రాష్ట్రంలో జగన్‌ పీనల్‌ కోడ్‌

రాష్ట్రంలో ఇండియన్‌ పీనల్‌ కోడ్‌ (ఐపీసీ) స్థానంలో జగన్‌ పీనల్‌ కోడ్‌ అమలవుతోందని తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు.

Published : 02 Dec 2023 03:37 IST

ఎన్నికల్లో లబ్ధి పొందడానికే అక్రమ కేసులు
కరవుపై ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఎండగట్టాలి
పార్లమెంటరీ పార్టీ సమావేశంలో చంద్రబాబు దిశానిర్దేశం

ఈనాడు డిజిటల్‌, అమరావతి: రాష్ట్రంలో ఇండియన్‌ పీనల్‌ కోడ్‌ (ఐపీసీ) స్థానంలో జగన్‌ పీనల్‌ కోడ్‌ అమలవుతోందని తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. ఎన్నికల్లో లబ్ధి పొందడానికే ప్రతిపక్షాలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని, ఓటర్ల జాబితా రూపకల్పనలో అక్రమాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. కరవు విలయతాండవం చేస్తున్నా... రైతుల్ని ఆదుకోవడం, నష్టనివారణ చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని మండిపడ్డారు. 29 మంది ఎంపీలున్నా ప్రత్యేకహోదా సాధన, విభజన హామీల అమలు, విశాఖ కేంద్రంగా కొత్త రైల్వేజోన్‌ ఏర్పాటులో జగన్‌ వైఫల్యాల్ని పార్లమెంటు వేదికగా ఎండగట్టాలని తెదేపా ఎంపీలకు సూచించారు. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో ఆయన అధ్యక్షతన తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ సమావేశాన్ని శుక్రవారం నిర్వహించారు. డిసెంబరు నాలుగో తేదీ నుంచి పార్లమెంటు శీతాకాల సమావేశాలు జరగనున్న నేపథ్యంలో ఉభయసభల్లో లేవనెత్తాల్సిన అంశాలపై చర్చించారు. రాష్ట్రంలో ప్రతిపక్షాలపై అక్రమ కేసులు, పెరుగుతున్న పేదరికం, నిరుద్యోగ సమస్య, మహిళలపై దారుణాలు, తీవ్రమైన కరవు, విభజన హామీల సాధనలో అలసత్వం, ధరల పెరుగుదల, ఛార్జీల బాదుడు, మితిమీరిన అప్పులు, విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ తదితర అంశాలు ప్రధానంగా చర్చకొచ్చాయి. తెదేపా హయాంలో హైదరాబాద్‌లో జరిగిన అభివృద్ధి, ఐటీ సంస్కరణల్ని ప్రజలు గుర్తుపెట్టుకొన్నారని.. అందుకే తన అరెస్టుకు నిరసనగా వివిధ దేశాల్లో,  బెంగళూరు తదితర నగరాల్లో ఆందోళనలు చేశారని చంద్రబాబు పేర్కొన్నారు. తెలంగాణ ఎన్నికల సరళిపైనా సమావేశంలో చర్చకొచ్చింది.

తమిళనాడు కంటే రెండింతల ఇసుక దోపిడీ : ‘తమిళనాడులో ఇసుక అక్రమాలపై ఈడీ దర్యాప్తు చేస్తోంది... కానీ ఏపీలో దానికి రెండింతల ఇసుక దోపిడీ జరుగుతోంది. దీన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలి’ అని తెదేపా నేతలు నిర్ణయించారు. కృష్ణా జలాల విడుదలలో ఎలాంటి వివాదాలు లేకపోయినా నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు వద్ద అనవసరంగా ఉద్రిక్త పరిస్థితులు సృష్టించారని ఆరోపించారు. చట్టవిరుద్ధంగా ప్రవర్తిస్తున్న కొందరు ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారుల వ్యవహారం సమావేశంలో చర్చకొచ్చింది. రాజకీయ కక్ష సాధింపులపై ఉన్న శ్రద్ధ... నిధుల సద్వినియోగంపై లేదని, రాష్ట్రప్రభుత్వం తన వాటా నిధుల్ని విడుదల చేయకపోవడంతో చాలా కేంద్ర పథకాలు అమలు కావట్లేదని నేతలు ఆరోపించారు. వీటిపై కేంద్రానికి ఫిర్యాదు చేయాలని నిర్ణయించారు. సమావేశంలో తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, శాసనసభాపక్ష ఉపనేత నిమ్మల రామానాయుడు, ఎంపీలు రామ్మోహన్‌నాయుడు, కేశినేని నాని, కనకమేడల రవీంద్రకుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని