‘జమిలి’ ప్రతిపాదనను తిరస్కరిస్తున్నాం

‘‘దేశం ఇంటాబయటా సమస్యలతో కొట్టుమిట్టాడుతోంది. ఆర్థిక సంక్షోభం తీవ్రరూపం దాల్చింది. రాష్ట్రాలపై కేంద్రం తీవ్ర వివక్ష చూపుతూ ఫెడరల్‌ స్ఫూర్తికి విఘాతం కలిగిస్తోంది.

Updated : 17 Sep 2023 07:11 IST

మహిళా బిల్లును తక్షణమే ఆమోదించండి!
జన, కుల గణనలు చేపట్టాల్సిందే
రిజర్వేషన్ల పరిమితినీ పెంచాలి
మోదీ అన్నింటా విఫలమయ్యారు
సీడబ్ల్యూసీలో తొలిరోజు 14 తీర్మానాలు

  • మహిళా సాధికారతను సాధించడానికి.. ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లోనే మహిళా రిజర్వేషన్‌ బిల్లును ఆమోదించాలి.

  • ఒకే దేశం- ఒకే ఎన్నిక అనే ప్రతిపాదన దేశ సమాఖ్యపై దాడివంటిది. జమిలి ఎన్నికల అంశాన్ని మేం వ్యతిరేకిస్తున్నాం.

  • రాజ్యాంగ ప్రాథమిక స్వరూపాన్ని మార్చాలని, నూతన రాజ్యాంగాన్ని తీసుకురావాలనే వాదనలను తిరస్కరిస్తున్నాం.

  • సామాజిక భద్రత, న్యాయం అందించడానికి ఇండియా కూటమిని ఏర్పాటు చేయడాన్ని హృదయ పూర్వకంగా స్వాగతిస్తున్నాం.

ఈనాడు, హైదరాబాద్‌: ‘‘దేశం ఇంటాబయటా సమస్యలతో కొట్టుమిట్టాడుతోంది. ఆర్థిక సంక్షోభం తీవ్రరూపం దాల్చింది. రాష్ట్రాలపై కేంద్రం తీవ్ర వివక్ష చూపుతూ ఫెడరల్‌ స్ఫూర్తికి విఘాతం కలిగిస్తోంది. చైనాను సరిహద్దుల్లో ఒక్క అడుగు కూడా ముందుకు రానీయబోమని ప్రధాని చెబుతున్నా, వాస్తవానికి దానికి భిన్నంగా జరుగుతోంది. మహిళా రిజర్వేషన్ల బిల్లును ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లోనే ఆమోదించాలి. ఒకే దేశం.. ఒకే ఎన్నిక ప్రతిపాదనను మేం తిరస్కరిస్తున్నాం. పేదలకు మేలు జరిగేలా జన, కులగణన రెండింటినీ ఏకకాలంలో చేపట్టాలి. రిజర్వేషన్లనూ పెంచాలి’’ అని సీడబ్ల్యూసీ సమావేశంలో కాంగ్రెస్‌ పార్టీ పలు కీలక నిర్ణయాలను ప్రకటించింది. మణిపుర్‌, కశ్మీర్‌ రాష్ట్రాల్లో హింసపైనా కమిటీ సమావేశాల్లో లోతుగా చర్చించడం గమనార్హం. తాజ్‌కృష్ణా హోటల్‌లో శనివారం తొలిరోజు జరిగిన సీడబ్ల్యూసీ సమావేశంలో మొత్తం 14 అంశాలపై చర్చించి తీర్మానాలు, చేసినట్లు కాంగ్రెస్‌ వెల్లడించింది. వివిధ అంశాల తీవ్రత దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం తక్షణమే దృష్టి సారించాలని డిమాండ్‌ చేసింది. వీటిలో ప్రధాన అంశాలివే...

  • ధరలు, నిరుద్యోగం పెరిగిపోతున్నాయి. ఏటా రెండు కోట్ల ఉద్యోగాలిస్తామని చెప్పి మోదీ విఫలమయ్యారు. 2021 జనాభా లెక్కల సేకరణ పూర్తి చేయకపోవడం సిగ్గుచేటు. 2011 జనాభా లెక్కల ప్రకారం రేషన్‌కార్డులు ఇవ్వడంతో 14 కోట్ల మంది పేదలకు అన్యాయం జరుగుతోంది. కులగణన చేయకపోవడం బీసీలపై భాజపా చూపుతున్న వివక్షకు నిదర్శనం. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల రిజర్వేషన్ల కోటా పరిమితిని పెంచాలి.
  • అదానీ వ్యాపార సంస్థ లావాదేవీలపై పార్లమెంటరీ సంయుక్త కమిటీ(జేపీసీ) వేయాలి. ఈ లావాదేవీల్లో ప్రభుత్వ పక్షపాతం, పరిపాలనా లోపాలపై విచారణ జరపాలి. ప్రధానితో సన్నిహిత స్నేహం కారణంగానే అదానీ లబ్ధి పొందారు.
  • అరుణాచల్‌ప్రదేశ్‌తోపాటు మరికొన్ని ప్రాంతాలు తమవేనని చైనా దేశపటాలను ముద్రించడమే కాకుండా సరిహద్దులను ఆక్రమించడాన్ని ఖండిస్తున్నాం.
  • కుల, మత, పేద, ధనిక, యువత, వృద్ధులనే తారతమ్యం లేకుండా దేశమంతా ఒకటే అనే సిద్ధాంతానికి అనుగుణంగా పనిచేస్తాం.
  • కశ్మీర్‌లో ఉగ్రవాదుల కాల్పుల్లో అమరులైన పౌరులు, పోలీసుల మృతిపై మేం సంతాపాన్ని వెలిబుచ్చుతున్నాం. ఇంత విషాదం జరిగితే భాజపా, ప్రధాని జీ-20 సమావేశాలు విజయవంతం అయ్యాయని వారికి వారే ప్రశంసించుకోవడం క్షమార్హం కాదు.
  • రాజ్యాంగ పరిరక్షణకు, సామాజిక న్యాయం, సాధికారత సాధనకు గత ఏడాది కాలంగా కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా సేవలందిస్తున్న ఖర్గేని మా పార్టీ ప్రశంసిస్తోంది. 
  • కన్యాకుమారి నుంచి కశ్మీర్‌ వరకు రాహుల్‌గాంధీ చేసిన ‘భారత్‌ జోడో యాత్ర’ పూర్తయి ఏడాది అయింది. ఈ యాత్ర దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పు తెచ్చింది. రాజకీయ కక్షతోనే రాహుల్‌గాంధీ పార్లమెంటు సభ్యుడిగా అనర్హత వేటు వేశారు. తిరిగి సభ్యత్వ పునరుద్ధరణతో న్యాయం జరిగింది.
  • రాజ్యాంగ వ్యవస్థలు పనిచేయనందునే మణిపుర్‌లో హింస కొనసాగుతోంది. తక్షణమే ఆ రాష్ట్ర సీఎంను తొలగించాలి.
  • ప్రధానిగా మోదీ బాధ్యతలు చేపట్టాక మొదటిసారి స్వాతంత్య్ర దినోత్సవ సభలో ప్రసంగిస్తూ కులం, మతం, ప్రాంతీయతత్వంపై పదేళ్ల నిషేధం విధిస్తున్నట్లు తెలిపారు. కానీ, గత తొమ్మిదేళ్లలో ప్రధాని అనుసరించిన వివక్షాపూరిత విధానాలతో ఇవన్నీ బాగా పెరిగాయి. రాజకీయ కక్షతో నాయకులను వేధించడానికి విచారణ సంస్థలను దుర్వినియోగం చేస్తున్నారు. సహకార సమాఖ్య విధానాలను భాజపా ప్రభుత్వం నాశనం చేస్తోంది.
  • రైతు సంఘాల డిమాండు మేరకు పంటలకు మద్దతు ధర అంశాలను పరిష్కరించాలని ప్రధానికి గుర్తు చేస్తున్నాం.రుణాల భారం పెరిగి రైతులు అప్పుల్లో కూరుకుపోయారు. గ్రామీణ ఆర్థికవ్యవస్థ సంక్షోభంలో ఉంది. ప్రభుత్వసాయం అందక, పెద్దనోట్ల రద్దుతో మధ్య, చిన్నతరహా సంస్థలు ఇబ్బందులు పడుతున్నాయి. ఆర్థికవ్యవస్థ అంధకారంలో చిక్కుకుంది.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు