రాష్ట్రంలో త్వరలో నిశ్శబ్ద యుద్ధం

‘‘సైకో జగన్‌.. ధనవంతులకు, పేదలకు యుద్ధం అంటున్నారు. రాష్ట్రంలో నిశ్శబ్ద యుద్ధం జరగబోతుంది. అది.. జగన్‌కు, పేదలకు మధ్య జరగనుంది.

Updated : 30 Nov 2023 06:08 IST

రూ.లక్ష కోట్ల ఆస్తి ఉన్న జగన్‌ పేదవారా?
సైకో పనైపోయిందనే డిప్యుటేషన్‌పై వెళ్లేందుకు అధికారుల పైరవీలు
ముమ్మిడివరం యువగళంలో లోకేశ్‌

‘‘సైకో జగన్‌.. ధనవంతులకు, పేదలకు యుద్ధం అంటున్నారు. రాష్ట్రంలో నిశ్శబ్ద యుద్ధం జరగబోతుంది. అది.. జగన్‌కు, పేదలకు మధ్య జరగనుంది. రూ.లక్ష కోట్లు ఉన్నవారు, రూ.1,000 వాటర్‌ బాటిల్‌ తాగేవారు, రూ.లక్ష విలువైన చెప్పులు వేసుకునేవారు పేదలెలా అవుతారు? ఎన్టీఆర్‌ ఇచ్చిన ఈ గొంతు నొక్కే మగాడు పుట్టలేదు. భయం మా బ్లడ్‌లో లేదు మై డియర్‌ జగన్‌.’’

తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌

ఈనాడు, రాజమహేంద్రవరం: ఉభయగోదావరి జిల్లాల్లో జనప్రభంజనం చూస్తుంటే వైకాపా ఫ్యాన్‌ మాడిపోవడం ఖాయమనిపిస్తోందని తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ పేర్కొన్నారు. డా.బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో 212వ రోజు బుధవారం యువగళం పాదయాత్ర బహిరంగసభలో లోకేశ్‌ మాట్లాడారు. ‘‘తప్పుడు కేసులతో చంద్రబాబును నిర్బంధించి జగన్‌ తప్పు చేశారు. మూడు నెలల్లో తెదేపా-జనసేన ప్రభుత్వం వస్తుంది. జగన్‌ ఆత్మలతో మాట్లాడతారు. అందులో ఓ ఆత్మ చంద్రబాబు, పవన్‌కల్యాణ్‌ కలవకూడదని చెప్పింది. దాన్ని తిప్పికొడుతూ పవన్‌ అన్న పొత్తు ప్రకటించారు. జగన్‌ పనైపోయిందని గ్రహించే అధికారులు డిప్యుటేషన్‌పై వెళ్లిపోవాలని చూస్తున్నారు. ఈ ప్రభుత్వ మద్యం రోజూ క్వార్టర్‌ తాగితే చావే శరణ్యం. తెదేపా హయాంలోని 100 పథకాలను రద్దుచేశారు. సంపూర్ణ మద్యనిషేధం, 45 ఏళ్లు నిండిన మహిళలకు పింఛను, ఇంట్లోని పిల్లలందరికీ అమ్మఒడి ఇస్తామని.. మోసం చేశారా? లేదా?’’ అని ప్రశ్నించగా.. వేలమంది అవునన్నారు. ముమ్మిడివరం ఎమ్మెల్యే పొన్నాడ సతీష్‌కుమార్‌ ఇళ్ల స్థలాలకు భూసేకరణలో, మత్స్యకారులకు ఓఎన్‌జీసీ ఇచ్చే పరిహారంలోనూ భారీగా దోచుకున్నారని ఆరోపించారు.

తెదేపా-జనసేనతో సంక్షేమం..

తెదేపా-జనసేన ప్రభుత్వం వచ్చాక బీసీలకు రక్షణ చట్టం, ముస్లింలకు ఇస్లాం బ్యాంకు తీసుకొస్తామన్నారు. 27 ఎస్సీ పథకాలను పునరుద్ధరిస్తామన్నారు. 1వ తేదీనే జీతాలు, పింఛన్లు ఇస్తామన్నారు. జగన్‌ ప్రభుత్వం పోలీసులకు టీఏ, డీఏ, సరెండర్‌ లీవ్‌లు రద్దు చేసిందని, అలవెన్సుల్లో 15% కోత విధించిందని చెప్పారు.

2,900 కి.మీ. శిలాఫలకం ఆవిష్కరణ: పాదయాత్ర బుధవారం ముమ్మిడివరం పరిధిలోని మహిళా కళాశాల వద్ద ప్రారంభమై పల్లిపాలెం, కొమానపల్లి, అన్నంపల్లి, మురమళ్లమీదుగా తాళ్లరేవు మండలం సుంకటరేవు వద్దకు చేరుకుంది. రాత్రి లోకేశ్‌ అక్కడే బసచేశారు. ఐ.పోలవరం మండలం పాత ఇంజరం వద్ద 2,900 కి.మీ. మైలురాయిని పాదయాత్ర చేరుకోవడంతో అక్కడ శిలాఫలకాన్ని లోకేశ్‌ ఆవిష్కరించారు. మాజీ మంత్రులు యనమల రామకృష్ణుడు, నిమ్మకాయల చినరాజప్ప, గొల్లపల్లి సూర్యారావు, ప్రత్తిపాటి పుల్లారావు, పరిటాల శ్రీరామ్‌, పలువురు నాయకులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని