‘విశాఖ ఉత్తరం’ అవకతవకలపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు

దొంగ ఓట్లతోనే ఎన్నికల్లో 175కి 175 సీట్లు గెలుస్తామనే ధీమాతో సీఎం జగన్‌ ఉన్నారని భాజపా ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు విమర్శించారు.

Published : 01 Dec 2023 05:17 IST

భాజపా ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు

విశాఖపట్నం (గురుద్వారా), న్యూస్‌టుడే: దొంగ ఓట్లతోనే ఎన్నికల్లో 175కి 175 సీట్లు గెలుస్తామనే ధీమాతో సీఎం జగన్‌ ఉన్నారని భాజపా ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు విమర్శించారు. గురువారం విశాఖ నగరం సీతమ్మధారలోని భాజపా కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. విశాఖ ఉత్తర నియోజకవర్గానికి సంబంధించి ప్రభుత్వం తయారుచేసిన ముసాయిదా ఓటర్ల జాబితాల్లో అవకతవకల్ని జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోకపోవడాన్ని కుట్రగా భావిస్తున్నామని ఆరోపించారు. దీనిపై రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సమాధానం చెప్పాల్సి ఉందన్నారు. ఓటరు ముసాయిదా ప్రకారం ఉత్తరంలో సుమారు 40వేల వరకు బోగస్‌ ఓట్లు ఉన్నాయని తెలిపారు. 3616 మంది మృతుల ఓట్లు ఉన్నట్లు చెబితే అధికారులు ఆ సంఖ్య 1326 మాత్రమే అని చెప్పారని పేర్కొన్నారు. దీనిపై స్థానికంగా ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని.. దీనిపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని తెలిపారు. నిర్లక్ష్యం వహించిన ఉద్యోగులపై వేటు తప్పదనే విషయాన్ని గ్రహించాలన్నారు. తమ దగ్గర ఉన్న మృతులు, వలసదారుల జాబితా తీసుకొని మీడియా సమక్షంలో క్షేత్రస్థాయిలో పరిశీలనకు వెళ్లడానికి నిశ్చయించుకున్నామన్నారు. సుమారు 39,977 ఓట్లను దొంగ ఓట్లుగా గుర్తిస్తే ప్రభుత్వ అధికారులు అందులో 6,228 ఓట్లు చెల్లనివని చెప్పారని భాజపా రాష్ట్ర ఉపాధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు అన్నారు. 1,429 ఇళ్లల్లో ఒక్కొక్క ఇంట్లో 15 మంది ఓటర్లు ఉన్నారని, అవన్నీ అపార్టుమెంట్లు కాదని తెలిపారు. సమావేశంలో భాజపా నగర అధ్యక్షుడు మేడపాటి రవీంద్రరెడ్డి పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు