Telangana Elections: ఓటమి ఒక్కసారే.. ఆ తర్వాత వెనుదిరిగి చూసిందే లేదు!

ఎన్నికల్లో గెలుపోటములు సహజమే. కానీ కొందరు నేతలకు మొదటిసారి చేదు ఫలితం దక్కి... ఆ తర్వాత తీపిగా మారింది. వరుస విజయాలతో తమ పార్టీల్లో అంచెలంచెలుగా ఎదిగారు.

Updated : 06 Nov 2023 07:05 IST

వరుస విజయాలతో కీలక నేతలయ్యారు

న్నికల్లో గెలుపోటములు సహజమే. కానీ కొందరు నేతలకు మొదటిసారి చేదు ఫలితం దక్కి... ఆ తర్వాత తీపిగా మారింది. వరుస విజయాలతో తమ పార్టీల్లో అంచెలంచెలుగా ఎదిగారు. రాజకీయంగానూ ముఖ్య పదవులను సాధించారు. రాష్ట్రంలోని పలువురు నేతలు ఓటమితో తమ రాజకీయ ప్రయాణాన్ని మొదలుపెట్టినవారే. వారిలో...

కేసీఆర్‌

భారాస అధినేత    కేసీఆర్‌ ఎన్నికల్లో   తొలిసారి 1983లో పోటీ చేశారు. అప్పుడు తెదేపా అభ్యర్థిగా సిద్దిపేట నుంచి పోటీ చేసి అనంతుల మదన్‌మోహన్‌ చేతిలో కేవలం 877 ఓట్ల తేడాతో ఓడిపోయారు. అయితే... పరాజయం మొదటి మెట్టుకే పరిమితమైంది. సిద్దిపేటలోనే 1985, 1989, 1994, 1999 ఎన్నికల్లో తెదేపా నుంచి వరుస విజయాలు సాధించారు. తెలంగాణ రాష్ట్ర సాధన లక్ష్యంగా తెరాసను ప్రారంభించిన కేసీఆర్‌... ఆ పార్టీ అభ్యర్థిగా 2001 ఉప ఎన్నికలో జయకేతనం ఎగరేశారు. 2004లో సిద్దిపేట నుంచి అసెంబ్లీకి, కరీంనగర్‌ ఎంపీ స్థానం నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. కేంద్ర మంత్రి అయ్యారు. 2006, 2008 ఉప ఎన్నికల్లో కరీంనగర్‌ నుంచి గెలిచి ఎంపీగా హ్యాట్రిక్‌ సాధించారు. 2009లో మహబూబ్‌నగర్‌ నుంచి ఎంపీగా గెలిచారు. 2014, 2018 ఎన్నికల్లో గజ్వేల్‌ అసెంబ్లీ స్థానం నుంచి విజయం సాధించి రెండుసార్లు ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించారు.  


ఉత్తమ్‌కుమార్‌రెడ్డి

కోదాడ నుంచి 1994లో తొలిసారి కాంగ్రెస్‌ తరఫున పోటీ చేసిన ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెదేపా అభ్యర్థి వేనేపల్లి చందర్‌రావు చేతిలో ఓటమిపాలయ్యారు. 1999, 2004 ఎన్నికల్లో వేనేపల్లి చందర్‌రావుపైనే ఉత్తమకుమార్‌రెడ్డి వరుస విజయాలు సాధించారు. ఆ తర్వాత హుజూర్‌నగర్‌కు మారిపోయారు. 2009లో తెరాస నుంచి పోటీ చేసిన ప్రస్తుత మంత్రి జగదీశ్‌రెడ్డిపై గెలుపొందారు. 2014, 2018లో అదే స్థానం నుంచి మరో రెండుసార్లు విజయం సాధించారు. 2019లో నల్గొండ ఎంపీ స్థానంలో గెలుపొంది లోక్‌సభలో అడుగుపెట్టారు. ఉమ్మడి రాష్ట్రంలో గృహనిర్మాణ శాఖ మంత్రిగా పనిచేశారు. 2015 నుంచి 2021 వరకు ఆరేళ్లపాటు పీసీసీ అధ్యక్షునిగా పనిచేశారు.


కిషన్‌రెడ్డి

కార్యకర్త స్థాయి నుంచి భాజపాలో ప్రస్థానం ప్రారంభించిన జి.కిషన్‌రెడ్డి... ఎమ్మెల్యే, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ, కేంద్ర క్యాబినెట్‌ మంత్రి వరకు అంచెలంచెలుగా ఎదిగారు. 1999లో కార్వాన్‌ నుంచి పోటీ చేసి మజ్లిస్‌ అభ్యర్థి సయ్యద్‌ సజ్జద్‌ చేతిలో ఓటమిపాలై రెండోస్థానంలో నిలిచారు. తర్వాత హిమాయత్‌నగర్‌, అంబర్‌పేట స్థానాల నుంచి 2004, 2009, 2014లో వరుస విజయాలతో హ్యాట్రిక్‌ సాధించారు. 2018 ఎన్నికల్లో స్వల్ప ఓట్ల తేడాతో తెరాస అభ్యర్థి కాలేరు వెంకటేశ్‌ చేతిలో ఓటమిపాలైనా 2019 లోక్‌సభ ఎన్నికల్లో భారీ మెజార్టీతో ఎంపీ అయ్యారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ భాజపాకు రాష్ట్ర అధ్యక్షునిగా రెండుసార్లు పనిచేశారు. తెలంగాణ ఆవిర్భావం తర్వాత పార్టీ తొలి అధ్యక్షునిగా పనిచేసిన కిషన్‌రెడ్డి...   ఇటీవల మరోసారి రాష్ట్ర పార్టీ సారథ్యం స్వీకరించారు.


కొప్పుల ఈశ్వర్‌

1994 అసెంబ్లీ ఎన్నికల్లో మేడారం నియోజకవర్గం నుంచి తెదేపా అభ్యర్థిగా పోటీ చేసిన కొప్పుల ఈశ్వర్‌ స్వతంత్ర అభ్యర్థి మాలెం మల్లేశం చేతిలో ఓటమి పాలయ్యారు. తెరాస ఆవిర్భావ సమయంలో ఆ పార్టీలో చేరారు. 2004లో మేడారం తెరాస అభ్యర్థిగా బరిలో దిగి ఎమ్మెల్యేగా తొలిసారి విజయం సాధించారు. 2008 ఉప ఎన్నికల్లో గెలుపొందారు. నియోజకవర్గాల పునర్విభజనతో 2009 నుంచి ధర్మపురిలో పోటీ చేస్తున్నారు. 2009, 2014, 2018 సాధారణ ఎన్నికల్లో మధ్యలో 2010 ఉప ఎన్నికల్లో వరుసగా జయకేతనం ఎగరేశారు. భారాస ప్రభుత్వంలో చీఫ్‌ విప్‌గా, మంత్రిగా కొప్పుల ఈశ్వర్‌ పనిచేశారు.


జగదీశ్‌రెడ్డి

తెరాస ఆవిర్భావం నుంచి ఉన్న జగదీశ్‌రెడ్డి 2009లో తొలిసారి ఎన్నికల బరిలోకి దిగారు. సొంత నియోజకవర్గం తుంగతుర్తి ఎస్సీ రిజర్వుడు కావడంతో హుజూర్‌నగర్‌ను ఎంచుకున్నారు. అక్కడ కాంగ్రెస్‌ అభ్యర్థి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చేతిలో ఓటమిపాలయ్యారు. అనంతరం నియోజకవర్గం మారి... సూర్యాపేటకు వచ్చారు. 2014, 2018 ఎన్నికల్లో వరుసగా గెలిచి రెండుసార్లు మంత్రి పదవుల్ని పొందారు.

ఈనాడు, హైదరాబాద్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని