లేపాక్షి నాలెడ్జ్‌ హబ్‌ భూబకాసురులు ఎవరు?

లేపాక్షి నాలెడ్జ్‌ హబ్‌కు సంబంధించిన రూ.వేల కోట్ల విలువైన భూములు కారుచౌకగా ప్రైవేటు వ్యక్తులపరమవుతుంటేే సీఎం జగన్‌ ఎందుకు స్పందించడం లేదని తెదేపా అధికార ప్రతినిధి విజయ్‌కుమార్‌ ప్రశ్నించారు.

Updated : 29 Nov 2023 06:41 IST

తెదేపా అధికార ప్రతినిధి విజయ్‌కుమార్‌ ప్రశ్న

ఈనాడు, అమరావతి: లేపాక్షి నాలెడ్జ్‌ హబ్‌కు సంబంధించిన రూ.వేల కోట్ల విలువైన భూములు కారుచౌకగా ప్రైవేటు వ్యక్తులపరమవుతుంటేే సీఎం జగన్‌ ఎందుకు స్పందించడం లేదని తెదేపా అధికార ప్రతినిధి విజయ్‌కుమార్‌ ప్రశ్నించారు. హబ్‌ ఏర్పాటు చేస్తానంటూ ప్రభుత్వ, రైతుల భూముల్ని ఇందూ సంస్థకు కట్టబెట్టి మాజీ సీఎం వైఎస్‌ రాజశేఖరరెడ్డి రైతుల నోట్లో మట్టి కొడితే....ఇప్పుడు జగన్‌ దాన్ని ఎందుకు సరిదిద్దడం లేదన్నారు. 4,196 ఎకరాలను ఇందూ ప్రాజెక్టు సంస్థ బ్యాంకుల్లో తాకట్టు పెట్టి రూ.4,138 కోట్లు రుణం తీసుకుంటే....దానిలో రూ.477 కోట్లే చెల్లిస్తే చాలని బ్యాంకులు చెప్పడం అనుమానాలకు తావిస్తోందన్నారు. ప్రభుత్వమే ఒక స్పెషల్‌ పర్పస్‌ వెహికల్‌ పెట్టి బ్యాంకులకు సొమ్ము చెల్లించి మొత్తం భూముల్ని వెనక్కి తీసుకుని రైతులకు ఇవ్వడంగానీ, పరిశ్రమను పెట్టడంగానీ ఎందుకు చేయడం లేదని మండిపడ్డారు.

‘బ్యాంకులకు రుణాలు తీసుకున్న వారంటే భయమా? ఈ వ్యవహారం వెనకున్న భూబకాసురులు ఎవరు? బ్యాంకులు ఇచ్చిన రుణంలో 87శాతం ఒకేసారి రైటాఫ్‌ చేయడానికి ఎందుకు సిద్ధమయ్యాయి’ అని ప్రశ్నించారు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘ఇందూ సంస్థకు కేటాయించిన 8,843 ఎకరాల్లో 5,811 ఎకరాలు రైతుల భూములయితే 3,032 ఎకరాలు ప్రభుత్వ భూమి. అనంతపురం జిల్లా సరిహద్దులో ఈ భూముల్ని ఇందూ సంస్థకు వైఎస్‌ అప్పట్లో కేటాయించారు. అప్పట్లో ఎకరం రూ.లక్ష, రూ.50 వేలకు ఇందూ సంస్థకు కట్టబెగితే...ప్రస్తుతం అదే భూమి ధర రూ.కోటికంటే ఎక్కువే. ఈ భూములు తెదేపా ప్రభుత్వం ఏర్పాటు చేసిన కియా పరిశ్రమలకు సమీపంలోనే బెంగళూరు రహదారివైపు ఉన్నాయి. ఇంత విలువైన ప్రభుత్వ భూమిని ప్రైవేటు వ్యక్తులు, సంస్థలు కాజేయడానికి సిద్ధమైనా జగన్‌ పట్టించుకోకపోవడం వెనుక ఉన్న మర్మమేంటి?’ అని మండిపడ్డారు.

 కొట్టేసే ప్రయత్నం: ‘బ్యాంకుల్లో 4,196 ఎకరాలు తాకట్టుపెట్టిన తర్వాత 2013 మే-జూన్‌ మధ్యలో దిల్లీకి చెందిన గ్లోబల్‌ ఎమర్జింగ్‌ టెక్నాలజీస్‌ సంస్థ నుంచి రిజిస్ట్రేషన్‌ ఛార్జీల కింద రూ.5 కోట్లు తీసుకుని మరో 650 ఎకరాలు తాకట్టు పెట్టారు. గ్లోబల్‌ ఎమర్జింగ్‌ టెక్నాలజీస్‌ సంస్థ డైరెక్టర్‌ గుల్షన్‌కుమార్‌ తర్వాత కొద్దికాలానికే ఇందూ సంస్థలో డైరెక్టర్‌గా మారారు. దొంగలు దొంగలు ఊళ్లు పంచుకున్న చందాన ఈ విధంగా ప్రభుత్వ, రైతుల భూముల్ని రూ.500 కోట్ల పైచిలుకు మొత్తాన్ని కొట్టేయడానికి అందరూ ఒక్కటయ్యారు’ అని ధ్వజమెత్తారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని