Purandeswari: ఓట్ల కోసమే ‘నాగార్జునసాగర్‌’ వివాదం: పురందేశ్వరి

ఎన్నికలు జరుగుతున్న సమయంలో తెలుగు రాష్ట్రాల సరిహద్దులోని నాగార్జునసాగర్‌ వద్ద నీటి విడుదల అంశాన్ని వివాదాస్పదం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు భాజపా రాష్ట్ర శాఖ అధ్యక్షురాలు పురందేశ్వరి పేర్కొన్నారు.

Updated : 01 Dec 2023 10:16 IST

ఈనాడు, అమరావతి: ఎన్నికలు జరుగుతున్న సమయంలో తెలుగు రాష్ట్రాల సరిహద్దులోని నాగార్జునసాగర్‌ వద్ద నీటి విడుదల అంశాన్ని వివాదాస్పదం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు భాజపా రాష్ట్ర శాఖ అధ్యక్షురాలు పురందేశ్వరి పేర్కొన్నారు. ఇన్నాళ్లూ నీటి విడుదల విషయం ప్రభుత్వానికి ఎందుకు గుర్తుకురాలేదని ప్రశ్నించారు. కేవలం ఓట్ల కోసం వివాదం చేసినట్లుగా కనిపిస్తోందన్నారు. విజయవాడలోని భాజపా రాష్ట్ర కార్యాలయంలో గురువారం ‘వికసిత్‌ భారత్‌ సంకల్ప యాత్ర’ రథం ప్రారంభ సందర్భంగా పురందేశ్వరి విలేకర్లతో మాట్లాడారు. ‘రాష్ట్ర ప్రభుత్వం సకాలంలో బిల్లులు చెల్లించనందువల్లే... ప్రైవేటు ఆసుపత్రులు ఆరోగ్యశ్రీ కింద చికిత్సలను అందించలేకపోతున్నాయి. రాష్ట్రంలో 400 మండలాల్లో కరవు తాండవం చేస్తోంది. అయినా 100 మండలాలనే కరవు ప్రాంతాలుగా ప్రకటించారు. కరవుపై అధికారులు ముందస్తు సమాచారమిచ్చినా.. తగిన చర్యలు తీసుకోకపోవడం రైతులను వంచించడమే. మంత్రివర్గ సమావేశంలో ఇంతవరకూ కరవుపై చర్చ జరగలేదు. భాజపా అధికారంలో లేని రాష్ట్రాల్లో కేంద్ర పథకాలకు రాష్ట్ర ప్రభుత్వాలు స్టిక్కర్లు అంటిస్తున్నాయి. దీన్ని అడ్డుకునేందుకు వికసిత్‌ భారత్‌ సంకల్ప యాత్ర ద్వారా ప్రజలకు కేంద్ర పథకాలపై అవగాహన కల్పిస్తాం’ అని పేర్కొన్నారు. సీఎం జగన్‌ స్క్రిప్ట్‌ మేరకు తెలంగాణలో పోలింగ్‌ సందర్భంగా ఆ రాష్ట్ర సీఎం కేసీఆర్‌ ఓటర్లను రెచ్చగొట్టి లబ్ధి పొందేందుకు నాగార్జునసాగర్‌ వద్ద డ్రామాకు తెరలేపారని భాజపా ముఖ్య అధికార ప్రతినిధి లంకా దినకర్‌ ఓ ప్రకటనలో ఆరోపించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని