నిరాడంబర దుస్తులు ధరించినా.. వారంతా సంపన్నులే

కొందరు రాజకీయ నాయకుల నిరాడంబర వస్త్రధారణ, వారు ధరించిన సాధారణ చేతిగడియారాలు చూసి వారిని తక్కువగా అంచనా వేయకూడదని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ పేర్కొన్నారు.

Updated : 30 Nov 2023 06:09 IST

 వారి పిల్లల్ని గమనిస్తే వాస్తవం బోధపడుతుంది
 కొందరు రాజకీయ నేతలపై రాహుల్‌ వ్యాఖ్య

కోజికోడ్‌, మలప్పురం: కొందరు రాజకీయ నాయకుల నిరాడంబర వస్త్రధారణ, వారు ధరించిన సాధారణ చేతిగడియారాలు చూసి వారిని తక్కువగా అంచనా వేయకూడదని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ పేర్కొన్నారు. కేరళలోని కోజికోడ్‌లో ఓ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో బుధవారం రాహుల్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సాధారణ జీవితం గడుపుతున్నట్లుగా కనిపించే కొందరు నాయకులను ఉద్దేశించి మాట్లాడారు. ‘‘నేను ఎంతో మంది నాయకులను కలిశాను. వారు చాలా తెలివైనవారు. ప్రస్తుత రాజకీయనాయకులు ప్రజల దృష్టిలో ఎలా ఉండాలని కోరుకుంటారో అలాగే వ్యవహరిస్తారు. కొన్నిసార్లు నన్ను కలవడానికి వచ్చినప్పుడు సాధారణ దుస్తులు, చౌకైన గడియారాలు, చిరిగిపోయిన షూస్‌ ధరించి వస్తుంటారు. అదే వారింటికి వెళ్లి చూస్తే వారికి భారీ బీఎండబ్ల్యూ కార్లు ఉంటాయి. వారి పిల్లల్ని చూస్తే ఆ నాయకుల నిజస్వరూపం తెలుస్తుంది. ప్రజల దగ్గర వారు తమ అసలు రూపాన్ని దాచగలరు కానీ.. ఇది వారి పిల్లల విషయంలో సాధ్యపడదు’’ అని రాహుల్‌ అన్నారు.

నేనొకటి చెబితే.. అనువాదకుడు మరొకటి చెప్పేవారు

తెలంగాణ శాసనసభ ఎన్నికల ప్రచారంలో తన ప్రసంగాన్ని తెలుగులోకి అనువదించిన సందర్భంగా ఎదురైన హాస్య పరిస్థితులను రాహుల్‌ వెల్లడించారు. ఓ సభలో తాను ఒకటి మాట్లాడుతుంటే అనువాదకుడు మరోటి చెప్పుకొచ్చారన్నారు. కొంతసేపటి తరువాత తాను మాట్లాడిన పదాలను లెక్కించడం ప్రారంభించానని, హిందీలో నేను నాలుగైదు మాటలు మాట్లాడితే తెలుగులో ఆరేడు మాటలుంటాయని భావించానన్నారు. అయితే అనువాదకుడు ఏకంగా 20 నుంచి 30 మాటలు చొప్పున మాట్లాడేశారని వెల్లడించారు. నేను బోరుకొట్టే విషయం మాట్లాడితే హాజరైన జనం ఉత్సాహంగా చప్పట్లు కొట్టేవారు..నేను మంచి విషయం మాట్లాడితే వారు నిశ్శబ్దంగా ఉండేవారు..ఇదంతా అనువాదకుడి మాయ అని పేర్కొన్నారు. ఆ సమయంలో నేను కోపం తెచ్చుకోలేని పరిస్థితి..దీంతో అక్కడ ఉన్నంతసేపూ చిరునవ్వులు చిందిస్తూ ఉండాల్సి వచ్చిందని వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు