Eatala Rajender: గజ్వేల్‌లో సీఎం కేసీఆర్‌పై ఈటల పోటీ!

రాష్ట్ర శాసనసభ ఎన్నికల బరిలో దిగే 55 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాకు భాజపా కేంద్ర ఎన్నికల కమిటీ ఆమోదముద్ర వేసినట్లు సమాచారం.

Updated : 21 Oct 2023 11:08 IST

అసెంబ్లీ బరిలో ముగ్గురు ఎంపీలు  
కిషన్‌రెడ్డి, లక్ష్మణ్‌కు మినహాయింపు
55 మందితో భాజపా తొలి జాబితా
నేడు అధికారికంగా వెల్లడి

ఈనాడు, హైదరాబాద్‌, దిల్లీ: రాష్ట్ర శాసనసభ ఎన్నికల బరిలో దిగే 55 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాకు భాజపా కేంద్ర ఎన్నికల కమిటీ ఆమోదముద్ర వేసినట్లు సమాచారం. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన దిల్లీలోని పార్టీ జాతీయ కార్యాలయంలో కేంద్ర ఎన్నికల కమిటీ శుక్రవారం రాత్రి సమావేశమైంది. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా, పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, జాతీయ ప్రధాన కార్యదర్శి (సంస్థాగత) బి.ఎల్‌.సంతోష్‌తోపాటు కమిటీ సభ్యులైన పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్‌ లక్ష్మణ్‌, పార్టీ రాష్ట్ర ఇన్‌ఛార్జులు తరుణ్‌ఛుగ్‌, సునీల్‌ బన్సల్‌, సీనియర్‌ నాయకుడు ఈటల రాజేందర్‌ తదితరులు పాల్గొన్నారు. కేంద్ర కమిటీ ఆమోదం తెలిపిన జాబితాను భాజపా శనివారం అధికారికంగా ప్రకటించనుంది. పార్టీ కీలక నేత, మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ను ప్రస్తుతం ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న హుజూరాబాద్‌తోపాటు.. గజ్వేల్‌ నుంచి ముఖ్యమంత్రి కేసీఆర్‌పైనా పోటీకి దింపనుంది. రాష్ట్రం నుంచి నలుగురు భాజపా ఎంపీలు ఉండగా వీరిలో ముగ్గుర్ని శాసనసభ ఎన్నికల బరిలో దింపాలని పార్టీ జాతీయ నాయకత్వం నిర్ణయించింది.

కరీంనగర్‌ ఎంపీ, భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్‌ని కరీంనగర్‌ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి, ఆదిలాబాద్‌ ఎంపీ సోయం బాపురావును బోథ్‌ నుంచి, నిజామాబాద్‌ ఎంపీ ధర్మపురి అర్వింద్‌ను కరీంనగర్‌ జిల్లా కోరుట్ల నుంచి పోటీ చేయించాలని నిర్ణయించింది. ముగ్గురు, నలుగురు మినహా ముఖ్య నేతలంతా అసెంబ్లీ బరిలో నిలవనున్నారు. మాజీ ఎంపీ జి.వివేక్‌ చెన్నూరు నుంచి, పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డి.కె.అరుణ గద్వాల నుంచి పోటీ చేయనున్నారు. ఎమ్మెల్యే రఘునందన్‌రావు మరోసారి దుబ్బాక బరిలోనే దిగనున్నారు. గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌పై ఉన్న సస్పెన్షన్‌ ఎత్తివేత అంశంపై కూడా చర్చ జరిగినట్లు తెలిసింది. మొదటి జాబితాలో పేర్లు ఖరారైన వారిలో పలువురు గత శాసనసభ ఎన్నికల్లో అవే స్థానాల నుంచి పోటీ చేసినవారు కావడం గమనార్హం. స్పష్టత రాని స్థానాలపై మరింత కసరత్తు అనంతరం అభ్యర్థుల పేర్లను ఖరారు చేయనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. కిషన్‌రెడ్డి, కె.లక్ష్మణ్‌లతోపాటు ముఖ్య నేతలందరినీ బరిలో దింపాలని నిర్ణయించినా రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం, ఇతర కీలక బాధ్యతల నేపథ్యంలో ఆ ఇద్దరినీ పోటీ నుంచి మినహాయించాలని జాతీయ నాయకత్వం నిర్ణయించినట్లు సమాచారం.

విశ్వసనీయ సమాచారం మేరకు భాజపా జాబితాలోని కొందరి పేర్లు

1. చెన్నూరు(ఎస్సీ): జి.వివేక్‌ 

2. ఖానాపూర్‌(ఎస్టీ): రమేశ్‌రాథోడ్‌

3. ఆదిలాబాద్‌: పాయల్‌శంకర్‌

4. బోథ్‌(ఎస్టీ): సోయం బాపురావు

5. నిర్మల్‌: మహేశ్వర్‌రెడ్డి

6. కోరుట్ల: ధర్మపురి అర్వింద్‌

7. ధర్మపురి(ఎస్సీ): ఎస్‌.కుమార్‌

8. కరీంనగర్‌: బండి సంజయ్‌

9. చొప్పదండి(ఎస్సీ): బొడిగె శోభ

10. వేములవాడ: చెన్నమనేని వికాస్‌

11. సిరిసిల్ల: రాణి రుద్రమదేవి

12. హుజూరాబాద్‌: ఈటల రాజేందర్‌

13. నారాయణ్‌ఖేడ్‌: సంగప్ప

14. అందోలు(ఎస్సీ): బాబుమోహన్‌

15. పటాన్‌చెరు: నందీశ్వర్‌గౌడ్‌

16. దుబ్బాక: రఘునందన్‌రావు

17. గజ్వేల్‌: ఈటల రాజేందర్‌

18. కుత్బుల్లాపూర్‌: కూన శ్రీశైలంగౌడ్‌

19. ఉప్పల్‌: ఎన్‌.వి.ఎస్‌.ఎస్‌.ప్రభాకర్‌

20:. వికారాబాద్‌ (ఎస్సీ): కొప్పు బాషా

21. గద్వాల: డి.కె.అరుణ

22. కల్వకుర్తి: ఆచారి

23. హుజూర్‌నగర్‌: శ్రీలతారెడ్డి

24. సూర్యాపేట: సంకినేని వెంకటేశ్వర్‌రావు

25. భువనగిరి: గూడూరు నారాయణరెడ్డి

26. జనగామ: దుష్యంత్‌రెడ్డి

27. స్టేషన్‌ఘన్‌పూర్‌(ఎస్సీ): విజయరామారావు

28.. మహబూబాబాద్‌(ఎస్టీ): హుస్సేన్‌నాయక్‌

29.. వరంగల్‌ (వెస్ట్‌): రావు పద్మ

30. వరంగల్‌ (ఈస్ట్‌): ఎర్రబెల్లి ప్రదీప్‌రావు

31. భూపాలపల్లి: కీర్తిరెడ్డి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని