ఓటమిపై అసహనాన్ని పార్లమెంటులో చూపొద్దు

దేశంలో వివిధ శాసనసభలకు జరిగిన ఎన్నికల్లో ఎదురైన ఓటమితో అసహనానికి గురై దానిని పార్లమెంటులో చూపించవద్దని ప్రధాని నరేంద్రమోదీ విపక్షాలకు సూచించారు.

Updated : 05 Dec 2023 05:45 IST

వ్యతిరేకతను వీడితే మీపై ప్రజా దృక్పథం మారుతుంది
విపక్షాలకు సూచించిన ప్రధాని మోదీ

దిల్లీ: దేశంలో వివిధ శాసనసభలకు జరిగిన ఎన్నికల్లో ఎదురైన ఓటమితో అసహనానికి గురై దానిని పార్లమెంటులో చూపించవద్దని ప్రధాని నరేంద్రమోదీ విపక్షాలకు సూచించారు. వ్యతిరేక ధోరణిని విడిచిపెట్టి ముందడుగు వేస్తే వారిపట్ల ప్రజా దృక్పథం మారే అవకాశం ఉంటుందని, కొత్త ద్వారాలు తెరచుకోవచ్చని చెప్పారు. సోమవారం శీతాకాల సమావేశాల ప్రారంభానికి ముందు పార్లమెంటు వెలుపల ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రతికూలతను దేశం తిరస్కరించిందన్నారు. ‘‘ఈసారి శీతాకాలం ఇంకా రాకపోయినా రాజకీయ వేడి మాత్రం విపరీతంగా పెరిగింది. ఆదివారం వెలువడిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు సంతృప్తినిచ్చాయి. సుపరిపాలనకు, జనహితం కోసం పాటుపడిన వారికి ప్రజలు పట్టం కట్టారు. ప్రజా సంక్షేమం కోసం నిబద్ధతతో పనిచేస్తే, మంచి పాలన అందిస్తే ప్రభుత్వ వ్యతిరేకత అనేది ఉండదని రుజువైంది’’ అని ప్రధాని తెలిపారు.

నమ్మకాన్ని కోల్పోవాల్సిన అవసరం లేదు

‘‘ఈ ఫలితాలను చూసిన తర్వాత ప్రతిపక్ష సభ్యులకు నేనో విషయం చెప్పాలనుకుంటున్నా. తొమ్మిదేళ్లుగా వారికి అలవాటుగా మారిన నెగెటివిటీని పక్కనబెట్టి ఈ ఓటమి నుంచి పాఠాలు నేర్చుకోవాలి. వారు ప్రతిపక్షంలో ఉన్నా సరే నేనైతే వారికి ఈ సలహా ఇస్తున్నా. ప్రతి ఒక్కరి భవిష్యత్తు అద్భుతంగా ఉంటుంది. నమ్మకాన్ని కోల్పోవాల్సిన అవసరం లేదు’’ అని మోదీ చెప్పారు. ‘‘పార్లమెంటు సమావేశాలు విపక్షాలకు సువర్ణావకాశం. సభ్యులంతా ఫలప్రదమైన చర్చలు జరపాలి. ప్రజాకాంక్షలు నెరవేర్చడానికి ప్రజాస్వామ్య దేవాలయం ముఖ్యమైన వేదిక. సభ్యులు అన్నివిధాలా సిద్ధమై బిల్లులపై సమగ్ర చర్చకు మంచి ఆలోచనలతో, సానుకూల దృక్పథంతో రావాలి. ప్రజాస్వామ్యంలో విపక్షాలూ ముఖ్యం. 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా ఎదిగేందుకు పార్లమెంటు కార్యకలాపాలు ముందుకు సాగేలా సభ్యులంతా సహకరించాలి’’ అని కోరారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని