15 మందిలో 10 మంది వారే

ముఖ్యమంత్రి జగన్‌ నాలుగున్నరేళ్లలో రాష్ట్రానికి 15 మంది అఖిల భారత సర్వీసు అధికారులను కేంద్రం నుంచి డిప్యుటేషన్‌పై తీసుకొస్తే.. వారిలో పది మంది ఆయన సామాజికవర్గానికి చెందిన వారేనని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు వివరించారు.

Updated : 29 Nov 2023 11:24 IST

డిప్యుటేషన్‌పై వచ్చిన వారిలో సీఎం సామాజిక వర్గీయులే ఎక్కువ
ఆదాయార్జన శాఖల్లోనే వారందరి నియామకం
 తెదేపా రానుందని తెలిసి ఇప్పుడు కేంద్ర సర్వీసులకు వెళ్లేందుకు యత్నం
 తప్పు చేసిన అధికారులు ఎక్కడున్నా వదిలేది లేదు
తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడి స్పష్టీకరణ

ఈనాడు, అమరావతి: ముఖ్యమంత్రి జగన్‌ నాలుగున్నరేళ్లలో రాష్ట్రానికి 15 మంది అఖిల భారత సర్వీసు అధికారులను కేంద్రం నుంచి డిప్యుటేషన్‌పై తీసుకొస్తే.. వారిలో పది మంది ఆయన సామాజికవర్గానికి చెందిన వారేనని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు వివరించారు. ఆ పది మందినీ ఎక్కువ ఆదాయం వచ్చే శాఖల్లోనే నియమించారని పేర్కొన్నారు. ఏపీ బెవరేజెస్‌ కార్పొరేషన్‌ ఎండీగా డి.వాసుదేవరెడ్డి, గనుల శాఖ డైరెక్టర్‌గా వెంకటరెడ్డిని నియమించడమే ఇందుకు నిదర్శనమన్నారు. డిప్యుటేషన్‌పై రాష్ట్రానికి వచ్చిన అధికారులకు కీలక బాధ్యతలు అప్పగించడం పాలన నిబంధనలకు విరుద్ధమని తెలిసీ చొరవ చూపడం ముమ్మాటికీ జగన్‌ దోపిడీ కోసమేనని ఆరోపించారు. ఈ పది మంది కేంద్రంలో సేవలందించిన విభాగాలేంటి? రాష్ట్రానికి వచ్చి వారు వెలగబెడుతున్న పనులేంటి? అని మండిపడ్డారు. తెదేపా అధికారంలోకి రానుందని, తమ పరిస్థితి దారుణంగా ఉండనుందని తెలిసే డిప్యుటేషన్‌పై వచ్చినవారు వెనక్కి వెళ్లేందుకు వెంపర్లాడుతున్నారని తెలిపారు. తప్పు చేసిన అధికారులు ఎక్కడున్నా వదిలేది లేదని, తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే కమిషన్‌ వేసి వారిని చట్టబద్ధంగా శిక్షిస్తామని అన్నారు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో ఆయన మంగళవారం విలేకరులతో మాట్లాడారు.

జగన్‌రెడ్డికి బంగారు బాతుగా ఏపీ బెవరేజెస్‌ కార్పొరేషన్‌

‘తితిదే ఈవోగా జగన్‌ నియమించిన వ్యక్తి పనితీరు ఎలా ఉందో తాజాగా ప్రధాని మోదీ తిరుమల పర్యటన సాక్షిగా బయటపడింది. తనకు అత్యంత సన్నిహితుడైన వాసుదేవరెడ్డిని ఏపీ బెవరేజెస్‌ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ను చేసిన జగన్‌రెడ్డి.. మద్యం తయారీ, సరఫరా, అమ్మకాల రూపంలో వేల కోట్లు కొట్టేస్తున్నారు. పెరిగిన మద్యం ధరలు, కల్తీ మద్యం అమ్మకాలపై ప్రశ్నించారన్న అక్కసుతో దళిత యువకుడు ఓంప్రతాప్‌ను బలిగొన్నారు. రాష్ట్రంలోని 110 ఇసుక రేవుల్లో ఎలాంటి అనుమతులు లేకుండా గనులశాఖ డైరెక్టర్‌ వెంకటరెడ్డి అండతో యథేచ్ఛగా ఇసుక తవ్వుతున్నారు. ఈ దోపిడీని ప్రశ్నించిన పాపానికి దళిత యువకుడు వరప్రసాద్‌కు వైకాపా ప్రభుత్వమిచ్చిన కానుక శిరోముండనం చేయడం. ఇదేనా జగన్‌ అమలు చేస్తున్న సామాజిక న్యాయం?’ అని మండిపడ్డారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని