జగన్‌ అండతోనే దళితులపై అకృత్యాలు

సీఎం జగన్‌ అండ చూసుకొని, ఆయన మెప్పు కోసమే వైకాపా నేతలు దళితులపై దాడులకు తెగబడుతున్నారని తెదేపా నేత నక్కా ఆనంద్‌బాబు మండిపడ్డారు.

Updated : 30 Nov 2023 04:43 IST

మాజీ మంత్రి నక్కా ఆనంద్‌బాబు ధ్వజం

పట్టాభిపురం(గుంటూరు), న్యూస్‌టుడే: సీఎం జగన్‌ అండ చూసుకొని, ఆయన మెప్పు కోసమే వైకాపా నేతలు దళితులపై దాడులకు తెగబడుతున్నారని తెదేపా నేత నక్కా ఆనంద్‌బాబు మండిపడ్డారు. గుంటూరులోని తెదేపా జిల్లా కార్యాలయంలో రాష్ట్ర ఎస్సీ విభాగం ఆధ్వర్యంలో బుధవారం ‘దళిత శంఖారావం’ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి మాట్లాడుతూ.. జగన్‌ హయాంలో దళితులపై జరుగుతున్న దాడులు, హత్యలు, అత్యాచారాలకు నిరసనగా శంఖారావం పూరిస్తున్నామన్నారు. అణగారిన వర్గాల ప్రజలపై కేసులు పెట్టి వేధించడాన్ని ఈ దుర్మార్గపు ప్రభుత్వంలోనే చూస్తున్నామని దుయ్యబట్టారు. ‘దళితుల పంతం.. వైకాపా అంతం’ కావాలని ఆయన పిలుపునిచ్చారు. తెదేపా ఎస్సీ సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు ఎం.ఎస్‌.రాజు మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఇప్పటికే 37 మంది దళిత మహిళలు, బాలికలు, యువతులపై అఘాయిత్యాలు జరిగాయన్నారు. దళితుడిని హత్య చేసి డోర్‌ డెలివరీ చేసిన ఎమ్మెల్సీపై పూల వర్షం కురిపించడం, జగన్‌ తన పక్కనే తిప్పుకోవడం దారుణమన్నారు. మాజీ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్‌కుమార్‌ మాట్లాడుతూ.. దళితుల ఓట్లతోనే గద్దెనెక్కిన జగన్‌, ఇప్పుడు వారినే అణగదొక్కాలని చూడటం సరికాదని ధ్వజమెత్తారు. కార్యక్రమంలో జనసేన జిల్లా అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు, తెదేపా గుంటూరు తూర్పు, పశ్చిమ ఇన్‌ఛార్జులు మహమ్మద్‌ నసీర్‌, కోవెలమూడి రవీంద్ర, పార్టీ నగర అధ్యక్షుడు డేగల ప్రభాకర్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని