గుండెపోటుతో జనగామ జడ్పీ ఛైర్మన్‌ మృతి

జనగామ జిల్లా పరిషత్తు ఛైర్మన్‌, భారాస జిల్లా అధ్యక్షుడు పాగాల సంపత్‌రెడ్డి (55) సోమవారం సాయంత్రం గుండెపోటుతో మృతిచెందారు. మధ్యాహ్నం స్టేషన్‌ఘన్‌పూర్‌లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో స్టేషన్‌ ఘన్‌పూర్‌లో గెలుపొందిన కడియం శ్రీహరితో కలిసి పాల్గొన్నారు.

Published : 05 Dec 2023 05:00 IST

సంతాపం ప్రకటించిన కేసీఆర్‌

ఈనాడు, వరంగల్‌, చిల్పూరు, న్యూస్‌టుడే: జనగామ జిల్లా పరిషత్తు ఛైర్మన్‌, భారాస జిల్లా అధ్యక్షుడు పాగాల సంపత్‌రెడ్డి (55) సోమవారం సాయంత్రం గుండెపోటుతో మృతిచెందారు. మధ్యాహ్నం స్టేషన్‌ఘన్‌పూర్‌లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో స్టేషన్‌ ఘన్‌పూర్‌లో గెలుపొందిన కడియం శ్రీహరితో కలిసి పాల్గొన్నారు. అనంతరం హనుమకొండలోని తన ఇంటికి వెళ్లాక ఛాతిలో నొప్పి వస్తున్నట్టు కుటుంబసభ్యులకు చెప్పి స్పృహ కోల్పోయారు. వారు  వెంటనే హనుమకొండలోని ఒక ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ కొద్దిసేపటికే మృతిచెందారు. ఆదివారం.. మరోసారి కేసీఆర్‌ ముఖ్యమంత్రి కాలేకపోయారంటూ సంపత్‌రెడ్డి తీవ్ర మనస్తాపానికి గురైనట్టు పార్టీ కార్యకర్తలు తెలిపారు. సంపత్‌రెడ్డికి భార్య సుజాత, కుమార్తె సంజన ఉన్నారు. కొడుకు ఓ రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. సంపత్‌రెడ్డి తెలంగాణ ఉద్యమ సమయం నుంచి భారాసలో చురుగ్గా పనిచేస్తున్నారు. 2019లో చిల్పూరు జడ్పీటీసీ సభ్యుడిగా గెలుపొంది జడ్పీ ఛైర్మన్‌ అయ్యారు. అనంతరం పార్టీ జిల్లా అధ్యక్షుడిగా కూడా నియమితులయ్యారు. తాజాగా జరిగిన ఎన్నికల్లో సంపత్‌రెడ్డి చురుగ్గా ప్రచారం చేశారు. తెలంగాణ ఉద్యమం తొలినాళ్ల నుంచి తన వెంట నడిచిన సంపత్‌రెడ్డి మరణం బాధాకరమని కేసీఆర్‌ పేర్కొన్నారు. సంపత్‌రెడ్డి మృతికి  కేటీఆర్‌, హరీశ్‌రావు సంతాపం తెలిపారు. మంగళవారం స్వగ్రామం రాజవరంలో జరిగే అంత్యక్రియలకు కేటీఆర్‌ హాజరవుతారని పార్టీ వర్గాలు తెలిపాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని