మీ హయాంలో అభివృద్ధి ఏది?.. కావలి ఎమ్మెల్యేను నిలదీసిన వైకాపా అభిమాని

కావలి నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి చేయలేదంటూ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డిని వైకాపా అభిమాని పేముల మనోహర్‌ ప్రశ్నించిన ఘటన మంగళవారం చోటుచేసుకుంది.

Updated : 29 Nov 2023 07:57 IST

కావలి, న్యూస్‌టుడే: కావలి నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి చేయలేదంటూ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డిని వైకాపా అభిమాని పేముల మనోహర్‌ ప్రశ్నించిన ఘటన మంగళవారం చోటుచేసుకుంది. పురపాలక సంఘం పరిధిలోని 24వ వార్డు శాంతినగర్‌లో ‘గడపగడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమంలో భాగంగా ఆయన పార్టీ అభిమాని ఇంటికి వెళ్లారు. ఎమ్మెల్యే వస్తున్నారని హడావిడిగా కాలువల్లో పూడికలు తీశారని, వైకుంఠాపురం వంతెన పూర్తి చేస్తామన్నా ఇంతవరకూ కదలిక లేదని, ట్రంకు రోడ్డు పనులు అసంపూర్తిగానే ఎందుకు మిగిలాయని ఎమ్మెల్యేను ప్రశ్నించాడు. నియోజకవర్గంలో రోడ్లన్నీ అధ్వానంగా మారాయని ఆవేదన వ్యక్తం చేశాడు. ‘మీ హయంలో చేశామని చెప్పుకొనేందుకు నియోజకవర్గంలో ఒక్క పని కూడా లేదు’ అని విమర్శించారు. తమ పార్టీ అభిమాని నుంచే ప్రశ్నల వర్షం కురుస్తుండటంతో, మరో దారి లేక ఎమ్మెల్యే నవ్వుతూనే.. రాష్ట్ర ప్రభుత్వ పథకాలను వివరించారు. కార్యక్రమంలో వైకాపా పట్టణాధ్యక్షుడు కేతిరెడ్డి శివకుమార్‌రెడ్డి, పార్టీ వాణిజ్య విభాగం జిల్లా అధ్యక్షుడు కనమర్లపూడి నారాయణ, నేతలు గంధం ప్రసన్నాంజనేయులు, నాయకులు కనపర్తి రాజశేఖర్‌, అమరా వేదగిరిగుప్తా, నాగయ్య ఆచారి, అనూరాధ పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని