ఇండోసెల్‌ కంపెనీకి జగన్‌ కానుక రూ.90 కోట్లు

నెల్లూరు వద్ద ఇండోసెల్‌ కంపెనీ నెలకొల్పనున్న సోలార్‌ ప్యానల్‌ ప్లాంటుకు జగన్‌ ప్రభుత్వం భారీ ఉచిత కానుక ఇస్తోందని భాజపా అధికార ప్రతినిధి లంకా దినకర్‌ ఆరోపించారు.

Published : 05 Dec 2023 02:33 IST

విద్యుత్తు లైన్‌, ఉపకేంద్రం నిర్మాణానికి ట్రాన్స్‌కో నిధులా?
భాజపా అధికార ప్రతినిధి లంకా దినకర్‌

ఈనాడు, అమరావతి: నెల్లూరు వద్ద ఇండోసెల్‌ కంపెనీ నెలకొల్పనున్న సోలార్‌ ప్యానల్‌ ప్లాంటుకు జగన్‌ ప్రభుత్వం భారీ ఉచిత కానుక ఇస్తోందని భాజపా అధికార ప్రతినిధి లంకా దినకర్‌ ఆరోపించారు. విజయవాడలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో సోమవారం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ ‘ప్రైవేటు సంస్థ నెలకొల్పే పరిశ్రమలకు అవసరమైన విద్యుత్తు లైన్‌, ఉపకేంద్రానికి అయ్యే వ్యయాన్ని ఆయా సంస్థలే భరించాలి. కానీ, ఇండోసెల్‌ సోలార్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌పై జగన్‌ ప్రభుత్వం ప్రత్యేక అభిమానం చూపుతోంది. దాదాపు రూ.80 కోట్ల నుంచి రూ.90 కోట్ల ట్రాన్స్‌కో నిధులతో వీటిని ఏర్పాటు చేయాలని ఉత్తర్వులిచ్చినట్లు తెలిసింది. జగన్‌ ప్రభుత్వం తనకు కావాల్సిన వ్యక్తుల కంపెనీ అయిన ఇండోసెల్‌కు వేల ఎకరాల భూములు, విద్యుత్తు ప్రాజెక్టులను అప్పనంగా కట్టబెడుతోంది. ప్రజలపై ఛార్జీల రూపేణా మోయలేని భారాన్ని వేస్తోంది’ అని దినకర్‌ ఆరోపించారు. రాష్ట్ర పారిశ్రామిక విధానం ప్రకారం వినియోగించిన విద్యుత్తుపై మాత్రమే కంపెనీలకు రాయితీ ఉంటుంది తప్ప.. లైన్లకు, ఉపకేంద్రాలకు ఉండదని గుర్తుచేశారు. 2024 ఏప్రిల్‌ 1 నుంచి 3,800 మెగావాట్ల విద్యుత్తు కొనుగోలు చేసేలా ఓ ప్రైవేటు కంపెనీతో ఒప్పందం చేసుకొని, ప్రస్తుత డిసెంబరు నుంచే కొనడం వెనుక మతలబేంటని ప్రశ్నించారు. ఆలస్యమైతే ప్రభుత్వ పెద్దలకు అవినీతి సొమ్ము దక్కదనే ఉద్దేశంతోనే ఒప్పందాన్ని ముందుకు జరిపారా అని సందేహం వ్యక్తంచేశారు. ఇండోసెల్‌ సోలార్‌ ప్రైవేటు లిమిటెడ్‌, షిర్డీసాయి ఎలక్ట్రికల్స్‌ లిమిటెడ్‌ కంపెనీల ప్రమోటర్లు ఒక్కరేనని, ఈ రెండు కంపెనీలూ జగన్‌ జేబు సంస్థలేనని దినకర్‌ ఆరోపించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని