కోడికత్తిలా నాగార్జునసాగర్‌ డ్రామా

ఎప్పుడూ లేని కరవు రాష్ట్రాన్ని వెంటాడుతోందని,  రైతులు తీవ్రంగా నష్టపోతుంటే ముఖ్యమంత్రి జగన్‌ తాడేపల్లి ప్యాలెస్‌లో హాయిగా ఉన్నారని తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ విమర్శించారు.

Published : 02 Dec 2023 03:40 IST

చంద్రబాబుకు ప్రజలపై నమ్మకం.. జగన్‌కు దొంగ ఓట్లపై నమ్మకం
దోపిడీలో ద్వారంపూడి.. కుంభకోణాల్లో కన్నబాబు
కాకినాడ బహిరంగ సభలో లోకేశ్‌ ధ్వజం

ఈనాడు, కాకినాడ, రాజమహేంద్రవరం, సర్పవరం జంక్షన్‌: ఎప్పుడూ లేని కరవు రాష్ట్రాన్ని వెంటాడుతోందని,  రైతులు తీవ్రంగా నష్టపోతుంటే ముఖ్యమంత్రి జగన్‌ తాడేపల్లి ప్యాలెస్‌లో హాయిగా ఉన్నారని తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ విమర్శించారు. యువగళం పాదయాత్రలో భాగంగా శుక్రవారం కాకినాడ గ్రామీణ నియోజకవర్గం సర్పవరం కూడలిలో సభలో ఆయన మాట్లాడారు. ‘రైతుల సమస్యలపై ఒక్క సమావేశం పెట్టలేదు. తెలంగాణ ఎన్నికలనగానే ముందురోజు రాత్రి మన పోలీసులను ఆ రాష్ట్రానికి పంపించారు. తెలంగాణ పోలీసులతో కేసులు పెట్టించారు. ఇది కూడా కోడికత్తిలా నాటకం. ప్రజలంతా గుర్తుపెట్టుకోవాలి’ అని లోకేశ్‌ సూచించారు. చంద్రబాబుకు ప్రజలపై నమ్మకమని, జగన్‌కు దొంగ ఓట్లపై నమ్మకమని పేర్కొన్నారు. ‘కాకినాడ సిటీని అభివృద్ధి చేస్తారని ఎమ్మెల్యేగా చంద్రశేఖర్‌రెడ్డిని గెలిపించారు. సిటీని డ్రగ్స్‌, అవినీతి, భూకబ్జాలు, సెటిల్మెంట్లు, ఇసుక, మట్టి, మద్యం అక్రమ రవాణా, పేకాట క్లబ్బులకు చిరునామాగా మార్చేశారు. పెన్షనర్ల ప్యారడైజ్‌ను గంజాయి ప్యారడైజ్‌గా మార్చేశారు. అందుకే చంద్రశేఖర్‌రెడ్డికి కొత్తపేరు పెట్టా. అదే దోపిడీ శేఖర్‌. కార్పొరేషన్‌, స్మార్ట్‌సిటీ నిధులు కాజేశారు. ఇళ్ల స్థలాల పేరుతో అక్రమాలు, టీడీఆర్‌ బాండ్ల ద్వారా రూ.130 కోట్ల అవినీతి.. విదేశాలకు బియ్యం రవాణాతో లూటీలు చేస్తున్నారు. జగన్‌కు బినామీ ఈ దోపిడీ శేఖర్‌. బీకేర్‌ఫుల్‌ బ్రదర్‌. మా ప్రభుత్వం వస్తుంది. మొత్తం కక్కిస్తాం’ అని లోకేశ్‌ హెచ్చరించారు.

కరెప్షన్‌ కన్న..

‘కాకినాడ గ్రామీణ నియోజకవర్గంలో అభివృద్ధి నిల్‌.. అవినీతి ఫుల్‌. అందుకే అక్కడి ఎమ్మెల్యే కన్నబాబు పేరును కరప్షన్‌ కన్నా అని పెట్టా. నియోజకవర్గంలో ఒక్కో బంధువుకు ఒక్కో ప్రాంతం అప్పగించారు. ఏ పని జరగాలన్నా ఆ కుటుంబానికి కప్పం కట్టాల్సిందే. తక్కువ ధరకు భూమి కొని ఎక్కువ ధరకు ప్రభుత్వానికి అమ్మేశారు. రియల్‌ఎస్టేట్‌ వ్యాపారులనూ వేధిస్తున్నారు. ఆయన తమ్ముడి వేధింపుల వల్ల కిరణ్‌ అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నారు..’ అని ఆరోపించారు.

జగన్‌ది కోడికత్తి వారియర్స్‌

‘ఆడుదాం ఆంధ్రా’ అంటూ జగన్‌ కొత్త డ్రామాకు తెరలేపారని లోకేశ్‌ విమర్శించారు. ‘క్రీడాకారులనుంచి జేట్యాక్స్‌ వసూలు చేస్తున్నారు. ఐపీఎల్‌ టీం పెడతారంట. దాని పేరు కోడికత్తి వారియర్స్‌’ అని ఎద్దేవా చేశారు. నెలకు రూ.90 కోట్ల విలువ ఇసుక మొత్తంగా అయిదేళ్లకు రూ.5,400 కోట్లు దోచేసి భవన నిర్మాణ కార్మికుల పొట్టకొట్టేశారని విమర్శించారు.

3 నియోజకవర్గాల మీదుగా సాగిన యాత్ర

ముమ్మిడివరం నియోజకవర్గం తాళ్లరేవు మండలం చొల్లంగిపేటలో శుక్రవారం 214వ రోజు ప్రారంభమైన పాదయాత్ర కాకినాడ గ్రామీణ నియోజకవర్గం గురజనాపల్లి, చొల్లంగి, ఉప్పలంక, తూరంగి గ్రామాల మీదుగా కాకినాడలోకి చేరింది. గ్రామీణంలో బహిరంగ సభ అనంతరం తిమ్మాపురం సమీపంలోని యార్లగడ్డ గార్డెన్స్‌లో రాత్రి బస చేశారు. మాజీ ఎమ్మెల్యేలు పిల్లి అనంతలక్ష్మి, వనమాడి కొండబాబు, జనసేన పీఏసీ సభ్యుడు పంతం నానాజీ, ముత్తా శశిధర్‌ తదితరులు స్వాగతం పలికారు. లోకేశ్‌ వెంట తెదేపా నేతలు ప్రత్తిపాటి పుల్లారావు, మందలపు రవి, కాకినాడ జిల్లా పార్టీ అధ్యక్షుడు జ్యోతుల నవీన్‌, చిక్కాల రామచంద్రరావు తదితరులు ఉన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని