Pawan Kalyan: తెదేపాతో పొత్తుపై నోరు జారితే సహించను

‘జనసేన తెదేపా పొత్తుపై వ్యతిరేకంగా ఏ స్థాయి నాయకులు మాట్లాడినా, చిన్న కార్యకర్త మాట్లాడినా ఊరుకునేది లేదు. అలాంటివారిని వైకాపా కోవర్టులుగా భావిస్తాం. గట్టి చర్యలు తీసుకుంటాం.

Updated : 02 Dec 2023 07:29 IST

ఇష్టం లేకపోతే వెళ్లిపోండి
కోట్ల మంది భవిష్యత్తు కోసం పొత్తు నిర్ణయం
మోదీయే అర్థం చేసుకున్నారే.. మీకు అర్థం కాకపోతే ఎలా?
కురుక్షేత్రం కాదు - జగన్‌ దోపిడీపై యుద్ధం
జనసేన విస్తృత సమావేశంలో పవన్‌ కల్యాణ్‌

ఈనాడు, అమరావతి: ‘జనసేన తెదేపా పొత్తుపై వ్యతిరేకంగా ఏ స్థాయి నాయకులు మాట్లాడినా, చిన్న కార్యకర్త మాట్లాడినా ఊరుకునేది లేదు. అలాంటివారిని వైకాపా కోవర్టులుగా భావిస్తాం. గట్టి చర్యలు తీసుకుంటాం. ఈ నిర్ణయం నచ్చనివాళ్లు ఎవరైనా ఉంటే వైకాపాలోకి వెళ్లిపోవచ్చు’ అని జనసేన అధ్యక్షులు పవన్‌ కల్యాణ్‌(Pawan Kalyan) కరాఖండీగా చెప్పారు. ‘కోట్ల మంది ప్రజల భవిష్యత్తును నిర్ణయించే ఈ పొత్తుకు తూట్లు పొడిస్తే జనసేనకో, పవన్‌ కల్యాణ్‌కో తూట్లు పొడిచినట్లు కాదు. ఏ ప్రజల కోసం నిలబడాలనుకుంటున్నామో దానికి తూట్లు పొడుస్తున్నట్లు. అందుకే అలాంటి చర్యలను సహించను’ అని తేల్చి చెప్పారు. అవివేకంతోనో, అజ్ఞానంతోనో ఈ పొత్తు నిర్ణయం తీసుకోలేదన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో శుక్రవారం నిర్వహించిన జనసేన పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో ఆయన ప్రసంగించారు. తెదేపా, జనసేన పొత్తు, భవిష్యత్తు కార్యాచరణ, సంయుక్త పోరాటం తదితర అంశాలపై  మాట్లాడారు.

మోదీయే అర్థం చేసుకుంటే మీకేమైంది?

‘దశాబ్ద కాలంపాటు ఎవరున్నా లేకపోయినా పార్టీని నడిపిన వ్యక్తి.. ఏ నిర్ణయం తీసుకున్నా మనందరికీ మంచి జరిగేలా, రాష్ట్రానికి మేలు చేసేలా, తెలుగు ప్రజలకు అండగా ఉండేలా నిర్ణయం తీసుకుంటాడని సంపూర్ణంగా నమ్మితే మీరు సందేహించరు. గొడవలు పెట్టుకోరు. నన్ను ప్రధాని మోదీ, జేపీ నడ్డా, అమిత్‌ షా, చంద్రబాబు అర్థం చేసుకుంటారు. నేను పెంచి అండగా ఉన్న నాయకులు అర్థం చేసుకోరు. ఎక్కడుంది లోపం? జాతీయ స్థాయిలో నాకు ఉన్న దృష్టి, మనవాళ్లకు ఎందుకు అర్థం కాదు? మోదీ అంతటి వ్యక్తి అర్థం చేసుకుంటే ఇక్కడి కొందరు నాయకులు మిడిమిడి జ్ఞానంతో ఎందుకు ఉంటారు? నా నిర్ణయాలను సందేహించేవారు వైకాపాలోకి వెళ్లిపోవచ్చు. పార్టీ నిర్ణయాలకు వ్యతిరేకంగా సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టినా సీరియస్‌గా తీసుకుంటాను. నేను మొండి వ్యక్తిని, భావజాలాన్ని నమ్మినవాణ్ని. రాజకీయాల్లో ఎవరూ ఎవరినీ బతిమాలరు’ అని తేల్చి చెప్పారు. కేంద్ర ప్రభుత్వం, భాజపా, మోదీ మనకు అండగా ఉంటారన్నారు. ఏ పొత్తయినా 70 శాతమే ఏకాభిప్రాయం ఉంటుందని, మరో 30 శాతం భిన్నాభిప్రాయాలపై చర్చలతో ఒక అంగీకారానికి వచ్చి ముందుకెళ్లాల్సిందే అన్నారు. రాజధానిలో నాలుగు గ్రామాలవారు భూసేకరణకు వ్యతిరేకంగా ఉంటే ఆ చట్టం ప్రయోగించవద్దని నాడు సీఎం చంద్రబాబుతో మాట్లాడి ఒప్పించానని చెప్పారు. ఇలా మన పొత్తుతో ఏర్పడ్డ ప్రభుత్వంలో జనసేన ప్రజల డిమాండ్లు నెరవేర్చగలదన్నారు. ‘భాజపా నాయకులు వచ్చి తెలంగాణలో మనతో పొత్తు పెట్టుకున్నారంటే వాళ్లు తగ్గారని కాదు. మన అవసరాన్ని గుర్తించారు. రాజకీయ ప్రక్రియలో ఎవరినైనా గౌరవించాలి. తెదేపాతో పొత్తులోనూ అదే సూత్రం వర్తిస్తుంది. తెదేపాను తగ్గించేలా మన నాయకులు ఎవరూ మాట్లాడినా సహించేది లేదు’ అని స్పష్టం చేశారు.

జగన్‌ దోపిడీకి వ్యతిరేకంగా యుద్ధం

‘సీఎం జగన్‌ మాట్లాడితే చాలు కురుక్షేత్రం అంటారు. ఆయనేదో తనను కర్ణుడు, అర్జునుడు, భీముడు, ధర్మరాజులా ఊహించుకుంటూ ఉంటారు.

వాళ్లు మహానుభావులు. అరణ్యవాసాలు, అజ్ఞాతవాసాలు చేశారు. జగన్‌ లక్ష కోట్లు దోచేసిన దోపీడీదారుడు. ఆయన దోపిడీకి వ్యతిరేకంగా జరుగుతున్న యుద్ధమే ఇది’ అని పవన్‌ చెప్పారు. పదేళ్లపాటు జగన్‌ రాజకీయాల వైపు చూడకుండా జనసేన ప్రయత్నిస్తుందన్నారు. ఆ తర్వాత ఆయన మారి ఆయనలోని విషం తగ్గితే అప్పుడు వేరే విషయమన్నారు. ఎందుకు ఒంటరిగా పోటీ చేయరని తనను జగన్‌ పదే పదే ప్రశ్నిస్తుంటారని.. ఆయన ఒక మహానుభావుడై ఉంటే అలా ఒంటరిగా పోటీ చేసేవాళ్లమని, ఆయనొక ప్రజాకంటకుడని వ్యాఖ్యానించారు.

వైకాపా కులం ట్రాప్‌లో పడొద్దు

కులాన్ని మోసం చేస్తున్నానంటూ వైకాపా వాళ్లు ప్రచారం చేస్తున్నారని, ఒకే ఒక కులాభిమానంతో రాజకీయ ప్రస్థానం సాధ్యం కాదని పవన్‌ కల్యాణ్‌ చెప్పారు. వైకాపా ప్రయోగించే కులం ట్రాప్‌లో నాయకులు ఎవరూ పడొద్దన్నారు.

నియోజకవర్గాల నాయకులతో సమావేశాలు

డిసెంబరు 9, 10 తేదీల నుంచి మంగళగిరి కార్యాలయం లేదా రాజమహేంద్రవరంలో నియోజకవర్గ పార్టీ ఇన్‌ఛార్జులు, కీలక నాయకులతో సమావేశమై అభిప్రాయాలు తెలుసుకుంటానని జనసేన అధినేత చెప్పారు. తన వద్ద కూడా నివేదికలు, డేటా ఉన్నాయని, అక్కడి నాయకుల పనితీరు తెలుసునని స్పష్టం చేశారు. భవిష్యత్తులో ఏర్పాటు చేయబోయే ప్రభుత్వంపై అభిప్రాయాలు తెలుసుకుంటానని అన్నారు.

లోకేశ్‌ యువగళంలో పాల్గొనండి

జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ మాట్లాడుతూ లోకేశ్‌ యువగళం కార్యక్రమంలో జనసేన నాయకులు, కార్యకర్తలు అంతా పాల్గొనాలని నిర్దేశించారు. తెదేపా చేపట్టే ప్రతి కార్యక్రమంలోనూ జనసేన శ్రేణులు కలిసి వెళ్లాలన్నారు.  సమావేశంలో పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని