అప్పుడే ఎన్నికల ప్రలోభాలు.. కుమారుడి ఫొటోతో గడియారాలు పంచుతున్న ఎమ్మెల్యే చెవిరెడ్డి

సార్వత్రిక ఎన్నికలకు ఇంకా ఆరు నెలల సమయం ఉండగానే ప్రలోభాలు ప్రారంభమయ్యాయి. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి తన కుమారుడు, వచ్చే ఎన్నికల్లో వైకాపా అభ్యర్థి అయిన మోహిత్‌రెడ్డి చిత్రం ఉన్న గోడ గడియారాలను పంపిణీ చేస్తున్నారు.

Updated : 10 Nov 2023 19:06 IST

ఈనాడు, తిరుపతి: సార్వత్రిక ఎన్నికలకు ఇంకా ఆరు నెలల సమయం ఉండగానే ప్రలోభాలు ప్రారంభమయ్యాయి. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి తన కుమారుడు, వచ్చే ఎన్నికల్లో వైకాపా అభ్యర్థి అయిన మోహిత్‌రెడ్డి చిత్రం ఉన్న గోడ గడియారాలను పంపిణీ చేస్తున్నారు. 2019 ఎన్నికల ముందు సైతం ఇదే తరహాలో గోడ గడియారాలను పంపిణీ చేయగా వాటిపై భాస్కర్‌రెడ్డి ఫొటో ఉంది. గురువారం భాస్కర్‌రెడ్డి జన్మదినం కావడం.. గడియారాలపై ఆయన కుమారుడు మోహిత్‌రెడ్డి చిత్రం ఉండటంతో ఎన్నికల తాయిలంగానే పంపిణీ చేస్తున్నారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఈ అభియోగాలకు బలం చేకూర్చేలా.. ‘మీరు మీ కుటుంబం ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఆనందంగా ఆర్థికంగా బాగుండాలని భగవంతుని ప్రార్థిస్తూ... మీ చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి (ఎమ్మెల్యే అభ్యర్థి, వైకాపా, చంద్రగిరి) అని గడియారంపై ముద్రించడం గమనార్హం. ఇలా మొత్తం 1.15 లక్షల కుటుంబాలకు పంపిణీ చేసేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే పలు మండలాల్లో పంపిణీకి ఆయా గ్రామాల్లోని వైకాపా శ్రేణులకు చేరవేశారు. వార్డు, గ్రామ సచివాలయ సిబ్బందితోపాటు వాలంటీర్లతో వీటిని పంపిణీ చేస్తున్నారు. ఈ విషయాన్ని ఎన్నికల కమిషన్‌ దృష్టికి తీసుకెళ్తామని విపక్ష నేతలు తెలిపారు.

గడియారాలు వద్దు.. ఉద్యోగాలు కావాలి: చంద్రగిరి మండలంలోని పలు గ్రామాల్లో తెలుగుయువత కార్యకర్తలు గురువారం రాత్రి నిరసన తెలిపారు. ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ప్రజలకు పంపిణీ చేసిన గోడ గడియారాలను రోడ్లపైకి తీసుకువచ్చి ‘గోడ గడియారాలు వద్దు.. ఉద్యోగాలు కావాలి’ అంటూ నినాదాలు చేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు