఏం మాట్లాడాలో తెలియదని, రాష్ట్రంలో వ్యవసాయానికి 24 గంటల కరెంటు ఇవ్వడం లేదంటున్న ఆయన కరెంట్‌ తీగలను పట్టుకొని చూడాలని, కరెంట్‌ వస్తుందో లేదో తెలుస్తుందని ఎద్దేవా చేశారు. భారాస శాసనసభా పక్ష కార్యాలయంలో ఎమ్మెల్యేలు గణేశ్‌ బిగాల, బాజిరెడ్డి గోవర్ధన్‌, మాజీ ఎమ్మెల్సీ గంగాధర్‌గౌడ్‌లతో కలిసి కవిత గురువారం విలేకరులతో మాట్లాడారు.  ‘‘నిజామాబాద్‌లో ఐటీ హబ్‌ గురించి అర్వింద్‌ దారుణంగా మాట్లాడారు. ఇక్కడ ఐటీ హబ్‌లో మొత్తం ఉద్యోగాల సామర్థ్యం 750 ఉంటే.. ఇప్పటికే 280 మందికి నియామక పత్రాలిచ్చాం. అది చూసి భాజపా, కాంగ్రెస్‌ నాయకులు అక్కసు వెళ్లగక్కుతున్నారు. గత పదేళ్లలో నిజామాబాద్‌ జిల్లా అభివృద్ధిలో భాజపా భాగస్వామ్యం సున్నా. ఈ జిల్లాకు ఇది కావాలని ఒక్కరోజు కూడా అర్వింద్‌ పార్లమెంటులో అడగలేదు. గ్రామీణ పిల్లలకు ఐటీ ఉద్యోగాలు వస్తే.. ఆయనకు ఎందుకంత కడుపు మంట’’ అని విరుచుకుపడ్డారు. సంజయ్‌ను ఉద్దేశించి కవిత మాట్లాడుతూ.. ‘‘కాళేశ్వరం ప్రాజెక్టుకు కేంద్రం ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. భాజపా ఎంపీ నిశికాంత్‌ దూబే కాళేశ్వరానికి రూ.86 వేల కోట్లు ఇచ్చామని అబద్ధాలు మాట్లాడారు. దానికి కొనసాగింపుగానే పార్లమెంటులో సంజయ్‌ విపరీతమైన అబద్ధాలు మాట్లాడారు. మా నాయకుడిని వ్యక్తిగతంగా దూషించారు. అది ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నా’’ అని అన్నారు. తాను నిజామాబాద్‌ నుంచే ఎంపీగా పోటీ చేసి గెలుస్తానని ఆమె ధీమా వ్యక్తం చేశారు. అర్వింద్‌ కోరుట్ల నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తానంటున్నారని, ఆయన ఎక్కడ పోటీ చేసినా వెంటబడి మరీ ఓడిస్తానన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని