యువగళం శబ్దానికి.. పాలకపక్షం పునాదులు కదులుతాయ్‌

తెదేపా యువనేత నారా లోకేశ్‌ రెండోవిడత యువగళం పాదయాత్ర శబ్దానికి పాలకపక్షం పునాదులు కదలడం ఖాయమని వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు స్పష్టంచేశారు. రచ్చబండ కార్యక్రమంలో భాగంగా ఆయన సోమవారం మీడియా ప్రతినిధులతో మాట్లాడారు.

Updated : 28 Nov 2023 05:04 IST

వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు

ఈనాడు, దిల్లీ: తెదేపా యువనేత నారా లోకేశ్‌ రెండోవిడత యువగళం పాదయాత్ర శబ్దానికి పాలకపక్షం పునాదులు కదలడం ఖాయమని వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు స్పష్టంచేశారు. రచ్చబండ కార్యక్రమంలో భాగంగా ఆయన సోమవారం మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. సీఎం జగన్‌ రూ. 450 కోట్ల ప్రజాధనంతో రుషికొండపై కట్టిన మహల్‌ను తన భార్య భారతిరెడ్డికి కానుకగా ఇస్తున్నట్లు కనిపిస్తోందని, అందుకే ఆమె జన్మదినమైన డిసెంబరు 8న ఆ ఇంట్లో పాలు పొంగించాలనుకుంటున్నట్లు తెలుస్తోందన్నారు. ‘ప్రభుత్వ పెద్దల అక్రమాలకు సహకరించిన అధికారులంతా తిరిగి మాతృ సంస్థలకు వెళ్తామంటూ బదిలీల కోసం రెండు రోజులుగా దరఖాస్తులు పెట్టుకుంటున్నట్లు తెలిసింది. ప్రభుత్వం మారిపోతుందని తెలిసి... పోలీసు అధికారుల్లో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది.

జగన్‌ కేసుల్లో నిందితురాలిగా విచారణ ఎదుర్కొన్న శ్రీలక్ష్మి ఏపీ కేడర్‌ నుంచి తెలంగాణకు, ఐపీఎస్‌ అధికారి సీతారామాంజనేయులు కేంద్ర సర్వీసులోకి వెళతానని అనుమతిని కోరుతున్నారట. గనుల శాఖ డైరెక్టర్‌ వెంకటరెడ్డి రూ.400-500 కోట్ల పెనాల్టీల్ని వేసి ప్రత్యర్థి పార్టీల నాయకుల్ని ఇబ్బంది పెట్టారు. కాంట్రాక్టు తీరిపోయిన తర్వాతా జేపీ సంస్థను ముందు పెట్టి ప్రభుత్వ పెద్దల బంధువులు ఇసుకను దోచుకున్నారు. ఇసుకను దోచుకోవడంలో వారికి తోడ్పడిన వెంకటరెడ్డి మాతృసంస్థ కోస్ట్‌ గార్డ్‌ సర్వీస్‌కు వెళ్లిపోతానని దరఖాస్తు పెట్టుకున్నారట. రాష్ట్ర బెవరేజెస్‌ కార్పొరేషన్‌ ఎండీగా వాసుదేవరెడ్డి వేల కోట్ల రూపాయల్ని దోచుకోవడానికి అన్ని విధాలుగా ప్రభుత్వ పెద్దలకు సహకరించారు. ఆయనా ఇప్పుడు బదిలీపై వెళతానంటున్నారు.

ఇలా ప్రభుత్వ శాఖల్లోని 13 మంది కీలక అధికారులు... తమ మాతృసంస్థలు, కేంద్ర సర్వీసులకు వెళ్తామంటూ దరఖాస్తులు చేసుకున్నారు. వీరంతా ఎక్కడకు వెళ్లినా శిక్ష తప్పదు. సునీల్‌కుమార్‌, ప్రస్తుత సీఐడీ చీఫ్‌ సంజయ్‌, గతంలో సీఐడీలో విధులు నిర్వహించిన సునీల్‌నాయక్‌ వంటి అధికారులపైనా చర్యలు తప్పవు’ అని  స్పష్టంచేశారు. సీఎం ఆడమన్నట్లుగా ఆడి అక్రమ కేసులు నమోదు చేసి, ప్రజల్ని వేధించిన సీఐడీ మాజీ చీఫ్‌ సునీల్‌కుమార్‌ను పదేళ్లపాటు జైల్లో పెట్టిస్తానని రఘురామ శపథం చేశారు.

‘సాక్షి’కి మరో లాభం: ఆటాడుకుందాం రా పేరిట రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న క్రీడల వల్ల క్రీడాకారులకు ఎంత మేలు జరుగుతుందో తెలియదు కానీ సాక్షి దినపత్రికకు మాత్రం ప్రకటనల రూపంలో లాభం వస్తుందని రఘురామకృష్ణరాజు అన్నారు. ఆటాడుకుందాం రా కార్యక్రమానికి ఎవరైనా ప్రముఖ క్రీడాకారుని ఫొటోను ఉపయోగించి ఉంటే బాగుండేదని, దానికీ సీఎం చిత్రాన్నే వాడటం హాస్యాస్పదమన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని