Telangana Elections: కారులేని మల్లారెడ్డి.. అప్పులు లేని భట్టి!

అసెంబ్లీ ఎన్నికల నామినేషన్‌ ప్రక్రియలో భాగంగా బుధవారం ప్రధాన పార్టీలకు చెందిన అభ్యర్థులు భారీ సంఖ్యలో అఫిడవిట్లు సమర్పించారు.

Updated : 09 Nov 2023 08:27 IST

ధర్మపురి అర్వింద్‌ ఆస్తి రూ.107 కోట్లు
అఫిడవిట్లలో నేతలు పేర్కొన్న వివరాలివీ...

ఈనాడు, హైదరాబాద్‌ : అసెంబ్లీ ఎన్నికల నామినేషన్‌ ప్రక్రియలో భాగంగా బుధవారం ప్రధాన పార్టీలకు చెందిన అభ్యర్థులు భారీ సంఖ్యలో అఫిడవిట్లు సమర్పించారు. భారాస ప్రస్తుత ఎమ్మెల్యేలు, మంత్రులు, కాంగ్రెస్‌ ప్రస్తుత ఎమ్మెల్యేలు, ఇతర పార్టీ సీనియర్‌ నాయకులు తమ ఆస్తులు, కేసుల వివరాలను వెల్లడించారు. మేడ్చల్‌ నియోజకవర్గం నుంచి భారత రాష్ట్ర సమితి పార్టీ అభ్యర్థిగా పోటీచేస్తున్న కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి తనకు రూ.95 కోట్లకుపైగా ఆస్తులున్నట్టు పేర్కొన్నప్పటికీ.. చేతిలో ఒక్క రూపాయి నగదు లేదని, తనకు కారు కూడా లేదని అఫిడవిట్లో పొందుపరిచారు. మంత్రి గంగుల కమలాకర్‌ పలు సంస్థల్లో వ్యాపార భాగస్వామ్యం ఉన్నట్లు పొందుపరిచారు. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ ఒవైసీ చాంద్రాయణ గుట్ట నియోజకవర్గం నుంచి నామినేషన్‌ దాఖలు చేశారు. మొత్తం 6 కేసులు, రూ.18.77 కోట్ల ఆస్తులు, రూ.5.99కోట్ల అప్పులు ఉన్నాయని పేర్కొన్నారు. మధిర కాంగ్రెస్‌ అభ్యర్థి భట్టివిక్రమార్క తన అఫిడవిట్‌లో రూ.8.12 కోట్ల ఆస్తులున్నాయని, అప్పులేవీ లేవని తెలిపారు. నాగర్‌కర్నూలు భారాస అభ్యర్థి మర్రి జనార్దన్‌రెడ్డి రూ.112.23 కోట్లు ఆస్తులున్నాయి. కోరుట్ల నుంచి భాజపా అభ్యర్థిగా పోటీచేస్తున్న ధర్మపురి అర్వింద్‌ తనపై 17 కేసులతో పాటు రూ.107.43 కోట్ల ఆస్తులున్నాయని వెల్లడించారు.

భారాస : మేడ్చల్‌ నుంచి పోటీచేస్తున్న మంత్రి మల్లారెడ్డి రూ.95.95కోట్ల ఆస్తులు వెల్లడించారు. మేడ్చల్‌ జిల్లా సూరారం, కండ్లకోయ, ధూలపల్లి, జీడిమెట్ల, గుండ్ల పోచంపల్లి, గుండ్ల పోచారం గ్రామాల్లో వ్యవసాయ భూములు.... మైసమ్మగూడ, ఫిరోజ్‌గూడ, బోయిన్‌పల్లి, కొంపల్లి, అబిడ్స్‌లో వాణిజ్య భవనాలున్నాయని అఫిడవిట్‌లో పేర్కొన్నారు. తన పేరుమీద రూ.41,40,10,776, తన భార్య కల్పనకు రూ.38,69,25,565, డిపెండెంట్‌ పేరుమీద రూ.10,14,72,400 స్థిరాస్తులున్నాయని... తమ చరాస్తుల విలువ 5,70,64,666గా పేర్కొన్నారు. వివిధ బ్యాంకుల్లో అప్పులు రూ.7.5కోట్లున్నాయని తెలిపారు.

 కరీంనగర్‌ నుంచి పోటీచేస్తున్న మంత్రి గంగుల కమలాకర్‌ రూ.34.08కోట్ల విలువైన ఆస్తులున్నట్లు ప్రకటించారు. ఇందులో దాదాపు రూ.7కోట్ల విలువైన బంగారు వజ్రాభవరణాలు ఉన్నాయి. మొత్తంగా రూ.11.53 కోట్ల చరాస్తులు మంత్రి పేర ఉండగా.. ఆయన సతీమణి పేరిట రూ.7.87 కోట్ల ఆస్తి ఉన్నట్లు అఫిడవిట్‌లో రాశారు. తన పేరు మీద స్థిరాస్తుల విలువ రూ.13.97 కోట్ల వరకు ఉన్నట్లు తెలిపారు. భార్య పేరిట స్తంభంపల్లి, గుండ[్లపల్లిలో రూ.82.70 లక్షల విలువైన 5 ఎకరాల వ్యవసాయ భూములున్నట్లు పేర్కొన్నారు. రూ.50.63 లక్షల రుణాలున్నట్లు వెల్లడించారు..

పాలేరు అభ్యర్థిగా పోటీచేస్తున్న కందాల ఉపేందర్‌రెడ్డి రూ.89.57కోట్ల విలువైన ఆస్తులు ప్రకటించారు. ఇందులో ఆయన భార్యపేరిట 82 లక్షల విలువైన షేర్లు ఉన్నట్లు పేర్కొన్నారు. మహబూబాబాద్‌ అభ్యర్థి శంకర్‌నాయక్‌ కుటుంబానికి 52.23 ఎకరాల వ్యవసాయభూమి, వాణిజ్యభవనాలు ఉన్నాయి. మొత్తం ఆస్తుల విలువ రూ.21.06 కోట్లుగా ప్రకటించారు. ఖైరతాబాద్‌ అభ్యర్థిగా దానం నాగేందర్‌కు వజ్రాల విలువ రూ.6.68కోట్లుగా ప్రకటించారు. మూడు కిలోల బంగారం, 54.17 ఎకరాల వ్యవసాయభూములు ఉన్నాయని వివరించారు. అడ్వాన్సులు, అప్పులు కలిపి రూ.49.55కోట్లు ఉందని పేర్కొన్నారు. 

కాంగ్రెస్‌ : సనత్‌నగర్‌ అభ్యర్థి కోట నీలిమకు 8.01 కిలోల బంగారు ఆభరణాలు, నాణేలు ఉన్నాయి. రాజస్థాన్‌లో 10.15 ఎకరాల వ్యవసాయభూమి, ఇల్లు ఉందని అఫిడవిట్‌లో తెలిపారు. మొత్తం ఆస్తుల విలువ రూ.54.75కోట్లుగా ప్రకటించారు. ఇందులో తనపేరిట స్థిర, చరాస్తులు కలిపి రూ.52కోట్లకు పైగా ఉన్నాయని తెలిపారు. సంగారెడ్డి అభ్యర్థి తూర్పు జయప్రకాష్‌ పేరిట 20 కేసులు ఉన్నాయి. వనపర్తి అభ్యర్థిగా పోటీచేస్తున్న తుడి మేఘారెడ్డి కుటుంబానికి దాదాపు 60 ఎకరాల వ్యవసాయ భూములు ఉన్నాయి. ఆయన తన కుటుంబం మొత్తానికి రూ.23.25కోట్ల ఆస్తులున్నట్లు ప్రకటించారు. ములుగు అభ్యర్థి సీతక్క రూ.82 లక్షల ఆస్తులతో పాటు గృహరుణం రూ.24.74 లక్షలు ఉందని పేర్కొన్నారు. ఖానాపూర్‌ అభ్యర్థి వి.బొజ్జుపై 52 కేసులు ఉన్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని