భాజపా ఎంపీలకు మిశ్రమ ఫలితాలు

లోక్‌సభ ఎన్నికలకు ముందు సెమీ ఫైనల్స్‌గా పరిగణించే నాలుగు కీలక రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను సవాల్‌గా తీసుకున్న భాజపా.. గెలుపు లక్ష్యంగా సర్వశక్తులొడ్డింది.

Published : 04 Dec 2023 05:52 IST

అసెంబ్లీ స్థానాల్లో కొన్నిచోట్లే గెలిచిన పార్లమెంటు సభ్యులు

దిల్లీ: లోక్‌సభ ఎన్నికలకు ముందు సెమీ ఫైనల్స్‌గా పరిగణించే నాలుగు కీలక రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను సవాల్‌గా తీసుకున్న భాజపా.. గెలుపు లక్ష్యంగా సర్వశక్తులొడ్డింది. బలమైన ప్రభావాన్ని చూపేందుకు గట్టి అభ్యర్థులను రంగంలోకి దించింది. ఇందులో భాగంగా పలుచోట్ల ఎంపీలను పోటీలో పెట్టింది. ముఖ్యంగా మధ్యప్రదేశ్‌లో దీర్ఘకాలంగా అధికారంలో ఉండటంతో ప్రజల్లో తమ ప్రభుత్వం పట్ల ఎంతోకొంత వ్యతిరేకత ఉండొచ్చని అంచనా వేసిన కమలనాథులు.. అక్కడ ముగ్గురు కేంద్ర మంత్రులు సహా ఏడుగురు పార్లమెంటు సభ్యులను పోటీలో నిలిపింది. వీరిలో చాలా మంది ఒకింత కష్టమైన స్థానాల్లో బరిలోకి దిగారు. ఈ చర్య ద్వారా క్యాడర్‌లో ఉత్సాహాన్ని నింపే ప్రయత్నాన్ని పార్టీ చేసింది. అలాగే సీఎం పీఠంపై వివిధ వర్గాల్లో ఆశలు రేకిత్తించింది. 21 చోట్ల ఇలాంటి ప్రయోగం చేసిన భాజపా.. 11 చోట్ల విజయాన్ని సాధించింది. బరిలోకి దిగిన నలుగురు కేంద్ర మంత్రుల్లో ఫగ్గన్‌సింగ్‌ కులస్తే ఒక్కరే పరాజయం పాలయ్యారు. తెలంగాణలో భాజపా తరఫున పోటీ చేసిన ముగ్గురు ఎంపీలకూ ఓటమి తప్పలేదు.

  • మధ్యప్రదేశ్‌లో శాసన సభకు పోటీ చేసిన కేంద్ర మంత్రుల్లో నరేంద్ర సింగ్‌ తోమర్‌ (దిమనీ నియోజకవర్గం), ప్రహ్లాద్‌ సింగ్‌ పటేల్‌ (నర్సింగ్‌పుర్‌) విజయం సాధించగా నివాస్‌ స్థానంలో ఫగ్గన్‌సింగ్‌ ఓటమి పాలయ్యారు. ఈ రాష్ట్రం నుంచి పోటీ చేసిన ఎంపీల్లో రాకేశ్‌ సింగ్‌ (జబల్పుర్‌-పశ్చిమ), ఉదయ్‌ప్రతాప్‌ సింగ్‌ (గాడర్వారా), రీతి పాఠక్‌ (సీధీ) గెలుపొందగా, గణేశ్‌ సింగ్‌ (సత్నా) పరాజయం పాలయ్యారు.  
  • రాజస్థాన్‌ నుంచి బరిలోకి దిగిన ఎంపీల్లో రాజ్యవర్థన్‌ సింగ్‌ రాఠోడ్‌ (ఝోట్వాడా), దియా కుమారి (విద్యానగర్‌), కిరోడిలాల్‌ మీనా (సవాయ్‌ మాధోపుర్‌), బాబా బాలక్‌నాథ్‌ (తిజారా) విజయం సాధించారు. నరేంద్ర కుమార్‌ (మండావా, భగీరథ్‌ చౌధరి (కిషన్‌గఢ్‌), దేవ్‌జీ పటేల్‌ (సంచోర్‌) ఓటమి చెందారు.
  • ఛత్తీస్‌గఢ్‌లో భరత్‌పుర్‌-సోన్‌హత్‌ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన కేంద్ర మంత్రి రేణుకా సింగ్‌ గెలుపొందారు. అలాగే ఆ పార్టీ తరఫున బరిలోకి దిగిన ఎంపీల్లో గోమతి సాయి (పత్తల్‌గావ్‌ అసెంబ్లీ స్థానం), అరుణ్‌ సావో (లోర్మి) విజయం సాధించారు. పటాన్‌ స్థానంలో ముఖ్యమంత్రి భూపేశ్‌ బఘేల్‌తో తలపడిన భాజపా పార్లమెంటు సభ్యుడు విజయ్‌ బఘేల్‌ ఓడిపోయారు.
  • తెలంగాణలో పోటీ చేసిన బండి సంజయ్‌ (కరీంనగర్‌), సోయం బాపురావు (బోథ్‌), ధర్మపురి అర్వింద్‌ (కోరుట్ల) ఓటమిపాలయ్యారు.

14 రోజుల్లో రాజీనామా చేయాలి

ఈ ఎన్నికల్లో విజయం సాధించిన ఎంపీలు 14 రోజుల్లోగా ఏదో ఒక చట్టసభ సభ్యత్వాన్ని వదులుకోవాల్సి ఉంటుందని రాజ్యాంగ నిపుణులు చెబుతున్నారు. లేదంటే పార్లమెంటు సభ్యత్వాన్ని కోల్పోవాల్సి ఉంటుందన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని