అవినీతికి సహకరిస్తారనే డిప్యుటేషన్‌పై తీసుకొస్తున్నారా?

రాష్ట్రంలోని ఐఏఎస్‌ అధికారులు మీ అవినీతికి సహకరించడం లేదనే కేంద్ర సర్వీసుల నుంచి నాన్‌ క్యాడర్‌ ఐఏఎస్‌లను డిప్యుటేషన్‌పై తీసుకొస్తున్నారా అని సీఎం జగన్‌ను తెదేపా ఎమ్మెల్సీ అశోక్‌బాబు ప్రశ్నించారు.

Updated : 28 Nov 2023 05:13 IST

వెంకటరెడ్డి, వాసుదేవరెడ్డి అరాచకాలకు అంతేలేదు
తెదేపా ఎమ్మెల్సీ అశోక్‌బాబు ధ్వజం

ఈనాడు డిజిటల్‌, అమరావతి: రాష్ట్రంలోని ఐఏఎస్‌ అధికారులు మీ అవినీతికి సహకరించడం లేదనే కేంద్ర సర్వీసుల నుంచి నాన్‌ క్యాడర్‌ ఐఏఎస్‌లను డిప్యుటేషన్‌పై తీసుకొస్తున్నారా అని సీఎం జగన్‌ను తెదేపా ఎమ్మెల్సీ అశోక్‌బాబు ప్రశ్నించారు. వైకాపా ప్రభుత్వంలో కేంద్ర సర్వీసుల నుంచి 16 మంది అధికారులు డిప్యుటేషన్‌పై వస్తే.. వారిలో పదిమంది జగన్‌ సామాజికవర్గం వారేనని తెలిపారు. గనుల శాఖ డైరెక్టర్‌ వెంకటరెడ్డి, ఏపీ బెవరేజెస్‌ కార్పొరేషన్‌ ఎండీ వాసుదేవరెడ్డి కూడా అలాగే వచ్చారని.. వారు చేస్తున్న అరాచకాలకు అంతులేకుండా పోయిందని మండిపడ్డారు. జగన్‌ అవినీతికి సహకరిస్తున్న వీరిపై కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖకు ఫిర్యాదు చేయనున్నట్లు పేర్కొన్నారు. మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయంలో సోమవారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. ‘‘వెంకటరెడ్డి ఇండియన్‌ కోస్టు సర్వీసెస్‌ అధికారి. ఆయన డిప్యుటేషన్‌పై రాష్ట్రానికి వచ్చాక జగన్‌ ప్రభుత్వం గనుల శాఖ డైరెక్టర్‌ పదవి, ఏపీ మైనింగ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఎండీ పదవి కట్టబెట్టింది. ఆయన కనుసన్నల్లో అనధికార తవ్వకాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. ఇసుక తవ్వకాలు ఎవరు చేస్తున్నారో చెప్పే పరిస్థితి లేదు. బాక్సైట్‌ను లాటరైట్‌గా చూపించి విశాఖ మన్యంతో ఇష్టారాజ్యంగా తవ్వకాలు చేస్తున్నారు’’ అని వివరించారు. వైకాపా నేతలకు సంబంధించిన డిస్టలరీలకు పెద్దఎత్తున ఆర్డర్లు ఇవ్వడమే వాసుదేవరెడ్డి పనిగా పెట్టుకున్నారని ఆరోపించారు. ఏజీ ఉండగా ఏఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డికి ఎందుకంత ప్రాధాన్యం ఇస్తున్నారని ప్రశ్నించారు.


శ్రీకిరణ్‌ తల్లిని వైకాపా గూండాలు బెదిరించడం దారుణం: అచ్చెన్నాయుడు

కాకినాడలో యువవైద్యుడు శ్రీకిరణ్‌ ఆత్మహత్యకు మాజీమంత్రి కురసాల కన్నబాబు సోదరుడు కల్యాణ్‌కృష్ణ బెదిరింపులే కారణమని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. మృతుడి తల్లిని వైకాపా గూండాలు బెదిరించడం దారుణమని సోమవారం ఓ ప్రకటనలో మండిపడ్డారు. యువవైద్యుడి ఆత్మహత్యకు జగన్‌రెడ్డిదే బాధ్యతని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘శ్రీకిరణ్‌ నుంచి భూమి కొనుగోలు చేసిన కల్యాణ్‌కృష్ణ, అనుచరుడు పెదబాబు, పీఏ బాలజీ సకాలంలో డబ్బులు చెల్లించలేదు. దస్తావేజులు తీసుకొని ఇవ్వకుండా వేధించారు. వీరి వేధింపులు తట్టుకోలేక శ్రీకిరణ్‌ ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలి. నిందితులపై కఠినచర్యలు తీసుకోవాలి’’ అని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని