Rahul Gandhi: వచ్చే పదేళ్లలో 50% మహిళా సీఎంలే ఉండేలా పనిచేద్దాం: రాహుల్‌

కాంగ్రెస్‌ సంస్థాగత పదవుల్లో మహిళల పాత్రను గణనీయంగా పెంచేందుకు క్రియాశీలంగా పనిచేయాలని పార్టీ శ్రేణులకు కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ పిలుపునిచ్చారు.

Updated : 02 Dec 2023 07:16 IST

కాంగ్రెస్‌ శ్రేణులకు దిశానిర్దేశం

కొచ్చిన్‌: కాంగ్రెస్‌ సంస్థాగత పదవుల్లో మహిళల పాత్రను గణనీయంగా పెంచేందుకు క్రియాశీలంగా పనిచేయాలని పార్టీ శ్రేణులకు కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ పిలుపునిచ్చారు. వచ్చే పదేళ్లలో 50 శాతం మంది మహిళా ముఖ్యమంత్రులే ఉండేలా లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలని సూచించారు. కొచ్చిన్‌లో ‘ఉత్సాహ్‌’ మహిళా కమిషన్‌ ప్రారంభంలో శుక్రవారం ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాహుల్‌ మట్లాడుతూ.. ‘‘ప్రస్తుతం మనకు ఒక్క మహిళా ముఖ్యమంత్రి కూడా లేరు. కానీ పార్టీలో గొప్ప ముఖ్యమంత్రి కాగలిగే లక్షణాలున్న మహిళానేతలు చాలామంది ఉన్నారు’ అని అన్నారు. దేశ రాజధానిలో అధికారంలో ఉండే నేతలంతా కెమెరాలు, స్పీకర్లను తమ వైపు తిప్పుకోవాలని చూస్తున్నారని, తాను మాత్రం వాటిని ప్రజల వైపునకు చేరుస్తున్నానని వ్యాఖ్యానించారు. కేరళలో కాంగ్రెస్‌ పార్టీ అందిస్తున్న తొలి ప్రియదర్శిని సాహిత్య అవార్డును ప్రముఖ రచయిత టి.పద్మనాభన్‌కు అందజేశారు. ఈ సభలో ప్రసంగించిన రాహుల్‌ రాజకీయ నాయకులు తమాషా వ్యక్తులని.. స్పీకర్లు కూడా వారిని ఎదుర్కోవలసి వస్తోందని వ్యంగస్త్రాలను సంధించారు. పద్మనాభన్‌ లాంటి రచయితలకు, రాజకీయ నాయకులకు వ్యత్యాసం ఉందన్న ఆయన, ప్రతి ఒక్కనేత రచయితలా నిజాలను నిర్భయంగా బయటకు చెప్పటం నేర్చుకోవాలని అన్నారు.

రాహుల్‌ విమాన ల్యాండింగ్‌కు అనుమతి నిరాకరణ

రాహుల్‌ గాంధీ విమానాన్ని ల్యాండింగ్‌ చేసేందుకు కొచ్చిన్‌లోని నౌకదళ విమానాశ్రయం నిరాకరించింది. దీంతో కాంగ్రెస్‌ నాయకులు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. మొదట ల్యాండింగ్‌కు అనుమతించిన రక్షణశాఖ తర్వాత నిరాకరించిందని ఎర్నాకుళం డీసీసీ అధ్యక్షుడు మహ్మద్‌ షియాస్‌ ఆరోపించారు. రాహుల్‌ విమానాన్ని కన్నూర్‌ నుంచి కొచ్చిన్‌ అంతర్జాతీయ విమానాశ్రయానికి మళ్లించినట్లు ఆయన తెలిపారు. ఆరోపణలపై స్పందించిన రక్షణశాఖ ప్రతినిధి.. రాహుల్‌ విమాన ల్యాండింగును నిరాకరించలేదు, అలాగని అనుమతించనూ లేదని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని