Chandrababu Arrest: రాజమహేంద్రవరం కారాగారం ఇన్‌ఛార్జి సూపరింటెండెంట్‌ బుగ్గన సమీప బంధువే!

రాజమహేంద్రవరం కేంద్ర కారాగారం ఇన్‌ఛార్జి సూపరింటెండెంట్‌గా బాధ్యతలు చేపట్టిన ఆంధ్రప్రదేశ్‌ జైళ్లశాఖ కోస్తాంధ్ర రీజియన్‌ డీఐజీ ముదపురెడ్డి రవికిరణ్‌ ఎవరో తెలుసా? రాష్ట్ర ఆర్థిక మంత్రి, వైకాపా సీనియర్‌ నాయకుడు బుగ్గన రాజేంద్రనాథరెడ్డికి సమీప బంధువు. ప్రభుత్వ పెద్దలకు అత్యంత సన్నిహితుడు.

Updated : 16 Sep 2023 09:52 IST

చంద్రబాబు ఉన్న జైలులో ఆయన నియామకంపై తెదేపా అనుమానాలు

ఈనాడు, అమరావతి: రాజమహేంద్రవరం కేంద్ర కారాగారం ఇన్‌ఛార్జి సూపరింటెండెంట్‌గా బాధ్యతలు చేపట్టిన ఆంధ్రప్రదేశ్‌ జైళ్లశాఖ కోస్తాంధ్ర రీజియన్‌ డీఐజీ ముదపురెడ్డి రవికిరణ్‌ ఎవరో తెలుసా? రాష్ట్ర ఆర్థిక మంత్రి, వైకాపా సీనియర్‌ నాయకుడు బుగ్గన రాజేంద్రనాథరెడ్డికి సమీప బంధువు. ప్రభుత్వ పెద్దలకు అత్యంత సన్నిహితుడు. సాధారణంగా జైలు సూపరింటెండెంట్‌ సెలవుపై వెళితే ఇన్‌ఛార్జిగా ఆ స్థాయి అధికారికి, లేదా ఆ తర్వాత స్థానంలో ఉన్న అధికారికి బాధ్యతలు అప్పగిస్తారు. అలాంటిది డీఐజీ స్థాయి అధికారికి ఈ బాధ్యతలు ఇవ్వటంలో ఆంతర్యమేంటి? అది కూడా తెదేపా అధినేత చంద్రబాబు ఆ కారాగారంలో రిమాండులో ఉన్న సమయంలో ఆకస్మికంగా ఈ పరిణామాలు చోటుచేసుకోవటంలో లోగుట్టు ఏంటి? రవికిరణ్‌ వైకాపాకు అనుకూలంగా ఉంటారని, ఆయన గతంలో పనిచేసిన చోటల్లా వారికి మేలు కలిగేలా వ్యవహరించేవారని తెదేపా ఆరోపిస్తోంది. ఆయన జైళ్లశాఖ కడప రేంజి డీఐజీగా ఉన్నప్పుడు కడప కేంద్ర కారాగారంలో రిమాండు ఖైదీలుగా ఉన్న వివేకా హత్యకేసు నిందితులకు, ప్రధానంగా ఎంపీ వై.ఎస్‌.అవినాష్‌రెడ్డి అనుంగు అనుచరుడైన దేవిరెడ్డి శివశంకరరెడ్డికి రాచమర్యాదలు చేశారన్న విమర్శలున్నాయి. ఆయన డీఐజీగా ఉన్నప్పుడే కోర్టు అనుమతి లేకుండానే శివశంకరరెడ్డిని జైలు నుంచి రిమ్స్‌కు తీసుకెళ్లారు. అలాంటి అధికారిని చంద్రబాబును నిర్బంధించిన జైలు సూపరింటెండెంట్‌గా నియమించటంపై తెదేపా అనేక అనుమానాలను లేవనెత్తుతోంది.

బాధ్యతలు చేపట్టగానే ములాఖత్‌ తిరస్కరణ

గురువారమే రాజమహేంద్రవరం కేంద్ర కారాగారం బాధ్యతలు తీసుకున్న రవికిరణ్‌... చంద్రబాబును శుక్రవారం ములాఖత్‌లో కలిసేందుకు ఆయన సతీమణి భువనేశ్వరి చేసుకున్న దరఖాస్తును తిరస్కరించారు. వారంలో రెండుసార్లే ములాఖత్‌కు అవకాశం ఉంటుందని, అత్యవసరమైతే తప్ప మూడోసారి వీలుండదని పత్రికా ప్రకటన విడుదల చేశారు. చంద్రబాబు 14 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసి, ప్రస్తుతం ప్రతిపక్ష నేతగా ఉన్నారు. 73 ఏళ్ల వయసు. అనేక అనారోగ్య సమస్యలూ ఉన్నాయి. అలాంటి ఆయన్ను కలిసేందుకు... ఆయన భార్యకే ములాఖత్‌ నిరాకరించారంటేనే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఇలా అనేక రకాలుగా ఇబ్బందులకు గురిచేయాలన్న ఉద్దేశంతోనే రవికిరణ్‌ను వ్యూహాత్మకంగా అక్కడ నియమించారనే వాదన వ్యక్తమవుతోంది. ఈ నెల 10వ తేదీ అర్ధరాత్రి తర్వాత చంద్రబాబును రాజమహేంద్రవరం కేంద్ర కారాగారానికి తరలించారు. ఆ తర్వాత రోజు అర్ధరాత్రి సమయంలో.. జైళ్లశాఖ కోస్తాంధ్ర రేంజి డీఐజీ హోదాలో రవికిరణ్‌ రాజమహేంద్రవరం కారాగారాన్ని సందర్శించారు. రెండుగంటల పాటు కారాగారంలోనే రౌండ్లు వేసినట్లు సమాచారం. చంద్రబాబు పట్ల కఠినంగా వ్యవహరించేందుకు, ఆయన్ను మానసికంగా కుంగదీసేందుకే రవికిరణ్‌ను తీసుకొచ్చారనే ప్రచారం జరుగుతోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని