ప్రజల్లోకి ఎప్పుడు, ఎలా వస్తానో త్వరలో చెబుతా

Published : 02 Dec 2023 03:42 IST

2003లో శ్రీవారే ప్రాణభిక్ష పెట్టారు..
మొన్న కష్టమొచ్చినప్పుడు తొలుత స్వామిని దర్శించుకుంటానని మొక్కుకున్నా
తిరుమలలో తెదేపా అధినేత చంద్రబాబు

తిరుమల, న్యూస్‌టుడే: ప్రజల్లోకి ఎప్పుడు? ఏ విధంగా రావాలనే అంశంపై త్వరలో వివరాలు వెల్లడిస్తానని తెదేపా అధినేత చంద్రబాబునాయుడు తెలిపారు. స్వామిని తలచుకునే ఏ కార్యక్రమమైనా ప్రారంభిస్తానని వివరించారు. శుక్రవారం ఉదయం తిరుమల శ్రీవారిని సతీసమేతంగా దర్శించుకున్నాక చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. 2003లో ప్రభుత్వం తరఫున శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించడానికి వస్తున్నప్పుడు అలిపిరి వద్ద 24 క్లెమోర్‌మైన్స్‌ పేలినప్పుడు వేంకటేశ్వరస్వామే తనకు ప్రాణభిక్ష పెట్టారని తెలిపారు. మొన్న కష్టమొచ్చినప్పుడు తొలుత ఆయన దర్శనం చేసుకున్నాకే మిగిలిన కార్యక్రమాలు చేస్తానని మొక్కుకున్నానని పేర్కొన్నారు. ఈ మొక్కు తీర్చుకునేందుకు తిరుమల వచ్చానని వెల్లడించారు. ‘ప్రపంచంలో మన దేశం అగ్రగామిగా ఉండాలి. అందులో తెలుగుజాతి నంబర్‌వన్‌గా నిలవాలన్నదే ఆకాంక్ష. స్వామి నాతో సంకల్పం చేయించారు. దాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు శక్తి సామర్థ్యాలు, తెలివితేటలు, ఆరోగ్యం అందించి ఆశీర్వదించమని కోరుకున్నా. ఇక్కడ రాజకీయాలు మాట్లాడను. మరో 2, 3 దేవాలయాలనూ దర్శించుకుంటా’ అని తెలిపారు.

సంప్రదాయ వస్త్రధారణలో వైకుంఠం క్యూకాంప్లెక్స్‌ మీదుగా ఆలయం వద్దకు చంద్రబాబు చేరుకోగా తితిదే అధికారులు సాదర స్వాగతం పలికారు. ముందుగా ధ్వజస్తంభానికి నమస్కరించి స్వామివారిని దర్శించుకుని హుండీలో కానుకలు సమర్పించారు. అనంతరం రంగనాయకుల మండపంలో చంద్రబాబు దంపతులకు వేదపండితులు వేదాశీర్వచనం అందించారు. ఆలయం వెలుపల వేచి ఉన్న భక్తుల వద్దకు వెళ్లి చంద్రబాబు పలకరించారు. ఈ సందర్భంగా ‘జై చంద్రబాబు.. సీఎం’ అంటూ భక్తులు నినాదాలు చేయడంతో వారిని వారించారు. మంగళగిరికి చెందిన కామేశ్వరి పోలీసు భద్రతా వలయాన్ని ఛేదించుకుని చంద్రబాబు వద్దకు వచ్చి కన్నీరుమున్నీరయ్యారు. ఆమెను చంద్రబాబు ఓదార్చారు. ఆయన వెంట కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మి, రాష్ట్ర మాజీ మంత్రులు అమరనాథ్‌రెడ్డి, గంటా శ్రీనివాసరావు, సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, ఎమ్మెల్సీలు భూమిరెడ్డి రామగోపాల్‌రెడ్డి, కంచర్ల శ్రీకాంత్‌, మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ తదితరులు శ్రీవారిని దర్శించుకున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని