రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిది

రాష్ట్రాన్ని కాపాడుకునే శక్తిని ప్రసాదించాలని అప్పన్నస్వామిని కోరుకున్నట్లు తెదేపా అధినేత చంద్రబాబు పేర్కొన్నారు. దుష్టశక్తులపై పోరాడే బలాన్ని ఇవ్వాలని ప్రార్థించానన్నారు.

Published : 04 Dec 2023 04:18 IST

అధికారంలోకి రాగానే పంచగ్రామాల సమస్యను పరిష్కరిస్తాం
సింహాచలం అప్పన్నను దర్శించుకున్న చంద్రబాబు

ఈనాడు, విశాఖపట్నం: రాష్ట్రాన్ని కాపాడుకునే శక్తిని ప్రసాదించాలని అప్పన్నస్వామిని కోరుకున్నట్లు తెదేపా అధినేత చంద్రబాబు పేర్కొన్నారు. దుష్టశక్తులపై పోరాడే బలాన్ని ఇవ్వాలని ప్రార్థించానన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని, ఆ దిశలో అందరూ కలిసికట్టుగా ముందుకు సాగాలని కోరారు. సతీమణి భువనేశ్వరితో కలిసి ఆయన ఆదివారం సింహాచలం అప్పన్నస్వామిని దర్శించుకున్నారు. రాజగోపురం వద్ద ఆలయ ధర్మకర్త అశోక్‌గజపతిరాజు చంద్రబాబుకు ఘనస్వాగతం పలికారు. అనంతరం ఆలయ పండితులు వేదమంత్రాలతో తోడ్కొని వెళ్లి స్వామి దర్శనం చేయించారు. అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ.. ‘సింహాచలం క్షేత్రాన్ని తరాలుగా అభివృద్ధి చేసుకుంటూ వంశపారపర్యంగా వస్తున్న అశోక్‌ను ఎన్ని ఇబ్బందులు పెట్టారో చూశాం. ఇక్కడ ధర్మాన్ని నాశనం చేయడానికే అలా చేశారు. ధార్మిక ట్రస్టును ఏర్పాటుచేసి సమాజానికి మంచి భవిష్యత్తును ఇవ్వాలని తాపత్రయపడ్డవారిపై ఎలా దౌర్జన్యానికి పాల్పడ్డారో చూశాం’ అని పేర్కొన్నారు. 

 

పంచగ్రామాల సమస్యను పరిష్కరిస్తాం

తెదేపా అధికారంలోకి రాగానే పంచగ్రామాల సమస్యను పరిష్కరిస్తామని చంద్రబాబు పేర్కొన్నారు. గతంలోనే శాశ్వత పరిష్కారం దిశగా ఉత్తర్వులిస్తే దానిపై స్టే తీసుకొచ్చి అడ్డుకున్నారని, ఈ ప్రభుత్వం పరిష్కారం చూపలేదని వివరించారు. కార్యకర్తలు విమానాశ్రయ ఆవరణలోకి వెళ్లి చంద్రబాబును స్వాగతించారు. గోపాలపట్నం, సింహాచలం ప్రాంతాల్లో ప్రజలు బ్రహ్మరథం పట్టారు. తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, మాజీ మంత్రులు అయ్యన్నపాత్రుడు, కళావెంకటరావు, బండారు సత్యనారాయణమూర్తి, ఎమ్మెల్యేలు గంటా శ్రీనివాసరావు, వెలగపూడి రామకృష్ణబాబు, ఎమ్మెల్సీ దువ్వారపు రామారావు, చిరంజీవిరావు తదితరులు పాల్గొన్నారు.

రేపు శ్రీశైలానికి చంద్రబాబు

శ్రీశైలం ఆలయం, న్యూస్‌టుడే: శ్రీశైలం శ్రీభ్రమరాంబ మల్లికార్జునస్వామివార్లను తెదేపా అధినేత చంద్రబాబునాయుడు మంగళవారం దర్శించుకోనున్నారు. ఇందుకోసం అధికారులు ఏర్పాట్లుచేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని