Adani - Jagan: ‘1,400 ఎకరాల డీల్‌ కోసమే సీఎం జగన్‌తో అదానీ రహస్య భేటీ’

విశాఖ ఉక్కు కర్మాగారానికి చెందిన 1,400 ఎకరాల భూముల అమ్మకానికి సంబంధించిన డీల్‌ కోసమే సీఎం జగన్‌ను వ్యాపారవేత్త అదానీ కలిశారని, ఈ వ్యవహారంలో జగన్‌కు రూ.1,400 కోట్లు ముట్టనున్నాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆరోపించారు.

Updated : 01 Oct 2023 08:33 IST

భూముల అమ్మకంలో జగన్‌కు రూ.1,400 కోట్లు అందనున్నాయి
వైకాపాను ఓడించేందుకు తెదేపాతో కలుస్తాం
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ

ఈనాడు, అమరావతి: విశాఖ ఉక్కు కర్మాగారానికి చెందిన 1,400 ఎకరాల భూముల అమ్మకానికి సంబంధించిన డీల్‌ కోసమే సీఎం జగన్‌ను వ్యాపారవేత్త అదానీ కలిశారని, ఈ వ్యవహారంలో జగన్‌కు రూ.1,400 కోట్లు ముట్టనున్నాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆరోపించారు. ఈ విషయం బయట పడకుండా ఉండేందుకే సమావేశాన్ని రహస్యంగా నిర్వహించారన్నారు. విజయవాడలో శనివారం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ.. ‘పెట్టుబడులకు సంబంధించిన సమావేశమైతే అధికారులు, మంత్రులు ఉండాలి కదా? సమావేశ వివరాలను ఎందుకు రహస్యంగా ఉంచారు? విశాఖ ఉక్కు కర్మాగారానికి చెందిన 1,400 ఎకరాలను అదానీకి కట్టబెట్టేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధమయ్యాయి. రూ.1,400 కోట్లు తీసుకొని ఎన్నికలకు వెళ్లాలని జగన్‌ అనుకుంటున్నారు. ఇప్పటికే కృష్ణపట్నం, గంగవరం పోర్టులను ప్రభుత్వం అదానీకి అప్పగించింది. పవన, సోలార్‌ విద్యుత్తు ప్రాజెక్టులూ ఇచ్చింది. అదానీ కంపెనీ నుంచే విద్యుత్తుకు బొగ్గు కొనుగోలు చేస్తున్నారు. షిర్డీ సాయి ఎలక్ట్రికల్స్‌ సీఎం జగన్‌ బినామీదే. షిర్డీసాయి ఎలక్ట్రికల్స్‌, అదానీ కలిపి స్మార్ట్‌మీటర్ల కాంట్రాక్టు చేపట్టారు. ఛత్తీస్‌గఢ్‌, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాల్లో ఒక్కో మీటరు బిగించేందుకు రూ.7,100-రూ.7,900 ఖర్చు అయితే, ఇక్కడ రూ.36 వేలుగా నిర్ణయించారు. ఇందులో తాడేపల్లి ప్యాలెస్‌కు మామూళ్లు వెళ్తున్నాయి. కమ్యూనిస్టులు అమ్ముడుపోయారని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి దిగజారి మాట్లాడుతున్నారు. కమీషన్ల కోసం వాళ్లే అదానీకి అమ్ముడుపోయారు. విమానాశ్రయం నుంచి అదానీ వెళ్లేందుకు గ్రీన్‌ ఛానల్‌ ఏర్పాటు చేశారు. ఏ రాష్ట్రంలోనూ ఏ ప్రభుత్వం ఇంతగా దిగజారి ఉండదు’ అని అన్నారు. 

తెదేపాతో కలుస్తాం..

‘జగన్‌ను ఓడించేందుకు ప్రతిపక్ష తెదేపాతో చేతులు కలుపుతాం. తెదేపా, జనసేన.. భాజపా వైపు చూడకుండా ఉండాలి. మోదీ, అమిత్‌షా సహకారంతోనే చంద్రబాబును జైలుకు పంపారు. కేంద్ర సహకారం లేకపోతే జగన్‌ ప్రభుత్వాన్ని నడపలేరు. రాష్ట్రంలో అరాచకపాలన కొనసాగుతోంది. అభివృద్ధి లేకుండా చేస్తున్నారు. విభజన తర్వాత తెలంగాణ కంటే వెనుకబడ్డాం. సాగునీటి ప్రాజెక్టులు లేవు. ఐటీ పరిశ్రమలు రావడం లేదు. పోలవరాన్ని గాలికి వదిలేశారు’ అని రామకృష్ణ వ్యాఖ్యానించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని