అది జగన్‌ను ఆటాడేసుకునే కార్యక్రమంగా మారింది

ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం కాస్తా సీఎం జగన్‌ను సామాజిక మాధ్యమాల్లో ఆటాడేసుకునే కార్యక్రమంగా మారిందని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు ఎద్దేవా చేశారు.

Updated : 30 Nov 2023 05:16 IST

‘ఆడుదాం ఆంధ్ర’ పై ఎంపీ రఘురామ

ఈనాడు, దిల్లీ: ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం కాస్తా సీఎం జగన్‌ను సామాజిక మాధ్యమాల్లో ఆటాడేసుకునే కార్యక్రమంగా మారిందని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు ఎద్దేవా చేశారు. ఆడుదాం కార్యక్రమాన్ని చేపడుతున్న జగన్‌ను నెటిజన్లు ట్రోల్‌ చేయడం చూసి తనకు బాధనిపించిందన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఫుట్‌బాల్‌, క్రికెట్‌ బాల్‌, షటిల్‌ కాక్‌, కబడ్డీ కూతల రూపంలో తమ అధ్యక్షుడిని ఆడేసుకుంటారేమోనని తెలిసి ఆవేదన కలుగుతోందన్నారు. జనన మరణ ధ్రువపత్రాలు, ఆస్తిపన్ను పత్రాలపై జగన్‌ ఫొటోలను ముద్రిస్తున్నారని చెప్పారు. విద్యార్థులకు అందించే కళ్లజోళ్ల బాక్సుపైనా ఆ ఫొటోలు చూస్తే.. బొమ్మల పిచ్చి పీక్స్‌కు వెళ్లిపోయినట్లు స్పష్టం అవుతోందన్నారు.

వైకాపాకు అభ్యర్థులు దొరకట్లేదు

రాష్ట్రంలో ఎక్కడా వైకాపాకు అభ్యర్థులు దొరకని పరిస్థితి నెలకొందని రఘురామకృష్ణరాజు తెలిపారు. నరసాపురంలో తనపై పోటీపెట్టడానికి, తమ కుటుంబంలోనే చిచ్చు పెట్టాలన్న జగన్‌ ప్రయత్నం ఫలించలేదన్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో నువ్వా నేనా అన్నట్టు పోటీ నెలకొందని అభిప్రాయపడ్డారు. సుప్రీంకోర్టు ఇచ్చిన షాక్‌ నుంచి ఇంకా తమ పార్టీ నేతలు కోలుకున్నట్లు లేదని, చంద్రబాబు త్వరలోనే జనంలోకి వస్తారని తెలిపారు. చంద్రబాబుకు లభించే ప్రజాస్పందనకు వక్రభాష్యాలు చెప్పడానికి ఇప్పటినుంచే వైకాపా పెద్దలు ప్రయత్నాలు ప్రారంభించారని  రఘురామ కృష్ణరాజు ఎద్దేవాచేశారు. రాష్ట్రంలో సామాజిక సాధికార యాత్ర ద్వారా బడుగు బలహీన దళిత వర్గాల వారిని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారని గుర్తుచేశారు. మరోవైపు సొంత వర్గానికి చెందిన అధికారులకు ఎలా పెద్దపీట వేశారో డిప్యుటేషన్‌పై వచ్చిన 12 మంది అధికారులే ఉదాహరణ అని తెలిపారు. ఒకే సామాజికవర్గ అధికారులకు పెద్దపీట వేయడమే సామాజిక న్యాయమా అని ప్రశ్నించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని