మూడు పార్టీల కలయికతో శత్రు సంహారం

రాష్ట్రంలోని మూడు ప్రధాన పార్టీలు కూటమిగా వచ్చే శాసనసభ ఎన్నికల్లో శత్రుసంహారం చేస్తాయని వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు అన్నారు. దిల్లీలో సోమవారం ఆయన విలేకర్లతో మాట్లాడారు.

Updated : 05 Dec 2023 06:27 IST

వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు

ఈనాడు, దిల్లీ: రాష్ట్రంలోని మూడు ప్రధాన పార్టీలు కూటమిగా వచ్చే శాసనసభ ఎన్నికల్లో శత్రుసంహారం చేస్తాయని వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు అన్నారు. దిల్లీలో సోమవారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. ఎన్నికల్లో కలిసి వెళ్లాలని తెదేపా, జనసేన ఇప్పటికే నిర్ణయించుకున్నాయని, ఆ పార్టీలతో భాజపా కలిసే అవకాశం ఉందన్నారు. రాష్ట్రాన్ని ప్రస్తుత పాలకులు సర్వనాశనం చేశారని, ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధి చెందాలంటే కేంద్ర ప్రభుత్వ సహకారం చాలా అవసరమన్నారు. ఉత్తరాదిన భాజపా ప్రభంజనం స్పష్టంగా కనిపిస్తోందన్నారు. రాష్ట్ర సమగ్రాభివృద్ధి కోసం భాజపాను ఒప్పించే బాధ్యత పవన్‌కల్యాణ్‌ తీసుకుంటారని చెప్పారు.

అభివృద్ధి, శాంతిభద్రతల పరిరక్షణ, సంక్షేమ కార్యక్రమాల అమల్లో కేసీఆర్‌ ప్రభుత్వం ఎంతో కృషిచేసినా ఎమ్మెల్యేలపై వ్యతిరేకతతో అక్కడ అధికారపార్టీకి పరాజయం తప్పలేదన్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని 175 స్థానాల్లో అధికారపార్టీకి 15-20 స్థానాలు కూడా వచ్చే పరిస్థితి కనిపించడం లేదన్నారు. తెలంగాణలో భారాస తరఫున సర్వే టీంల నిర్వహణ, ధనం పంపిణీ విషయంలో సమన్వయానికి చెవిరెడ్డి భాస్కరరెడ్డిని నియమించింది నిజం కాదా అని ఆయన ప్రశ్నించారు. మూడు రాష్ట్రాల్లో విజయం సాధించడంతో పాటు తెలంగాణలో ఎనిమిది స్థానాలు గెలుచుకున్నందున భాజపా అగ్ర నాయకులను కలిసి అభినందనలు తెలియజేసినట్లు ఎంపీ తెలిపారు.

తెలంగాణలో కాంగ్రెస్‌ విజయంలో కీలకపాత్ర పోషించిన సహచర ఎంపీలు రేవంత్‌ రెడ్డి, ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డితో పాటు సీఎల్పీ నేత భట్టి విక్రమార్కకు అభినందనలు తెలుపుతున్నట్లు చెప్పారు. తెదేపా అధినేత చంద్రబాబు తెలంగాణ ఎన్నికల విషయంలో తటస్థంగా వ్యవహరించారని రఘురామ తెలిపారు. రాష్ట్రాన్ని ప్రస్తుత పాలకులు దారుణంగా దెబ్బతీయడంతో దానిని గాడిలో పెట్టేందుకు చంద్రబాబు స్వరాష్ట్రంపైనే దృష్టి పెట్టారన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని