ఎమ్మెల్యే అవమానిస్తున్నారు: తిరువూరు మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌ కంటతడి

ప్రభుత్వ ఉద్యోగిగా పదవీ విరమణ చేసి, ప్రజాసేవ కోసం రాజకీయాల్లోకి వచ్చిన తనను.. రెండున్నరేళ్లుగా స్థానిక ఎమ్మెల్యే రక్షణనిధి అవమానిస్తున్నారని ఎన్టీఆర్‌ జిల్లా తిరువూరు మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌ గత్తం కస్తూరిబాయి వాపోయారు.

Updated : 14 Aug 2023 07:30 IST

తిరువూరు, న్యూస్‌టుడే: ప్రభుత్వ ఉద్యోగిగా పదవీ విరమణ చేసి, ప్రజాసేవ కోసం రాజకీయాల్లోకి వచ్చిన తనను.. రెండున్నరేళ్లుగా స్థానిక ఎమ్మెల్యే రక్షణనిధి అవమానిస్తున్నారని ఎన్టీఆర్‌ జిల్లా తిరువూరు మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌ గత్తం కస్తూరిబాయి వాపోయారు. పట్టణంలోని అంబేడ్కర్‌ భవన్‌ వద్ద ఆదివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ కన్నీటిపర్యంతమయ్యారు. ‘3వ వార్డు నుంచి వైకాపా తరఫున రెండుసార్లు కౌన్సిలర్‌గా గెలిచాను. ఎస్సీ జనరల్‌కు కేటాయించిన ఛైర్మన్‌ పదవిని నాకు ఇవ్వాలని అప్పట్లో ఎమ్మెల్యే రక్షణనిధిని కోరగా నిరాకరించారు. సీఎం జగన్‌ను కలిసి విజ్ఞప్తి చేస్తే, అధిష్ఠానం నా పేరు ఖరారు చేసింది. మాల సామాజికవర్గానికి చెందిన వ్యక్తిని కావడంతో ఛైర్‌పర్సన్‌ పదవి నాకు ఇచ్చేందుకు ఇష్టంలేని ఎమ్మెల్యే.. తొలి నుంచీ సహకరించకుండా ప్రతి సందర్భంలోనూ వివక్ష చూపిస్తున్నారు. ఇటీవల ముఖ్యమంత్రి తిరువూరు వచ్చినప్పుడూ సభావేదిక వద్ద ఎమ్మెల్యే అవమానించారు. పార్టీకి చెడ్డ పేరు వస్తుందని ఇప్పటిదాకా అవమానాలు దిగమింగాను. ఛైర్మన్‌ పదవి మార్పుపై రెండేళ్ల గడువు ఒప్పందం అమలు చేయాలని 16 మంది కౌన్సిలర్లతో బలవంతంగా సంతకాలు చేయించారు. ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా కరపత్రాలు పంచిన వారికీ, నాకూ ఎలాంటి సంబంధం లేదు. వారిపై చర్యలు తీసుకోవాలని నేనూ కోరుతున్నాను. అధిష్ఠానం ఆదేశిస్తే పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నాన’ని కస్తూరిబాయి పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు