ప్రజల విశ్వాసం కోల్పోయిన మోదీ

రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విభజన హామీలపై తిరుపతి వేంకటేశ్వరస్వామి సాక్షిగా ఇచ్చిన మాటను తప్పి  ప్రధాని మోదీ ప్రజల విశ్వాసం కోల్పోయారని ఏపీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు విమర్శించారు.

Updated : 27 Nov 2023 05:41 IST

ప్రత్యేక హోదా, విభజన హామీల వైఫల్యంపై కాంగ్రెస్‌ బహిరంగ లేఖ

విజయవాడ (గవర్నర్‌పేట), న్యూస్‌టుడే: రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విభజన హామీలపై తిరుపతి వేంకటేశ్వరస్వామి సాక్షిగా ఇచ్చిన మాటను తప్పి  ప్రధాని మోదీ ప్రజల విశ్వాసం కోల్పోయారని ఏపీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు విమర్శించారు. ప్రధాని తిరుపతి పర్యటన సందర్భంగా.. రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై ప్రశ్నిస్తూ ఏపీసీసీ రాసిన బహిరంగలేఖను ఆదివారం రుద్రరాజు విజయవాడలో విడుదల చేశారు. తొలుత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. భాజపా అధికారంలోకి రాగానే ప్రత్యేక హోదా, రైల్వేజోన్‌, కేంద్ర విద్యాసంస్థలు, పోలవరం ప్రాజెక్టు పూర్తి తదితర విభజన హామీలపై మాట తప్పారని గుర్తు చేశారు. ఇంత అన్యాయం చేసి.. ఏ ముఖం పెట్టుకుని రాష్ట్రానికి వస్తున్నారో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు.

యూపీఏ ప్రభుత్వం రాష్ట్రానికి రూ.5లక్షల కోట్ల ప్యాకేజీ ప్రకటించినా.. భాజపా దాన్ని అమలు చేయడంలో నిర్లక్ష్యం చేసిందన్నారు. ఇండియా కూటమి అధికారంలోకి వచ్చి, రాహుల్‌గాంధీ ప్రధానమంత్రి కాగానే రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తుందని రుద్రరాజు స్పష్టం చేశారు. తెలంగాణలో కాంగ్రెస్‌ గెలుపు లాంఛనమేనని పేర్కొన్నారు. మేడిగడ్డ రిజర్వాయర్‌లా తెలంగాణలో భారాస కూడా కుంగిపోతుందన్నారు. తెలంగాణతో పాటు 5 రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ విజయకేతనం ఎగురవేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు జంగా గౌతం, నరహరిశెట్టి నరసింహారావు, వి.గురునాథం, కొలనుకొండ శివాజీ, ధనేకుల మురళి, ఆర్‌.శ్రీరామమూర్తి, సంజీవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు