మోదీ ఎక్కడుంటే అక్కడ అశుభం

ప్రధాని మోదీ ఎక్కడుంటే అక్కడ అశుభమేనని, పవిత్ర కార్యాలకు ఆయన్ను భాజపా దూరం ఉంచాలంటూ జేడీయూ సీనియర్‌ నేత, బిహార్‌ మంత్రి శ్రవణ్‌కుమార్‌ బుధవారం వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

Published : 30 Nov 2023 05:21 IST

 బిహార్‌ మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు  

పట్నా: ప్రధాని మోదీ ఎక్కడుంటే అక్కడ అశుభమేనని, పవిత్ర కార్యాలకు ఆయన్ను భాజపా దూరం ఉంచాలంటూ జేడీయూ సీనియర్‌ నేత, బిహార్‌ మంత్రి శ్రవణ్‌కుమార్‌ బుధవారం వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఉత్తర్‌కాశీ సొరంగంలో చిక్కుకున్న బిహార్‌ కూలీలకు సాయం చేసే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందంటూ కొందరు భాజపా నేతలు చేసిన వ్యాఖ్యలను పట్నాలో విలేకరులు మంత్రి వద్ద ప్రస్తావించగా.. ఆయన ఇలా స్పందించారు. బిహార్‌ ప్రజలు ప్రపంచవ్యాప్తంగా ఎక్కడున్నా, వారికి సాయం చేసేందుకు తమ ప్రభుత్వం ముందుంటుందన్నారు. మంచి జరిగితే తమ ఘనతేనని చెప్పుకొంటూ, చెడును మాత్రం ప్రతిపక్షాలపైకి నెట్టేయడం భాజపా నేతలకు అలవాటేనని ఆయన వ్యాఖ్యానించారు. ఇటీవల క్రికెట్‌ ప్రపంచకప్‌ ఫైనల్‌ మ్యాచే అందుకు నిదర్శనమన్నారు. అందులో ఒకవేళ భారత్‌ గెలిచి ఉంటే అది మోదీ స్టేడియంలో ఉండటం వల్లేనని భాజపా నేతలు గొప్పలు చెప్పేవారని శ్రవణ్‌ ఎద్దేవా చేశారు. మంత్రి వ్యాఖ్యలను భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సామ్రాట్‌ చౌధురి ఖండిస్తూ.. మోదీ ‘ఇండియా’ కూటమికి అశుభమని, రాబోయే ఎన్నికల్లో అది నిరూపితం కానుందన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని