అయిదేళ్లలో ఉద్యోగ ఖాళీలన్నీ భర్తీ చేస్తాం

‘తెదేపా అధికారంలో ఉన్నప్పుడు ప్రైవేట్‌ సెక్టార్‌లో ఆరు లక్షల మందికి, డీఎస్సీ ద్వారా 32 వేల మందికి ఉద్యోగావకాశాలు కల్పించాం. మూడు నెలలు ఓపిక పట్టండి.. అయిదేళ్లలో ప్రభుత్వంలో ఉన్న ఖాళీలన్నీ భర్తీ చేస్తాం.

Published : 29 Nov 2023 06:08 IST

తొలి ఓటుతో భవితకు పునాదులు వేసుకోవాలి
యువతతో ముఖాముఖిలో తెదేపా ప్రధాన కార్యదర్శి లోకేశ్‌
అమలాపురం ప్రాంతంలో ‘యువగళం’ పాదయాత్ర

ఈనాడు, రాజమహేంద్రవరం: ‘తెదేపా అధికారంలో ఉన్నప్పుడు ప్రైవేట్‌ సెక్టార్‌లో ఆరు లక్షల మందికి, డీఎస్సీ ద్వారా 32 వేల మందికి ఉద్యోగావకాశాలు కల్పించాం. మూడు నెలలు ఓపిక పట్టండి.. అయిదేళ్లలో ప్రభుత్వంలో ఉన్న ఖాళీలన్నీ భర్తీ చేస్తాం. వైకాపా చర్యల వల్ల రాష్ట్రం, మనం నష్టపోయాం. ప్రస్తుత పరిస్థితి చక్కదిద్దాలన్నా, రాష్ట్ర బ్రాండ్‌ను కాపాడాలన్నా చంద్రబాబుతోనే సాధ్యం. తొలిసారి ఓటు హక్కు వినియోగించే మీరంతా ఆలోచించి మీ భవిష్యత్తుకు గ్యారంటీనిచ్చే పార్టీకి ఓటేయండి. తెదేపా-జనసేన ప్రభుత్వాన్ని గెలిపించి యువ జోష్‌ చూపించండి..’ అని తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ సూచించారు. యువగళం పాదయాత్రలో భాగంగా డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా అమలాపురం నియోజకవర్గం భట్నవిల్లిలో మంగళవారం యువతతో ఆయన ముఖాముఖి నిర్వహించారు.

తిరస్కరించడం.. తరిమేయడం

‘ఈ ప్రభుత్వం రూ.12 లక్షల కోట్ల అప్పు చేసినందున రూ.లక్ష కోట్ల వడ్డీ చెల్లించాల్సి వస్తోంది. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు అభివృద్ధి చేసి సంక్షేమం అమలు చేయడం వల్ల ప్రజలపై ఛార్జీల భారం వేయలేదు. తెదేపా హయాంలో సింగపూర్‌ సాంకేతికతతో రాజధాని మాస్టర్‌ప్లాన్‌ రూపొందిస్తే వైకాపా వచ్చాక తిరస్కరించింది. విశాఖలో మిలీనియం టవర్స్‌ను తాత్కాలిక సచివాలయంగా వాడతారట. హెచ్‌ఎస్‌బీసీ, అమరరాజా యూనిట్‌ను తరిమేశారు. వీరి వేధింపుల వల్ల లూలూ గ్రూప్‌ ఏపీలో తప్ప ఎక్కడైనా పెట్టుబడులు పెడతా       మంది. ఈ భూమి మీద నేను.. జగన్‌ శాశ్వతం కాదు. ఆంధ్ర రాష్ట్రం శాశ్వతం..’ అని లోకేశ్‌ పేర్కొన్నారు.

నిరుద్యోగులుగా మిగిలాం

ముఖాముఖిలో పలువురు యువతీ యువకులు మాట్లాడారు. ‘2014లో చంద్రబాబు సీఎం అయ్యాక రెండు డీఎస్సీలు ప్రకటించారు. వైకాపా అధికారంలోకి వస్తే 23 వేల పోస్టులతో మెగా డీఎస్సీ ప్రకటిస్తామని జగన్‌ హామీనిచ్చి వంచించారు. 1.36 లక్షల సచివాలయ ఉద్యోగాలిచ్చామని చెబుతున్నా అందులో సాధారణ డిగ్రీ చదివినవారికి అన్యాయమే జరిగింది. నవరత్నాలని గొప్పలు చెప్పే సీఎం వల్ల నిరుద్యోగ రత్నాలుగా మిగిలాం’ అని యువకుడు వెంకటేశ్‌ వాపోయారు. తెదేపా-జనసేన ప్రభుత్వంలో ఏటా డీఎస్సీని నిర్వహిస్తామని లోకేశ్‌ ఈ సందర్భంగా హామీనిచ్చారు. రెండేళ్లుగా ఫీజు రీఎంబర్స్‌మెంట్‌ రావడం లేదని విద్యార్థినులు మహాలక్ష్మి, సాయికల్యాణి చెప్పగా.. అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో ప్రస్తుత రీఎంబర్స్‌మెంట్‌ విధానాన్ని రద్దు చేసి విద్యార్థులు, తల్లిదండ్రులతో సంబంధం లేకుండా నేరుగా కళాశాలతోనే ప్రభుత్వం ఒప్పందం చేసుకునేలా చూస్తామని అన్నారు. ‘మీరు రాజకీయాల్లో ఉన్నా మీ తల్లి, మీ భార్యను ఈ ప్రభుత్వం వేధిస్తోంది. ఇక సామాన్యుల పరిస్థితేంటి?’ అని వైద్య విద్యార్థిని సమ్రి ప్రశ్నించారు. మహిళలను గౌరవించేలా నర్సరీ స్థాయి నుంచి అవగాహన చర్యలు చేపడతామని లోకేశ్‌ చెప్పారు.

యువగళం.. జనబలం

పాదయాత్ర పొడవునా వివిధ వర్గాల ప్రజలు లోకేశ్‌కు ఘన స్వాగతం పలికారు. పేరూరులో ‘యువగళం’ పాదయాత్ర ప్రారంభించిన లోకేశ్‌ ముమ్మిడివరం వరకు 18.5 కి.మీ.మేర నడిచారు. మార్గమధ్యలో ఆక్వా రైతులు, చేనేత కార్మికులు, దివ్యాంగులు, ఎస్సీ, కాపు, రెడ్డి, బీసీ సామాజికవర్గ ప్రతినిధుల సమస్యలను తెలుసుకుని పరిష్కారానికి హామీనిచ్చారు. బందోబస్తుకు వచ్చిన పలువురు పోలీసు అధికారులు, కానిస్టేబుళ్లు తమ చొక్కాలపై నేమ్‌ ప్లేట్లు లేకుండా కనిపించారు. వీరిలో కొందరు చొక్కాలకు బాడీవోర్న్‌ కెమెరాలు ధరించి లోకేశ్‌ను కలుస్తున్న, వినతిపత్రాలు ఇస్తున్నవారిని చిత్రీకరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని