కేసీఆర్‌తో జగన్‌ దోస్తీ ఆస్తులు కాపాడుకోవడానికేనా?

తెలంగాణలో తనకున్న ఆస్తులను కాపాడుకోవడానికే సీఎం జగన్‌ కేసీఆర్‌తో దోస్తీ చేస్తున్నారా అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ప్రశ్నించారు.

Updated : 02 Dec 2023 06:09 IST

సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ప్రశ్న

ఈనాడు, అమరావతి: తెలంగాణలో తనకున్న ఆస్తులను కాపాడుకోవడానికే సీఎం జగన్‌ కేసీఆర్‌తో దోస్తీ చేస్తున్నారా అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ప్రశ్నించారు. విభజన చట్టం ప్రకారం ఏపీకి రావాల్సిన వాటి గురించి ఇప్పటి వరకు కేంద్రాన్ని, కేసీఆర్‌ను ఎందుకు ప్రశ్నించలేదు? నీటి పంపకాల విషయంలో నాలుగున్నరేళ్లుగా ఎందుకు నోరు మెదపలేదని నిలదీశారు. తన ప్రశ్నలకు జగన్‌ సమాధానాలు చెప్పాలని శుక్రవారం ఓ ప్రకటనలో ఆయన డిమాండ్‌ చేశారు. ‘‘కృష్ణా జలాలపై ఎప్పుడూ నోరు విప్పకుండా తెలంగాణలో పోలింగ్‌ రోజే మంత్రి అంబటి రాంబాబు ఎందుకు హడావుడి చేశారు. సెంటిమెంట్‌ రాజేసి, కేసీఆర్‌కు మేలు చేయడం కోసం కదా? నాలుగేళ్లుగా మౌనంగా ఉండి, తెదేపాపై నెపం వేయాల్సిన అవసరం ఏం వచ్చింది. జగన్‌కు రాష్ట్రం కంటే కేసీఆర్‌ ప్రయోజనాలే ముఖ్యమా’’ అని ప్రశ్నించారు. తెలంగాణలో కేసీఆర్‌కు లబ్ధి చేకూర్చాలనే దురాలోచనతోనే తెలంగాణలో పోలింగ్‌ రోజున నాగార్జునసాగర్‌ డ్యామ్‌ వద్ద ఏపీ పోలీసులు హైడ్రామా సృష్టించారని ఆరోపించారు. సున్నితమైన కృష్ణా జలాల అంశాన్ని మంత్రి అంబటి వివాదాస్పదం చేస్తున్నారని పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని