Nara Lokesh: వంద రోజుల్లో.. బీసీలకు ప్రత్యేక రక్షణ చట్టం

తెదేపా-జనసేన కూటమి అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో బీసీలకు ప్రత్యేక రక్షణ చట్టం తెస్తామని, ఈ అంశంపై పవన్‌ కల్యాణ్‌ అన్నతో తొలి సమావేశంలోనే చర్చించామని తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ చెప్పారు.

Updated : 01 Dec 2023 06:35 IST

గీత కార్మికులకు 50 ఏళ్లకే పింఛను
రాబోయేది మన ప్రభుత్వమే
తెదేపా ప్రధాన కార్యదర్శి లోకేశ్‌

 ఈనాడు, రాజమహేంద్రవరం: తెదేపా-జనసేన కూటమి అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో బీసీలకు ప్రత్యేక రక్షణ చట్టం తెస్తామని, ఈ అంశంపై పవన్‌ కల్యాణ్‌ అన్నతో తొలి సమావేశంలోనే చర్చించామని తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ చెప్పారు. యువగళం పాదయాత్రలో భాగంగా కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం కోరంగిలో శెట్టిబలిజలతో గురువారం ఆయన సమావేశమయ్యారు. దింపు, ఒలుపు కార్మికులకు రూ.5 లక్షల బీమా సౌకర్యాన్ని కల్పిస్తామని, కులవృత్తుల్ని ప్రోత్సహించేందుకు ఆదరణ పథకంలో భాగంగా ఏటా పరికరాల్ని అందిస్తామని చెప్పారు. ‘సీఎం జగన్‌ సభలు పెట్టి బటన్లు నొక్కాను అంటారు. ఇంటికెళ్లి చూస్తే ఖాతాల్లో డబ్బులు పడవు. ఆయన రూ.12 లక్షల కోట్లు అప్పులు చేసి బటన్లు నొక్కారు. ఈ బటన్‌ సీఎం పనైపోయింది’ అని లోకేశ్‌ ఎద్దేవా చేశారు. వైకాపా ప్రభుత్వంలో ఒలుపు కార్మికులకు న్యాయం జరగలేదని రెడ్డి శ్రీను అనే వ్యక్తి ఆవేదన వ్యక్తం చేశారు. కొబ్బరి రైతులు, ఒలుపు, దింపు కార్మికులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి వారికి మేలుచేసే నిర్ణయాల్ని తీసుకుంటామని లోకేశ్‌ హామీ ఇచ్చారు.

చెట్టు మీద నుంచి పడి నడుం దెబ్బతిన్నదని, తహసీల్దారు దగ్గరకు వెళితే.. చనిపోతే రూ.50 వేలు ఇస్తామని, దెబ్బతగిలితే ఏమీ ఉండదని చెప్పినట్లు ఓ కల్లుగీత కార్మికుడు వాపోయారు. లోకేశ్‌ స్పందిస్తూ.. మీలాంటి బాధితులకు మన ప్రభుత్వం వచ్చిన వెంటనే రూ.5 లక్షల బీమా సదుపాయం కల్పిస్తామన్నారు. గీత కార్మికులకు 50 ఏళ్లకే పింఛను ఇస్తామని చెప్పారు. మద్యనిషేధం అమలు చేస్తే కల్లుగీత కార్మికులకు మేలు జరుగుతుందని ఒకరు ప్రస్తావించగా... ‘జగన్‌లా నోటికొచ్చినట్లు ఊరికో హామీ ఇస్తే పరదాలు కట్టుకుని తిరిగే పరిస్థితి నాకూ వస్తుంది. చేయగలిగింది చేస్తానని చెబుతా. మద్యనిషేధాన్ని ఆనాడు అన్న ఎన్టీఆర్‌ అమలు చేశారు. అది ఎక్కువ రోజులు నిలబడలేదు. మీరు అన్నట్లు కల్లుగీత కార్మికులకు ఇబ్బందులు, వేధింపులు లేకుండా చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంది’ అని లోకేశ్‌ చెప్పారు.

ఏటా నియామకాల్ని చేపడతాం

నోటిఫికేషన్లు రాక శెట్టిబలిజ యువత నిరుద్యోగులుగా మిగిలారని రామచంద్రపురం విశ్రాంత ప్రిన్సిపల్‌ సత్యనారాయణ ప్రస్తావించగా.. మన ప్రభుత్వం వచ్చాక ఏటా జాబ్‌ క్యాలెండర్‌ ఇచ్చి, నియామకాలు చేపడతామని లోకేశ్‌ భరోసా ఇచ్చారు. నీరా కేఫ్‌ల ఏర్పాటు, మద్యం దుకాణాల్లో 20 శాతం రిజర్వేషన్‌ కల్పించి యువతకు ఉపాధి కల్పిస్తామన్నారు. ఈ ప్రభుత్వం రాష్ట్రంలో 26 వేల మంది బీసీలపై కేసులు నమోదు చేసిందన్నారు. కార్యక్రమంలో రెడ్డి సుబ్రహ్మణ్యం, దాట్ల బుచ్చిబాబు, పితాని బాలకృష్ణ, గుత్తుల సాయి, పిల్లి సత్యనారాయణమూర్తి తదితరులు పాల్గొన్నారు. కాకినాడ జిల్లాలోకి ప్రవేశించిన పాదయాత్ర గురువారం 213వ రోజు 21.1 కిలోమీటర్లు సాగింది. విద్యార్థులు పెద్దసంఖ్యలో విచ్చేసి లోకేశ్‌కు మద్దతు పలికారు. ముమ్మిడివరం నియోజకవర్గం తాళ్లరేవు మండలం సుంకరపాలెం వద్ద ప్రారంభమైన యాత్ర సాయంత్రానికి చొల్లంగిపేటకు చేరుకుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని